కాళేశ్వరం పనులపై స్టేటస్‌ కో ఎత్తివేయండి

ABN , First Publish Date - 2022-09-30T08:24:56+05:30 IST

కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై విధించిన స్టేటస్‌ కో ను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేసింది.

కాళేశ్వరం పనులపై స్టేటస్‌ కో ఎత్తివేయండి

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం అప్లికేషన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై విధించిన స్టేటస్‌ కో ను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేసింది. కేంద్ర జలసంఘం అనుమతులు, పర్యావరణ అనుమతులు లేకుండా మూడో టీఎంసీని ఎత్తిపోయడానికి పనులు చేపడుతున్నారని, అందుకు భూసేకరణ కూడా చేపడుతున్నారంటూ పలువురు భూనిర్వాసితులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. జూలై 27న పనులపై స్టేటస్‌ కో విధించిన సంగతి తెలిసిందే. వర్షాకాల రోజులు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి గోదావరి నుంచి 240 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోడానికిగాను నీటిని ఎత్తిపోసే సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని అప్లికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనపు టీఎంసీని ఎత్తిపోయడానికి అనుమతులు అవసరం లేకున్నా కూడా.. సవరించిన డీపీఆర్‌ను పరిశీలన నిమిత్తం కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జలసంఘానికి సమర్పించామని తెలిపింది. డీపీఆర్‌ను అధ్యయనం చేయడానికి కేంద్ర జలసంఘం ఆమోదించిందని, రాష్ట్ర విభజన చట్టం మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు కూడా పంపించామని వివరించింది. అయితే, కోర్టు స్టేటస్‌ కో విధించిన నేపథ్యంలో డీపీఆర్‌ను పరిశీలించలేమని జీఆర్‌ఎంబీ స్పష్టం చేసిందని వెల్లడించింది. బోర్డు అలా నిర్ణయించడం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొంది. స్టేటస్‌ కో వల్ల ప్రజాప్రయోజనాల ప్రాజెక్టు జాప్యమవుతుందని, అంచనా వ్యయాలు పెరుగుతాయని, కాబట్టి స్టేటస్‌ కో ను ఎత్తివేయాలని సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. 

Updated Date - 2022-09-30T08:24:56+05:30 IST