బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , First Publish Date - 2022-07-08T05:29:05+05:30 IST

అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు

బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- వైద్యాధికారులకు కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశం

గద్వాల క్రైం/గద్వాల టౌన్‌/ జూలై 7 : అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు, మునిసిపల్‌ అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని వేదనగర్‌, గంటవీధి ప్రాంతాల్లో అస్వస్ధతకు గురై ఇద్దరు మరణించగా, గద్వాల ఆసుపత్రిలో 56 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైద్యులు అందుబాటులో ఉండి నిరంతరం వైద్య సేవలు అందించాలన్నారు. ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యం కుదుట పడేలా వైద్యసేవలు అందించాలన్నారు. కుళాయిలు గుంతల్లో ఉండకుండా, పైన ఉండేలా చర్యలు తీసుకోవా లన్నారు. మిషన్‌భగీరథ ధ్వారా నీటి సరఫరా సక్రమం గా కొనసాగుతోందని, నీరు కలుషితం కాలేదని సంబ ంధిత అధికారి తెలిపారు. రెండు ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణ వ్యాప్తంగా శానిటేషన్‌, క్లోరినేషన్‌ నిర్వహించాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చందూనాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో సిద్ధప్ప, మునిసిపల్‌ కమిషనర్‌ జానకిరామ్‌సాగర్‌, అధికారులు పాల్గొన్నారు.


తాగునీరు కలుషితం కాలేదు : మునిసిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌ 

పట్టణ ప్రజలకు మునిసిపాలిటీ ద్వారా అందిస్తున్న తాగునీరు కలుషితం కాలేదని మునిసిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌ పేర్కొన్నారు. స్థానిక గంట వీధిలో ఇద్దరు వ్యక్తులు వాంతులు, విరేచనాలతో మృతి చెందిన నేపథ్యంలో తాగునీరు కలుషితమైనట్లు వెల్లువెత్తిన అనుమానాలతో నీటిని పరీక్ష చేయించామన్నారు. రిపోర్టు నెగటివ్‌గా వచ్చిందని, నీరు కలుషితమైందన్న వాదన సరికాదని తెలిపారు. మునిసిపల్‌ కార్యాలయంలో డీఈఈ సందీప్‌తో కలిసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన జరిగిన తక్షణం బాధితుల ఇళ్ల నుంచి నీటి శ్యాంపిల్స్‌ను  సేకరించి ల్యాబ్‌కు పంపించామని, వెంటనే అందిన కెమికల్‌ రిపోర్టు నెగటివ్‌గా ఉందని తెలిపారు. 24 గంటల అనంతరం వచ్చిన బయలాజికల్‌ అనాలసిస్‌ రిపోర్టు కూడా నెగటివ్‌గానే ఉందన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆయన చూపించారు. మృతి చెందిన ఇద్దరిలో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి ని మెడికల్‌ రిపోర్టుల ద్వారా గుర్తించే అవకాశం ఉంద న్నారు. నీరు కలుషితమైందంటూ వస్తున్న వదం తుల ను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. పట్టణంలోని తాగు నీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నామని, సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్య పనులను కూడా చేపట్టినట్లు కమిషనర్‌ వివరించారు. 


బాధితులకు ఇళ్ల వద్దే చికిత్స

గద్వాల పట్టణంలోని వేదనగర్‌, గంటవీధి, మోమిన్‌మెహల్లా తదితర కాలనీల్లో అస్వస్థతకు గురైన వారికి ఇళ్ల వద్దే చికిత్స అందిస్తున్నారు.  కాలనీలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో చందూనాయక్‌ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యాధికారులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ టాబ్లెట్స్‌, వాంతులు, విరేచనాలకు సంబంధించిన మందులు ఇచ్చారు. బాధితులకు వైద్య సేవలు అందించేందుకు 10 మంది వైద్యులు, 20 మంది సూపర్‌వైజర్లు, 75 మంది ఆశ, 10 మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించినట్లు తెలిపారు. అవసరమైన వారిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఒక ఆంబులెన్స్‌ను అందుబాటులో ఉంచామని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, నీటిని కాచి వడబోసి తాగకపోవడం వల్ల పలువురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కలుషిత జలం తాగడం వల్ల కాదని వివరించారు. 


బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

గద్వాల క్రైం, జూలై 7 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కొన్ని వార్డులలో నీరు కలుషితమైందని వదంతులు వచ్చాయన్నారు. అయితే అధికారులు నీటిని పరీక్షించి, కలుషితం కాలేదని నిర్ధారించారని తెలిపారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ కావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురు విరేచనాలు, వాంతులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, నాయకులు ఉన్నారు.



Updated Date - 2022-07-08T05:29:05+05:30 IST