తెలంగాణ మెడపై ఎల్‌పీఎస్‌ కత్తి!

ABN , First Publish Date - 2022-09-28T08:29:42+05:30 IST

తెలంగాణ మెడపై ఆలస్య రుసుము సర్‌చార్జి(ఎల్‌పీఎస్‌) కత్తి వేలాడుతోంది.

తెలంగాణ మెడపై ఎల్‌పీఎస్‌ కత్తి!

  • ఏపీకి 6756 కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశం
  • ఏపీ జెన్‌కో నుంచి తీసుకున్న విద్యుత్తుకు బిల్లు సకాలంలో చెల్లించనందుకు ఆలస్య రుసుము
  • చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
  • విద్యుత్తు కొనుగోళ్లపై ఇక ఆంక్షలు?
  • ఏపీయే 12,940 కోట్లు చెల్లించాలి: తెలంగాణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మెడపై ఆలస్య రుసుము సర్‌చార్జి(ఎల్‌పీఎస్‌) కత్తి వేలాడుతోంది. ఏపీ జెన్‌కో నుంచి తీసుకున్న విద్యుత్తుకుగాను ఎల్‌పీఎస్‌ నిబంధనల్ని అనుసరించి ఆ రాష్ట్రానికి రూ.6756 కోట్లు చెల్లించాలంటూ తెలంగాణకు కేంద్రం విధించిన గడువు బుధవారం (ఈ నెల 28)తో ముగియనుంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 దాకా ఏపీ జెన్‌కో నుంచి తీసుకున్న విద్యుత్తుకుగాను రూ.3441.78 కోట్లు, వీటిని సకాలంలో చెల్లించనందుకుగాను ఆలస్య రుసుము సర్‌చార్జి (లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జి) కింద రూ.3315.14 కోట్లు కలిపి మొత్తం రూ.6756 కోట్లు అయిందని కేంద్రం పేర్కొంది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఏపీకి చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్ర  విద్యుత్తు మంత్రిత్వశాఖ తెలంగాణను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు పది రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్రానికి లేఖ రాస్తూ.. కేంద్రం ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని, తెలంగాణ వాదనలు వినకుండా ఆదేశాలిచ్చారని తప్పుబట్టారు. పైగా ఏపీయే తెలంగాణకు రూ.17,828 కోట్ల బకాయి ఉందని తెలిపారు. ఆ రాష్ట్రానికి తాము చెల్లించాల్సిన కరెంట్‌ బిల్లులు, ఆలస్య రుసుము సర్‌చార్జి రూ.4887 కోట్లు తీసేయగా.. మిగిలిన రూ.12,940 కోట్లు ఏపీ నుంచే తమకు రావాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


ఇక బకాయిలపై ఏపీకి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుందనే సంకేతాలతో తెలంగాణ ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన కేసులో కూడా ఎలాంటి పురోగతి లేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌-92 ప్రకారం.. నిర్ణయం తీసుకునే ముందు ఇరు రాష్ట్రాల వాదన వినాల్సి ఉందని, కానీ.. కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమేంటని తెలంగాణ ఆగ్రహంతో ఉంది. 


 తెలంగాణ మెడపై ఆలస్య రుసుము సర్‌చార్జి(ఎల్‌పీఎస్‌) కత్తి వేలాడుతోంది. బకాయిలకు సంబంధించి ఓవైపు తెలంగాణ తమ వాదనను వినిపిస్తుండగా.. మరోవైపు ఎల్‌పీఎస్‌ గండం ముంచుకొస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు సకాలంలో బకాయిలు చెల్లించలేదనే కారణంతో కేంద్రం ఇటీవలే పలు రాష్ట్రాలపై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఆ జాబితాలో ప్రస్తుతం కర్ణాటకకు చెందిన హుబ్లీ, చాముండేశ్వరి, గుల్బర్గా విద్యుత్తు సరఫరా కంపెనీలతో పాటు పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన మూడు డిస్కమ్‌లు కేవలం రూ.84.51 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉండగా.. పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌ రూ.320.99 కోట్లు బకాయి మాత్రమే ఉంది. అయినా ఆయా డిస్కమ్‌లు బహిరంగ విపణిలో కరెంట్‌ కొనుగోలు చేయకుండా కేంద్రం ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆ ఆం క్షల ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశాలు లేకపోలేదని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం నోటీసు కూడా ఎల్‌పీఎస్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటి ప్రకారమే ఆంక్షలు అమలవుతాయనే ఆందోళన ఉంది. అదే జరిగితే తెలంగాణ విద్యుత్తు సరఫరా వ్యవస్థ కుదుపునకు గురయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ కనెక్షన్లతోపాటు గ్రామీణ, మండల ప్రాంతాల్లో  సరఫరాపై ఆంక్షలు అమలయ్యే ప్రమాదం లేకపోలేదు. 

Read more