నిబంధనల మేరకు చార్జీలు వసూలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-18T05:43:40+05:30 IST

ప్రభుత్వ నిబంధనల మేరకు చార్జీలు వసూలు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.

నిబంధనల మేరకు చార్జీలు వసూలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, మే 17 : ప్రభుత్వ నిబంధనల మేరకు చార్జీలు వసూలు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవపాడు, గట్టు, మల్దకల్‌ మండలాల్లోని మీసేవ కేంద్రాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రెండు రోజుల్లోగా అన్ని మీసేవ కేంద్రాల్లో చార్జీల జాబితాతో డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాలను ఇతరులకు అప్పగిస్తే రద్దు చేస్తామని హెచ్చరించారు. అప్‌లోడ్‌ చేసే ముందు అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకోవాలని చెప్పారు. ఆధార్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌. పుట్టిన తేదీల నమో దులో తప్పులపై ప్రజావాణికి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే రుసుము వసూలు చేయాలని, ఎక్కువగా తీసుకుంటే కేంద్రాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీవో రాములు, అధికారులు గోవిందునాయక్‌, ఏవో ఆజం అలీ, మదన్‌మోహన్‌, ఈడీఎం ఫరూక్‌ పాల్గొన్నారు. 


పకడ్బందీగా సర్వే నిర్వహించాలి

పంట దిగుబడి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో మండల ప్రణాళిక అధికారులకు మంగళవారం పంటకోత ప్రయోగాలకు సంబంధించిన యంత్ర సామాగ్రిని పంపిణీ చేశారు. పంటకోత ప్రయోగాలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని 12 మండలాలకు ఒక్కో మండలానికి రెండు చొప్పున 24 కిట్లను, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయానికి ఒక కిట్‌ను ఇచ్చినట్లు తెలిపారు. పంట దిగుబడి సర్వేకు సంబంధించిన సూచనలు, నియమాలకు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మణ్‌, వ్యవసాయ అధికారి గోవిందునాయక్‌, ఏంఏఎలు, ఎంపీఎస్‌వోలు పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఈడబ్ల్యూఐడీసీ, సీపీవో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులను పూర్తి చేసి వారంలోగా వినియోగపత్రాన్ని సమర్పించాలని చెప్పారు. జిల్లాకు మంజూరైన అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గం నిధులు, ముఖ్యమంత్రి సహాయనిధి, చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో సీపీవో లక్ష్మణ్‌, అధికారులు సమత, శ్రీధర్‌రెడ్డి, రాంచందర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T05:43:40+05:30 IST