ప్రపంచంతో విద్యార్థి పోటీపడేలా నూతన విద్యావిధానం

ABN , First Publish Date - 2022-11-24T23:30:43+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అమల్లోకి రాబోతోన్న జాతీయ నూతన విద్యావిధానంలో విద్యార్థులకుపయోగపడే ఎన్నో సానుకూలతలున్నాయని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చెప్పారు.

ప్రపంచంతో విద్యార్థి పోటీపడేలా నూతన విద్యావిధానం
స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

- గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

- డిగ్రీ జీవితానికి పునాదిరాయిలాంటిది

- పీయూ మూడోస్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌

- సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించేలా ఉన్నత విద్య సాగాలి : హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్‌ బీజేరావు

- ఆరుగురికి పీహెచ్‌డీలు, 73 మందికి బంగారు పతకాలు ప్రదానం చేసిన గవర్నర్‌

మహబూబ్‌నగర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అమల్లోకి రాబోతోన్న జాతీయ నూతన విద్యావిధానంలో విద్యార్థులకుపయోగపడే ఎన్నో సానుకూలతలున్నాయని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చెప్పారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవానికి ఆమె ఛాన్సలర్‌ హోదాలో హాజరయ్యారు. ఆరుగురు పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డీ డిగ్రీలు, 73 మంది పీజీ, యూజీ విద్యార్థులకు బంగారు పతకాలను ముఖ్యఅతిథిగా విచ్చేసిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బీజేరావుతో కలిసి ప్రదానం చేశారు. పీయూ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడారు. జాతీయ నూతన విద్యావిధానంతో విద్యార్థులకు మాతృభాషలో విద్యనందించడంతో పాటు, పౌష్టికాహారంతోకూడిన విద్యను అందిస్తారని తెలిపారు. విద్యార్థి నేరుగా క్లాస్‌రూమ్‌ నుంచి ప్రపంచాన్ని వీక్షిస్తాడని, ప్రపంచంతో పోటీపడి అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం వస్తుందని వివరించారు. చివరిబెంచీ విద్యార్థులను చులకనగా చూడవద్దని, ఉపాధ్యాయులు అన్ని అంశాల్లో మొదటి బెంచి విద్యార్థులతోనే మమేకమై వెళ్లిపోయే పరిస్థితులను రూపుమాపాలని, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా తరగతి గదిలో బ్యాక్‌ బెంచీ విద్యార్థుల మనస్తత్వం తనకు తెలసని, వారిని ఉపాధ్యాయులు మెల్లగా ప్రోత్సహిస్తే, క్రమంగా వారు మొదటి బెంచి విద్యార్థుల స్థాయికి రావడమే కాకుండా అద్భుతాలు సైతం సృష్టిస్తారని అన్నారు. పూర్వవిద్యార్థులుగా ఈయూనివర్సిటీకి ప్రేరణగా నిలవాలని, మీ జూనియర్లకు బాహ్యప్రపంచంలో మద్దతుగా ఉండాలని, యూనివర్సిటీ అభివృద్ధికి అన్నివేళలా సహకరించాలని సూచించారు. ఇద్దరు గొప్పవ్యక్తులు కలిస్తే దేశానికి ఉపయోగపడే ఆలోచ నలు వస్తాయని, స్వామి వివేకానంద, టాటా కలయికను ఈసందర్భంగా ఆమె గుర్తుచేశారు. 1893లో లండన్‌ నుంచి వస్తోన్న ఒక ఓడలో స్వామివివేకానంద, టాటా మధ్య జరిగిన సంభాషణ ప్రభావంతోనే టాటా 1898లో బెంగళూరులో టాటా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారని వివరించారు. మనదేశం ఈరోజు ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దశకు చేరిందని కోవిడ్‌కు వ్యాక్సిన్‌ను మనదేశంలోనే తయారుచేశారని, కోవిడ్‌ వ్యాక్సిన్‌ను 150 దేశాలకు భారత్‌ సరఫరా చేయడం ఈనాటి మనపరిశోధనల గొప్పతనానికి నిదర్శనంగా తమిళిసై చెప్పారు. హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్‌ బీజేరావు మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించి దేశాన్ని ముందుకునడిపేందుకు దోహదపడే ఉన్నతవిద్యను విద్యార్ధులు అభ్యసించాలని సూచించారు. పాలమూరు బిడ్డగా పాలమూరు యూనివర్సిటీ అభ్యున్నతికి తాను సంతోషపడుతున్నానని, ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక వృద్ధికి ఈయూనివర్సిటీ దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజామంగతాయారు, అదనపు కలెక్టర్‌ సీతారామారావు, జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి, పీయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ భాగ్యనారాయణ, యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- స్నాతకోత్సవానికి దూరంగా మంత్రులు, కలెక్టర్‌ :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న వైరం ప్రభావం పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంపైనా కనిపించింది. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు. కలెక్టర్‌ సైతం వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో అదనపు కలెక్టర్‌ సీతారామారావు గవర్నర్‌కు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు. ఎస్పీ సైతం రాకపోవడంతో అదనపు ఎస్పీ ఎన్‌.రాములు నేతృత్వంలో పోలీసులు గవర్నర్‌కు స్వాగతం పలికి, బందోబస్తు పర్యవేక్షించారు.

Updated Date - 2022-11-24T23:30:43+05:30 IST

Read more