దుమ్ము లేపిన ‘లైగర్‌’

ABN , First Publish Date - 2022-08-15T05:50:25+05:30 IST

హీరో విజయ్‌ దేవరకొండ సరికొత్త పాత్రలో నటించిన లైగర్‌ దుమ్ము రేపుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ హాల్‌లో హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ అనన్యపాండే నటించిన, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లైగర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.

దుమ్ము లేపిన ‘లైగర్‌’

ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, చిత్ర బృందం
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు


మడికొండ, ఆగస్టు 14 : హీరో విజయ్‌ దేవరకొండ సరికొత్త పాత్రలో నటించిన లైగర్‌ దుమ్ము రేపుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ హాల్‌లో హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ అనన్యపాండే నటించిన, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న  లైగర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్‌లో జరిగాల్సి ఉంది. వర్షం కారణంగా సత్యసాయి కన్వెన్షన్‌ హాల్‌కు మార్చారు. అయినప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హీరో విజయ్‌ దేవరకొండను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దయాకర్‌ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ్‌దేవర కొండ ఒక సక్సె్‌సపుల్‌ హీరోకాగా, పూరీ జగన్నాథ్‌ మరో సక్సెస్‌ పుల్‌ దర్శకుడని, వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న లైగర్‌ సినిమా పరిశ్రమలోనే సరికొత్త రికార్డును సృష్టించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రీ రిలీజ్‌ వేడుకను హనుమకొండలో  నిర్వహిస్తున్నందుకు సినిమా యూనిట్‌ను అభినందించారు. సినిమా పరిశ్రమకు, హనుమకొండకు మధ్య ఒక ఆత్మీయానుబంధం ఉందని, ఇక్కడ షూటింగ్‌ జరిగిన సినిమాలు, ప్రీ రిలీజ్‌ వేడుకలు జరిగిన చిత్రాలు ఘనవిజయం సాధించాయనీ, ఆ సెంటిమెంట్‌తోనే సినిమా పరిశ్రమ హనుమకొండవైపు చూస్తోందన్నారు. వరంగల్‌లో సినిమాల నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామనీ, సహాయ సహకారాలు అందిస్తామని  హామీ ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ తమకు దగ్గర బంధువని గుర్తు చేశారు.  ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. యాక్షన్‌, రోమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం అయిన లైగర్‌ ప్రేక్షకులకు నచ్చుతుందని, ఖచ్చితంగా 100 రోజులు ఆడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హీరో విజయ్‌ దేవర కొండ మాట్లాడుతూ.. లైగర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దేశమంతటా తిరుగుతున్నామనీ, ఇందులో భాగంగా వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. పేరక్షకులను అన్ని విధాల సంతృప్తిపరిచే విధంగా లైగర్‌ ఉంటుందన్నారు. సినిమాలోని కొన్ని డైలాగులను వినిపించడం ద్వారా అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని పాటలకు స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు. హాస్య నటుడు అలీ కూడా తనదైన మాటలు, డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ ఇండియన్‌ స్పోర్ట్‌, యాక్షన్‌ సినిమా లైగర్‌  సీనీ పరిశ్రమలోనే ఓ  సరికొత్త ప్రయోగం అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా  సుల్తాన, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, సినీనటి చార్మీ, జబర్దస్ట్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను, వరంగల్‌ వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రీ రిలీజ్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధర్మ ప్రొడక్షన్‌. పూరి కనెక్ట్స్‌ సంయుక్తాధ్వర్యంలో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన లైగర్‌లో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌టైసన్‌ ఒక ముఖ్య పాత్రను పోషించాడు. రమ్యక్రిష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు ఇందులో నటించారు.







Updated Date - 2022-08-15T05:50:25+05:30 IST