లాంగ్‌ జంప్‌లో బ్యాక్‌ స్టెప్‌

ABN , First Publish Date - 2022-12-09T23:10:21+05:30 IST

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో వెనుకబడుతున్నారు. పరుగులో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. లాంగ్‌జంప్‌కు వచ్చేసరికి అడుగు వెనక్కి పడుతోంది. ప్రాక్టీస్‌ లేకుండా మైదానంలోకి వస్తున్న వారిలో చాలామందికి పరుగు ఈవెంట్‌ ముగియగానే తొడకండరాలు పట్టేడం, అలసిపోవడంతో లాంగ్‌జంప్‌ కొట్టలేకపోతున్నారు.

లాంగ్‌ జంప్‌లో బ్యాక్‌ స్టెప్‌
స్టేడియం గ్రౌండ్‌లో పరుగెడుతున్న అభ్యర్థులు

అక్కడే ఫెయిల్‌ అవుతున్న అభ్యర్థులు

రెండోరోజు 800 మందికి గాను 614 మంది హాజరు

హాజరైన వారిలో 484 మంది క్వాలిఫై

నేటి నుంచి మహిళలకు ఈవెంట్స్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 9: కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో వెనుకబడుతున్నారు. పరుగులో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. లాంగ్‌జంప్‌కు వచ్చేసరికి అడుగు వెనక్కి పడుతోంది. ప్రాక్టీస్‌ లేకుండా మైదానంలోకి వస్తున్న వారిలో చాలామందికి పరుగు ఈవెంట్‌ ముగియగానే తొడకండరాలు పట్టేడం, అలసిపోవడంతో లాంగ్‌జంప్‌ కొట్టలేకపోతున్నారు. మహబూబ్‌నగర్‌లోని స్టేడియం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. 800 మంది అభ్యర్థులకు గాను 614 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరులోనే 23.25 శాతం మంది స్కూృట్నీ అయ్యారు. 614 మందికి నిర్వహించిన పరీక్షలో 484 మంది అంటే 78.82 శాతం అర్హత సాధించారు. తొలిరోజు హాజరైన అభ్యర్థులు చేసిన తప్పిదాలను గుర్తించిన అభ్యర్థులు వాటిని అధిగమించడం వల్లనే ఎక్కువ మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది. పరుగులో స్వల్పంగానే ఫెయిల్‌ అవుతున్నా లాంగ్‌ జంప్‌లోనే ఎక్కువ మంది వెనుదిరుగుతున్నారు. నాలుగు మీటర్లు దూకాల్సిన అభ్యర్థులు లక్ష్యానికి అడుగు దూరంలో నిలుస్తున్నారు. ఒక్క అడుగు వెనక్కి పడటం వల్లనే ఎక్కువ మంది అభ్యర్థులు డిస్‌క్వాలిఫై అవుతున్నారని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. టేకా ఫ్‌ దగ్గర గీతను దాటకుండా చూ సుకోవాలి. అక్కడ కింద గీత చూసుకుని ఎగిరే ప్రయత్నంలో చాలామంది ముందు ఉన్న గీతకు ఆవతల వేయాల్సిన అడుగును గీతకు ఇవతలివైపు వేయడం వల్లనే తదుపరి పరీక్షలకు అర్హత సాధించలేక వెనుదిరుగుతున్నారు. తొలిరోజు అంతా సర్దుకోవడానికి సమయం పట్టగా రెండో రోజు సాఫీగా సాగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకే ఈవెంట్లు ముగిశాయి. ఈవెంట్ల దగ్గర భారీగా పోలీసులను మొహరించారు. అందరూ అభ్యర్థుల సర్టిఫికెట్‌లు పరిశీలించడం, వారిని క్రమపద్ధతిలో పరుగు, ఎత్తు, లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌త్రో నిర్వహించడం వంటివి దగ్గరుండి చూసుకుంటున్నారు. పరీక్షల ఛీఫ్‌ సూపరింటెండెంట్లు ఆర్‌ వెంకటేశ్వర్లు, చేతన, అడిషనల్‌ ఎస్పీ ఏ.రాములు పర్యవేక్షించారు. రెండ్రోజులుగా చలి తీవ్రత పెరగడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం మూడు గంటలకే అభ్యర్థులు ఆయా ప్రాంతాల నుంచి మైదానం వద్దకు బయలుదేరి వస్తున్నారు. తెల్లవారుజామున చలికి వణుకుతున్నారు. స్వెటర్లు, మంకీక్యాప్‌లు ధరిస్తున్నా ఐదు గంటలకు ముందుగానే మైదానంలోకి రావాల్సి ఉండటంతో చలికి అల్లాడుతున్నారు.

నేటి నుంచి నాలుగు రోజులు మహిళలకు

నేటినుంచి నాలుగు రోజుల పాటు మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 4,243 మంది హాజరుకావాల్సి ఉంది. నేడు 1,000 మందికి, 12న 1,200, 13న 1,200, 14న 844 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం సెలవు కావడంతో శని, సోమ, మంగళవారాల్లో వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. మహిళలకు 800 మీటర్ల పరుగు, ఎత్తు, లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌ ఉంటాయి. మహిళా అభ్యర్థులు కూడా ఈ అన్ని ఈవెంట్లలో కచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-12-09T23:10:23+05:30 IST