కొలువు దీరనున్న గణనాథులు

ABN , First Publish Date - 2022-08-31T05:37:19+05:30 IST

వినాయకచవితి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. గద్వాల పట్టణంతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాల ప్రజలు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

కొలువు దీరనున్న గణనాథులు
గద్వాల పట్టణంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న మట్టి గణపతి విగ్రహాలు

- నేడు వినాయక చవితి

- ఉత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు 

- జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన మండపాలు

- పూలు, పండ్లు, పత్రి కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్లు

గద్వాల టౌన్‌, ఆగస్టు 30 : వినాయకచవితి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. గద్వాల పట్టణంతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాల ప్రజలు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నడుమ అంతంత మాత్రంగానే సాగిన వేడుకలు ఈ ఏడాది వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో మార్కెట్లు కళకళ లాడాయి. వినాయకుడిని పూజించేందుకు అవసర మైన సరుకులు, పూలు, పండ్లు, పత్రిలు, చెరుకు గడలు, మొక్కజొన్న కంకులు కొనేవారితో మార్కెట్‌ సందడిగా మారింది. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు విక్రయించే కేంద్రాలు జనంతో కిటకిటలాడాయి. ఉత్సవ నిర్వాహకులు భారీ గణపతి విగ్రహాలను కొనుగోలు చేసి ట్రాక్టర్లు, లారీల్లో మండపాలకు తరలించడం కనిపించింది. ఈ సారి ప్రజలు మట్టి వినాయక విగ్రహాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నట్లు విక్రేతలు తెలిపారు. 


అయిజ : పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల విక్రయ కేంద్రాలు మంగళవారం రద్దీగా మారాయి. పట్టణంలో పలు చోట్ల మండపాలను సిద్ధం చేసి, విద్యుత్‌ దీపాలను అలంకరించారు. పూజ సామగ్రి, మండపాల అలంకర ణ సామగ్రి కొనుగోలు చేయడంలో ఉత్సవ నిర్వాహ కులు బిజీగా కనిపించారు. 


ఉండవల్లి : మండల కేంద్రంతో పాటు కంచుపాడు, చిన్న ఆముదాలపాడు, తక్కశిల, ప్రాగటూర్‌ తదితర గ్రామాలల్లో వినాయక మండపాలు ముస్తాబవుతున్నాయి. కొలువుదీరడానికి వినాయక విగ్రహా లు సిద్ధంగా ఉన్నాయి. మండల పరిధిలో 46 వినాయ క మండలపాల ఏర్పాటుకు ఆన్‌లైన్లో అనుమతులు ఇచ్చినట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. వినాయక మండపాల దగ్గర నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పోలీసుల సూచనలు, సలహాలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఎస్‌ఐ బాలరాజు కోరారు.Read more