స్వతంత్రంగా ఉండేందుకు చివరిదాకా ఆరాటం!

ABN , First Publish Date - 2022-09-17T10:12:47+05:30 IST

చివరి క్షణం వరకు హైదరాబాద్‌ను ఒక స్వతంత్ర దేశంగా ఉంచడానికి నిజాం నవాబు, ఆయన కంటే ఎక్కువగా మజ్లిస్‌ శతవిధాలుగా ప్రయత్నించింది.

స్వతంత్రంగా ఉండేందుకు చివరిదాకా ఆరాటం!

  • భద్రతా మండలిలో ఫిర్యాదు కోసం ఫ్రాన్స్‌కు 
  • ‘భారత్‌ దురాక్రమణ’ అంటూ నిజాం సందేశం 

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చివరి క్షణం వరకు హైదరాబాద్‌ను ఒక స్వతంత్ర దేశంగా ఉంచడానికి నిజాం నవాబు, ఆయన కంటే ఎక్కువగా మజ్లిస్‌ శతవిధాలుగా ప్రయత్నించింది. సెప్టెంబరు 17, 1948 కంటే ముందు ఒక ప్రత్యేక రాజ్యంగా హైదరాబాద్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉండేది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఇతర దేశాలతో పాటు న్యూఢిల్లీలో హైదరాబాద్‌ రాయబారులు ఉండేవారు. హైదరాబాద్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా మొయిన్‌ నవాజ్‌ జంగ్‌ వ్యవహారించేవారు. ఆర్ధిక శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ కూడా చూసేవారు. చివరి దశలో నిజాంను ఈయనే గందరగోళం చేసి తప్పుదోవ పట్టించారని అంటారు. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలంటూ నిజాం తరఫున ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (అప్పుడు ఫ్రాన్స్‌లో ఉండేది)లో తన వాదనలు వినిపించడానికి మొయిన్‌ నవాజ్‌ జంగ్‌, మరో నలుగురితో కలిసి బయల్దేరారు.  హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం గుండా వరంగల్‌కు వచ్చి అక్కడి నుండి విమానంలో ఫ్రాన్స్‌కు వెళ్లారు. హైదరాబాద్‌ స్వతంత్రంగా ఉండాలని ఆయన బృందం ఐక్యరాజ్యసమితిలో వాదించింది.


దురాక్రమణ అంటూ ఫిర్యాదు

తమపై భారత్‌ ’దురాక్రమణ’ చేస్తోందంటూ.. రజాకార్ల ఒత్తిడి మేరకు నిజాం విదేశీ వ్యవహారాల శాఖ 1948, ఆగస్టు 21న తంతి సందేశం ద్వారా ఫిర్యాదు చేసింది. దాన్ని సమితి, భద్రతా మండలికి నివేదించింది. భారత సేనలు జహీరాబాద్‌ వైపు నుంచి దూసుకొస్తుండగా సెప్టెంబరు 15ననిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ తన ప్రధాని లాయిఖ్‌ అలీని పిలిపించుకున్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకునే వరకు భారత సేనలను హైదరాబాద్‌ లోపలికి ప్రవేశించకుండా నిలువరించవచ్చా? లేదా? అనే దానిపై ఆరా తీశారు. కాగా నిజాం ఫిర్యాదును భద్రతామండలి సెప్టెంబరు 21వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపే హైదరాబాద్‌ సంస్థానం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. రజాకార్లు ఆశించినట్లుగా పాకిస్థాన్‌ నుంచి గానీ దాన్ని సృష్టించిన మహమ్మద్‌ అలీ జిన్నా నుంచి గానీ వారికి సహాయం లభించలేదు. ఆనారోగ్యంతో ఉన్న జిన్నా, సెప్టెంబరు 11న మరణించిన వారంలోపు కీలక పరిణామాలు చోటు చేసుకోన్నాయి.


జంగ్‌.. అట్నుంచి అటే జంప్‌..

నిజాం తరఫున ఐక్యరాజ్యసమితిలో వాదనలు వినిపించడానికి పారిస్‌ వెళ్లిన మొయిన్‌ నవాజ్‌ జంగ్‌..  మళ్లీ హైదరాబాద్‌కు తిరిగిరాలేదు. కరాచీలో స్ధిరపడి అ తర్వాత సౌదీ అరేబియాకు మకాం మార్చి అక్కడే మరణించారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఆయన ఇంటిని కృష్ణాజిల్లా చల్లపల్లి రాజా తీసుకోగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ సహా నగరంలో ఇతర చోట్ల ఉన్న ఆయన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోంది. ఈ భూముల్లో కొన్నింటిపై  ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. 

Read more