సమయానికి రాని బస్సులు

ABN , First Publish Date - 2022-11-16T23:18:51+05:30 IST

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మెట్రిక్‌ అనంతర విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం తలెత్తింది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం, సమయానికి రాకపోవడం సమస్యగా మారింది

సమయానికి రాని బస్సులు
గద్వాల ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

- తరగతులకు దూరమౌతున్న విద్యార్థులు

- ప్రైవేట్‌ వాహనాల్లో తప్పని రాకపోకలు

- అలంకారప్రాయంగా బస్సు పాసులు

గద్వాల అర్బన్‌, నవంబరు 16 : గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మెట్రిక్‌ అనంతర విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం తలెత్తింది. ఇంటర్‌, డిగ్రీతో పాటు పీజీ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం, సమయానికి రాకపోవడం సమస్యగా మారింది. పట్టణంలోనే ఉండి చదువుకునే ఆర్థిక స్థోమత లేని అనేక కుటుంబాల పిల్లలు ప్రతీ రోజు తమ గ్రామాల నుంచి గద్వాలకు బస్సుల్లో వెళ్లి కళాశాలల్లో చదువు కుంటున్నారు. బస్‌పాస్‌లు ఉన్నా ప్రతీ రోజు పట్టణానికి వచ్చి వెళ్లడానికి సకాలంలో బస్సు లు ఉండడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో బస్‌ పాస్‌లు అలంకారప్రాయంగా మారడంతో పాటు, ప్రైవేట్‌ వాహనాల్లో వచ్చి పోయేందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

గద్వాల పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుకుంటున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. వారంతా ప్రతీ రోజు ఆర్టీసీ బస్సుల్లోనే పట్టణానికి వచ్చి వెళ్లాల్సి ఉంది. డిపో పరిధిలోని కొండపల్లి, నెట్టెంపాడు, ఇటిక్యాల, షాబాద, వేముల, పెద్దదిన్నె, మాన్‌దొడ్డి, వెంకటాపురం, మేడికొండ, ఇర్కిచేడు, నందిన్నె తదితర రూట్లలో గద్వాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. ఆయా రూట్లలో వచ్చే బస్సుల వేళలు కళాశాలల సమయానికి అనుగుణంగా ఉండడం లేదు. దీంతో ప్రతీ రోజు ఒకటి, రెండు తరగతులను వినలేకపోతున్నట్లు చెప్తున్నారు. దీంతో వారు ఫలితాల్లో వెనుకబడుతున్నారు. పైగా అటు అధ్యాపకుల నుంచి, అటు తల్లిదండ్రుల నుంచి తిట్లు తినాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలుసార్లు ఆందోళనలు

పాఠశాలలు, కళాశాలల వేళలకు అనుకూలంగా బస్సులు నడిపించాలంటూ పలుమార్లు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టా రు. సమస్యను పరిష్కరించాలని డిపో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. దీంతో ప్రతీ రోజు సాయంత్రం వేళల్లో బస్సుల కోసం వందలాది మంది విద్యార్థులు బస్టాండు ప్రాంగణంలో వేచి ఉండడం నిత్యకృత్యంగా మారింది. కొన్ని సందర్భాల్లో సహనం నశించిన విద్యార్థులు ఆర్టీసీ సిబ్బంది, అధికారులతో వాగ్వాదానికి దిగడంతో, ఘర్షణ వాతావరణం తలెత్తి పోలీసులు కూడా జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి. ఇటీవల పట్టణంలోని ప్రైవేటు కళాశాలల కరస్పాండెంట్లు స్వయంగా డిపో మేనేజర్‌ను కలిసి విద్యార్థుల సౌకర్యం కోసం కళాశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని వినతిపత్రాలు ఇ చ్చారు. వారి విజ్ఞప్తికి డీఎం సానుకూలంగా స్పందించినా డిపోలో తగినన్ని బస్సులు లేకపోవడం, కొత్త బస్సులు డిపోకు వచ్చే అవకాశం లేని పరిస్థితి నెలకొన్నది.

వేర్వేరు సమయాలతో సమస్య

శ్రీనివాసులు, గద్వాల ఆర్టీసీ డీఎం : పాఠశాలలలు, కళాశాలలకు వేర్వేరు వేళలు ఉండటం కొంత సమస్యగా ఉంది. గంట తేడాతో ఒకే మార్గంలో రెండు బస్సులను నడిపించడం సాధ్యం కావడం లేదు. దీంతో పాటు ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజల వద్దకే ఆర్టీసీ సేవలు పేరున మారుమూల గ్రామాలకు సైతం బస్సులను నడపాల్సి ఉండటం ఆచరణలో అనేక ఇబ్బందులను కలిగిస్తోంది. విద్యార్థులకు అందించిన బస్‌పాస్‌ల ఆధారంగా ఆయా రూట్లలో సర్వీసులను క్రమం తప్పకుండా నడిపిస్తున్నాం.

Updated Date - 2022-11-16T23:18:52+05:30 IST