‘కారు’ చిచ్చు!

ABN , First Publish Date - 2022-09-20T04:49:28+05:30 IST

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది.. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఊహాగానాలు లేవు.. ఇప్పటికే సిట్టింగులకు సీట్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

‘కారు’ చిచ్చు!

అలంపూర్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో విభేదాలు

ఎన్నికలకు ఏడాది ముందే పంచాయతీలకు దిగుతున్న నాయకులు

జాతీయ సమైక్యతా ఉత్సవాల సందర్భంగా పరస్పర దాడులు

నేడు సాయిచంద్‌ పుట్టిన రోజు వేడుకల నేపథ్యంలోనియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లు

గొడవలకు దారితీసే పరిస్థితి

నియోజకవర్గంలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు


గద్వాల, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది.. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఊహాగానాలు లేవు.. ఇప్పటికే సిట్టింగులకు సీట్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలంపూర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీకి మెజారిటీ బలం ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్న నాయకుల సంఖ్య పెరగడంతో పార్టీలో విభేదాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం అలంపూర్‌ నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్రహాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికార పార్టీ తరఫున ఆయనే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో కొత్త నాయకుల రంగ ప్రవేశం ద్వారా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ ఇటీవల నియోజకవర్గంలో కార్యక్రమాలను విస్తృతం చేయడం, ఎమ్మెల్యేకు తెలియకుండా అసంతృప్త నాయకులను తరచూ కలవడం, తన అనుచ రుల ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేయించడం, మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలను అలంపూర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంతో ఇటీవల ఎమ్మెల్యే వర్గం అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిచంద్‌ వర్గీయులతో పరస్పరం దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ గానీ.. ఇతర ప్రముఖులు గానీ ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో సాయిచంద్‌ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలు గొడవలకు దారితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా జరిగిన గొడవ వివాదానికి కారణం కాగా, నేడు జరుగబోయే వేడుకలు ఎలాంటి పరిస్థితులను కల్పిస్తాయోనని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. 


నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లు..

టీఆర్‌ఎస్‌ మొదటి విడత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఒకటి, రెండు మినహా మిగతా అన్ని స్థానాల్లో సిట్టింగులకే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇచ్చారు. వారు మెజారిటీ సీట్లను దక్కించుకో గలిగారు. అలంపూర్‌ స్థానం నుంచి 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ గెలవగా, 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి అబ్రహాం పోటీచేసి గెలిచారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా సిట్టింగులకు సీట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ అలంపూర్‌ నియోజకవర్గంలో మాత్రం ఈసారి అధికార పార్టీ టికెట్‌ కోసం చాలామంది ఆశావహులుగా ఉన్నారు. కొద్ది రోజుల కిందటి వరకు సాయిచంద్‌ పేరు ఆశావహుల జాబితాలో లేనప్పటికీ ఇటీవల అతను, అతని అనుచరులు చేస్తున్న కార్యక్రమాలతో హాట్‌ టాపిక్‌గా మారారు. పైపెచ్చు గొడవ కూడా జరగడంతో టికెట్‌ ఆశిస్తున్న విషయానికి బలం చేకూరింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి ఇస్తారనే విషయం ఇప్పట్లో తేలదు. ఇటీవల జరిగిన గొడవ తర్వాత కొన్నాళ్లు స్తబ్ధుగా ఉంటారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించాయి. కానీ సాయిచంద్‌ మిత్ర మండలి పేరుతో నియోజకవర్గంలో సుమారు 10 వేల పోస్టర్లను అంటించారు. పైకి పుట్టిన రోజు వేడుకలు అని చెబుతున్నప్పటికీ ఇంకా రచ్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం గమనార్హం. ముందుగా అలంపూర్‌ చౌరస్తా నుంచి అలంపూర్‌ వరకు ర్యాలీ, జోగుళాంబ ఆలయంలో పూజలు, అభిమానులు, అనుచరుల మధ్య ఓ ఫంక్షన్‌ హాల్‌లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. అయితే ఇందులో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదు. 


30 పోలీస్‌ యాక్ట్‌ అమలు..

తాజాగా జరుగుతున్న వివాదాలు, గొడవలను పరిగణ లోకి తీసుకుని పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే సిట్టింగుగా ఉన్నచోట గొడవలకు ఆస్కారం ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించడమే ఇందు కు కారణంగా తెలుస్తోంది. 30 పోలీస్‌ యాక్ట్‌లో భాగంగా అలంపూర్‌ నియోజక వర్గంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలపై నిషేధం ఉంటుంది. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం లేదు. అయితే ముందుగా సాయి చంద్‌ అనుచరులు అనుకున్న విధంగా కార్యక్రమాలు చేపడితే కచ్చితంగా గొడవలు జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయులు సాయిచంద్‌ అనుచరులు చేస్తున్న కార్యక్రమాలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో  కార్యక్రమాలు నిర్వహిస్తే కచ్చితంగా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అయితే 30 పోలీసు యాక్టు అమలు చేయడంతో సాయిచంద్‌ అనుచరులు కేవలం జోగుళాంబ దర్శనానికే పరిమితం అవుతారా? లేక యాక్ట్‌ను బేఖాతరు చేస్తూ ముందుగా అనుకున్న ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తారో వేచిచూడాలి. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌లో తాజాగా జరుగుతున్న ఘటనలు పార్టీ బలాన్ని తగ్గించే అవకాశ ముంది.

Read more