గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-09-14T04:45:13+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామ సమీపంలోని దుందుభీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలో ఈ నెల 11న గల్లంతైన మండలంలోని గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన శివయ్యగౌడ్‌ (62) శవాన్ని మంగళవారం బయటికి తీశారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

 జడ్చర్ల, సెప్టెంబరు 13: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామ సమీపంలోని దుందుభీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలో ఈ నెల 11న గల్లంతైన మండలంలోని గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన శివయ్యగౌడ్‌ (62) శవాన్ని మంగళవారం బయటికి తీశారు. కుర్వగడ్డపల్లి శివారులోని చెక్‌డ్యాం సమీపంలో మృతదేహం లభ్యమైంది. గోప్లాపూర్‌కు చెందిన శివయ్యగౌడ్‌, నర్సిములు, కేశవులు ఈ నెల 11న చేపలు పట్టేందుకు నెక్కొండ గ్రామ సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు వెళ్లారు. వరుసగా కురిసిన వర్షాల కారణంగా దుందుభీనదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. దాంతో చేపలు పట్టేందుకు యత్నిస్తుండగా శివయ్యగౌడ్‌ నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఫైర్‌స్టేషన్‌ అధికారులు మల్లిఖార్జున్‌, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి సైతం పర్యవేక్షించారు. కుర్వగడ్డపల్లి చెక్‌డ్యాం సమీపంలో శవం నీటిపై తేలింది. మృతదేహానికి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైతు బంధు సమన్వయ సమితి మండల కార్యవర్గ సభ్యుడుగా, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అయిన శివయ్యగౌడ్‌ మృతితో గోప్లాపూర్‌లో విషాదం నెలకొంది.

Read more