బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-04T05:23:41+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్న బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి అన్నారు.

బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలి
అలంపూర్‌ చౌరస్తాలో బైఠాయించిన బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

అలంపూర్‌ చౌరస్తా, జనవరి 3 : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్న బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి అన్నారు. పార్టీ తాలూకా ఇన్‌చార్జి రాజగోపాల్‌, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలసి సోమవారం ఆయన అలంపూర్‌ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశపాలన కొనసాగుతుందని విమర్శించారు. రాత్రి జాగరణ చేస్తేనే కొవిడ్‌ వస్తే, అధికార పార్టీ నాయకులు నిర్వహించే సభలు, సమావేశాల వల్ల కరోనా రాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం వల్ల ప్రజలు బాగుపడలేదని, కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపుతామని అన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకు తెచ్చిన జీవో నెంబర్‌ 317ను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బండిసంజయ్‌ను బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తుంటే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బాబన్న, జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్‌, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా, జిల్లా కార్యదర్శి స్వప్న, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read more