ఏర్పాట్లు మస్త్‌

ABN , First Publish Date - 2022-12-30T23:50:44+05:30 IST

న్యూ ఇయర్‌ వేడుకలు అంబురాన్నంట నున్నాయి. కొత్త సంవత్సరానికి ఎంత ఘనంగా స్వాగతం పలుకుతారో.. గతిస్తున్న ఏడాదికి అంతకన్నా ఘనంగా వీడ్కోలు పలుకడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది చివరి రోజైనా డిసెంబర్‌ 31కి ప్రత్యేకత ఉంటుంది.

ఏర్పాట్లు మస్త్‌
జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో ఉన్న మద్యం నిల్వలు

డిసెంబర్‌ 31 కోసం మందుబాబుల సన్నద్ధం

ఐదు రోజుల్లో రెండు డిపోల నుంచి రూ.57.98 కోట్ల మద్యం కొనుగోలు

నేడు మరో రూ.15 కోట్లు కొనే అవకాశం

మద్యం దుకాణాలు కళకళ.. నేటి రాత్రి 12 వరకు ఓపెన్‌

న్యూ ఇయర్‌ వేడుకల కోసం జిల్లా అంతటా ముందస్తు ప్లాన్‌లో జనం

కేక్‌లకు భారీ డిమాండ్‌.. తయారు చేయలేక చేతులెత్తేస్తున్న వ్యాపారులు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30: న్యూ ఇయర్‌ వేడుకలు అంబురాన్నంట నున్నాయి. కొత్త సంవత్సరానికి ఎంత ఘనంగా స్వాగతం పలుకుతారో.. గతిస్తున్న ఏడాదికి అంతకన్నా ఘనంగా వీడ్కోలు పలుకడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది చివరి రోజైనా డిసెంబర్‌ 31కి ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజంతా మందేసి చిందేయడం, అర్ధరాత్రి వరకు నృత్యాలు చేయడం, 12 కాగానే కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అలాంటి జోషే కనిపించనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 230 మద్యం దుకాణాలు, 30 బార్లు ఉన్నాయి. వీటన్నింటికి తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోల నుంచి మద్యం సరఫరా అవుతోంది. చివరి ఐదు రోజులు అంటే ఈ నెల 26 నుంచి 30 వరకు ఈ రెండు డిపోల నుంచి మద్యం వ్యాపారులు రూ.57.98 కోట్ల మద్యం స్టాక్‌ను తీసుకెళ్లారంటే మందుబాబులు ఏవిధంగా జల్సా చేయనున్నారో అర్థమవుతోంది. ఈ నెల 26 నుంచి 29 వరకు తిమ్మాజిపేట డిపో నుంచి 24,759 లిక్కర్‌ కేసులు, 32,115 బీరు కేసులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.26 కోట్లు కాగా, ఈ నాలుగు రోజులు కొత్తకోట డిపో నుంచి 21,035 లిక్కర్‌ కేసులు, 21,332 బీరు కేసులు కొను గోలు చేశారు. వీటి విలువ రూ.19.98 కోట్లు. ఈ రెండు డిపోల నుంచి శుక్రవారం రోజు రూ.12 కోట్ల విలువ గల మద్యం కొనుగోలు చేశారు. శనివారం రోజు మరో రూ.13 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని డిపోల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన డిసెంబరు చివరి ఆరు రోజులు రూ.70.98 కోట్ల మద్యం విక్రయాలు జరుగనున్నాయి. అయితే ఈసారి డిసెంబర్‌ 31 శనివారం రావడంతో కాస్త ఉత్సాహం తగ్గనుందని కొందరు చెబుతుండగా, మరుసటి రోజు ఆదివారం సెలవు రావడంతో శనివారం రాత్రంతా ఎంజాయ్‌ చేసి, మరుసటి రోజు విశ్రాంతి తీసుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు. డిసెంబరు 31న మద్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాత్రి 12 వరకు వైన్స్‌లు, ఒంటిగంట వరకు బార్‌లు తెరుచుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముందస్తు ఏర్పాట్లు

