సీడ్‌ ఆర్గనైజర్ల దోపిడీపై మరో పోరాటం

ABN , First Publish Date - 2022-09-30T05:09:38+05:30 IST

రైతులను నిలువుదోపిడీ చేస్తున్న పత్తిసీడ్‌ ఆర్గనైజర్లను నియంత్రించకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ అన్నారు

సీడ్‌ ఆర్గనైజర్ల దోపిడీపై మరో పోరాటం
సమావేశంలో మాట్లాడుతున్న రంజిత్‌కుమార్‌

- నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 29 : రైతులను నిలువుదోపిడీ చేస్తున్న పత్తిసీడ్‌ ఆర్గనైజర్లను నియంత్రించకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ అన్నారు. సీడ్‌ పత్తి సాగు వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్‌ దృష్టి సారించాలని కోరారు. పట్టణంలోని యూనియన్‌ కార్యాలయం లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బింగిదొడ్డికి చెందిన రైతు గొల్ల దొడ్డన్నపై 2019లో నకిలీ కల్తీ విత్తనాల కేసు నమోదు కాగా, ఆ విత్తనాలు ఫెయిల్‌ అయ్యాయని ఆర్గనైజర్‌ పురం నాగేశ్వర్‌ రెడ్డి రైతుకు ఇచ్చినవేనన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా పోలీసులు సేకరించిన ఫెయిల్‌ విత్తనాల జాబితాలో అసలు దొడ్డన్న పేరే లేదని తెలిపారు. ఆ విత్తనాలకు సంబంధించి నాగేశ్వర్‌ రెడ్డిపైనే కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో పాటు విత్తనాలు ఫెయిల్‌ అయ్యాయని రైతును మోసగించినందుకు మరో కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. మరో ఆర్గనైజర్‌ మేకల సోంపల్లి రమేష్‌రెడ్డి, తన వద్ద బాకీ పెండింగ్‌లో పెట్టాడన్న నెపంతో  ఆరగిద్దకు చెందిన రైతు వీరన్నపై దౌర్జన్యానికి దిగగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. అదే వ్యక్తిపై కోర్టు ద్వారా నోటీసు పంపిన రమేష్‌ రెడ్డి, మరోసారి తన మనుషుల ద్వారా దాడికి దిగాడన్నారు. వాస్తవానికి రైతు వీరన్న నుంచి విత్తనాలు తీసుకున్నప్పుడు ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకం చేయించుకొని తప్పుడు కేసు నమోదు చేయించినట్లు ఆరోపించారు.  జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. గతంలో కలెక్టర్‌ సమక్షంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులతో ఒప్పం దాలు చేసుకుంటామని హామీ ఇచ్చినా అమలు కావడంలేదన్నారు. ఇదే విషయాన్ని తాము వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చామని, హైకోర్టులో పిల్‌ కూడా వేశామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ మొట్టికాయ వేసినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సమావేశంలో సమితి జిల్లా కన్వీనర్‌ బుచ్చి బాబు, బాధిత రైతులు దొడ్డన్న, వీరన్న, జమ్మన్న, చిన్నాగౌడ్‌ పాల్గొన్నారు. 


Read more