బాలల హక్కులను కాపాడాలి

ABN , First Publish Date - 2022-10-12T04:20:02+05:30 IST

బాలల హక్కులను కాపాడే భాద్యత మనందరిపై ఉన్నదని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

బాలల హక్కులను కాపాడాలి
బాలికా దినోత్సవంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- అలూర్‌లో ఘనంగా బాలికా దినోత్సవం

గట్టు, అక్టోబరు 11 : బాలల హక్కులను కాపాడే భాద్యత మనందరిపై ఉన్నదని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకని గట్టు మండలంలోని ఆలూరు రైతు వేదికలో మంగళ వారం నిర్వహించిన విలేజ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అథితిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను పత్తి చేలలో పనికి పంపించొద్దని, తప్పనిసరిగా బడికి పంపించాలని చెప్పారు. పిల్లలు ప్రతీ రోజు బడికి వచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని మాట్లాడుతూ గతంలో తనకు పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించా రని తెలిపింది. పెళ్లి వద్దు, చదువుకుంటానని చెప్పినా వారు అంగీకరించకపోవడంతో 1098కు ఫోన్‌ చేశానని చెప్పింది. దీంతో వారొచ్చి పెళ్లిని ఆపేశారని కలెక్టర్‌కు వివరించింది. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్య వివాహలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో చిన్న పిల్లలకు పెళ్లి చేయకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. సీడ్‌ పత్తి సాగు చేసేవారు బాలికలను పనిలో పెట్టుకోవద్దని ఆదేశించారు. పాఠశాల అవరణను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి చెప్పారు. ఆ తర్వాత అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం, బాలామృతాలను సక్రమంగా అందించాలని టీచర్‌ను ఆదేశించారు. వివరాలను అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్యామ్‌సుందర్‌, సర్పంచ్‌ కుర్వ మల్లమ్మ, ఎంపీపీ విజయ్‌, ఎంపీడీవో చెన్నయ్య, సీడీపీవో కమలాదేవి, ఎంపీటీసీ ఆనంద్‌ పాల్గొన్నారు.


నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలి

ధరూరు : నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. అవి బాగా పెరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా కృషి చేయాలని చెప్పారు. మండల పరిధిలోని మార్లవీడు పల్లె ప్రకృతివనాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరా లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో జబ్బార్‌, ఎంపీవో కృష్ణమూర్తి, సర్పంచ్‌ సుజాత, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. 

Updated Date - 2022-10-12T04:20:02+05:30 IST