న్యూఇయర్‌ వేడుకలు జరుపుకునేందుకు స్నేహితులు, కార్యాలయాల సిబ్బంది, బ్యాచ్‌మెట్స్‌, గ్రామ బృందాలు నాలుగైదు రోజులు ముందుగానే వేదికలను సిద్ధం చేసుకున్నారు. లాడ్జి రూమ్‌లు, హోటల్‌ గదులు, బ్యాచ్‌లర్స్‌ గదులు, ఫాంహౌస్‌లు, పల్లెల్లో బావుల దగ్గర ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందరూ సాయంత్రం ఆరు గంటల కల్లా ఓచోట చేరి, జల్సా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. డెక్కులు, మైక్‌సౌండ్‌లు పెట్టుకుని నృత్యాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మందుతోపాటు మటన్‌, చికెన్‌ వంటి వంటకాలు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యాపారులు కూడా మాంసం, చికెన్‌ దుకాణాలలో పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచుకుంటున్నారు.

కేక్‌లకు భారీ డిమాండ్‌

న్యూఇయర్‌ వేడుకలకు కేక్‌ కట్‌ చేయడం ఆనవాయితీ. అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఎక్కడివారు అక్కడ కేక్‌లు కట్‌ చేస్తారు. పాలమూరుతో పాటు జడ్చర్ల వంటి పట్టణాలలో మూడు రోజుల నుంచే కేక్‌లకు ఆర్డర్‌ ఇస్తున్నారు. కొందరు 10-20 కిలోల కేక్‌లు ఆర్డర్‌ ఇస్తున్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలోనూ కేక్‌ కటింగ్‌ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ పట్ణణంలోని పద్మావతి, వెంకటేశ్వర, లక్ష్మీనగర్‌, భగీరథ, క్రిస్టియన్‌పల్లి, న్యూటౌన్‌, రాజేంద్రనగర్‌, మర్లు వంటి కాలనీలు, ఏనుగొండలో కేక్‌ కట్‌ చేయడా నికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పట్ణణంలోని పిస్తాహౌస్‌, మోడ్రన్‌ బేకరి, కాస్మిక్‌ వంటి బేకరీలకు ఇప్పటికే వందల్లో ఆర్డర్‌లు వచ్చాయి. నేడు వేలల్లో ఆర్డర్‌లు వచ్చే అవకాశం ఉందని, అంతమందికి కేక్‌లు తయారు చేయాలంటే ఇబ్బంది సరిపోరని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌తో దూకుడుకు కళ్ళెం

మద్యం దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరుచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం మరో వైవు డిసెంబరు 31న పెద్ద ఎత్తున డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిం చనుంది. పాలమూరు పట్టణంలో ట్రాఫిక్‌ పోలీసులు సాయంత్రం నాలుగు గంటల నుంచే తనిఖీలు చేయనుండగా, పోలీసులు సాయంత్రం ఆరు నుంచి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లు, హైవేలపైన తనిఖీలు చేస్తామని డీఎస్పీ మహేశ్‌ చెప్పారు. మద్యం తాగేవాళ్ళు వాహనాలు అక్కడే వదిలేసి, ఆటోలలో ఇళ్ళకు వెళ్ళాలని, లేదంటే డ్రైవర్‌ సాయంతో వెళ్ళాలని తెలిపారు. తాగి వాహనాలు నడిపితే వాహనం సీజ్‌ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పో లీసులంతా అర్ధరాత్రి వరకు రోడ్లపైనే ఉంటారని, అర్ధ రాత్రి 12:30 గంటలకు క్లాక్‌టవర్‌ చౌరస్తాలో ఎస్పీ కేక్‌ కట్‌ చేస్తారని చెప్పారు.

Updated Date - 2022-12-30T23:50:45+05:30 IST