బూత్‌ స్థాయికి పోదాం పద!

ABN , First Publish Date - 2022-09-25T09:45:12+05:30 IST

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కమిటీల పర్వం కొనసాగుతోంది.

బూత్‌ స్థాయికి పోదాం పద!

  • మునుగోడులో అన్ని పార్టీలదీ ఇదే వ్యూహం
  • పోలింగ్‌ బూతు స్థాయి నుంచి కమిటీలు 
  • బీజేపీ నుంచి 637 మందికి బాధ్యతలు
  • టీఆర్‌ఎస్‌లో 88 మంది కీలక నేతలకు
  • కాంగ్రెస్‌ తరఫున రంగంలోకి 617 మంది 
  • దసరా తరువాత ఊపందుకోనున్న ప్రచారం


నల్లగొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కమిటీల పర్వం కొనసాగుతోంది. గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న మూడు పార్టీలు.. బూత్‌ కమిటీలనే టార్గెట్‌ చేసుకున్నాయి. ఏకంగా రాష్ట్ర స్థాయి నేతలకు బూత్‌ కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. బూత్‌ నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ నేతలను రంగంలోకి దింపుతున్నాయి. అందరి కన్నా ముందుగా బహిరంగ సభ, అభ్యర్థి ప్రకటన చేసిన కాంగ్రెస్‌.. బూత్‌ స్థాయి కమిటీల నియామకంలోనూ వేగంగా అడుగులు వేస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ తన దళాన్ని సిద్ధం చేసినా.. నోటిఫికేషన్‌ విడుదల కొంత ఆలస్యం కావచ్చన్న సమాచారంతో వారిని క్షేత్రస్థాయికి పంపడంపై ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. మరోవైపు పాత, కొత్త నేతల కలయిక సమస్యతో కమిటీల ఏర్పాటులో కొంత జాప్యం చేసిన బీజేపీ.. పలు దఫాల చర్చల అనంతరం కొలిక్కి తెచ్చింది. మొత్తంగా దసరా పండుగ తర్వాత మూడు ప్రధాన పార్టీల నేతలు స్థానికంగా మకాం వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. సాధారణంగా బీజేపీకి ప్రతి పని విషయంలో ఒక పద్ధతి, దానికి పెద్దల ఆమోదం వంటివి ఉంటాయి. కానీ, ఇప్పటిదాకా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే దాదాపుగా అన్నీ తానై వ్యవహరించారు. అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌షా.. కమిటీల ఏర్పాటు, పాత, కొత్తల కలయికలపై స్పష్టమైన ఆదేశాలివ్వండంతో సంస్థాగత నిర్ణయాలు చకచకా జరుగుతున్నాయి. 


బీజేపీ కమిటీలు, షెడ్యూలు ఖరారు..

మునుగోడు ఉప ఎన్నికలో కార్యోన్ముఖులను చేసేందుకు 637 మంది కీలక నేతలతో బీజేపీ కమిటీలు, షెడ్యూల్‌ ఖరారయ్యాయి. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి చైర్మన్‌గా, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి కోఆర్డినేటర్‌గా 14 మంది కీలక నేతలతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ మరుసటి రోజే మండలం, మునిసిపల్‌ కమిటీలను ఖరారు చేశారు. 24 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నెల 27న ఈ మండల కమిటీల సభ్యులతో పార్టీ నేతలు చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి వారు నేరుగా తమకు కేటాయించిన మండలాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. వారికి కేటాయించిన గ్రామాల్లో స్థానికంగా పరిచయాలు, బూత్‌ కమిటీలు వేయడానికి అవసరమైన సూచనలు చేస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి మండలానికి ఏడుగురు సభ్యుల చొప్పున మండల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత చివరగా బూత్‌ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరంతా క్షేత్రస్థాయిలో పనిచేసే వారైతే ఉప ఎన్నిక తెరవెనుక పనులకు 22 ఎన్నికల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీరు నియోజకవర్గ మేనిఫెస్టో, చార్జ్‌షీట్‌, లీగల్‌ సెల్‌, ఎన్నికల అనుమతులు, వాహనాల ఏర్పాటు, మీడియా నిర్వహణ వంటి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సామాజిక వర్గాల వారీగా సైతం కమిటీలు వేయాలని, నియోజకవర్గంలోని 189 గ్రామాల్లో ప్రతి గ్రామానికీ ముగ్గురు స్థానికులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక అభ్యర్థి ప్రచారం విషయానికి వస్తే, ‘‘దసరా వరకు నేను అన్ని గ్రామాలను పర్యటించడం పూర్తవుతుంది, చేరికల అంశం చివరి దశకు చేరుతుంది. ఆ తర్వాత నేరుగా ఓటర్లను కలుస్తాను’’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఆ లోపు బూత్‌ స్థాయి దాకా కమిటీల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

 

మంత్రులందరికీ టీఆర్‌ఎస్‌ బాధ్యతలు..

దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఎదురైన అనుభవాలను సమీక్షించుకుని మునుగోడు ఉప ఎన్నికలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఒకరిద్దరి చేతుల్లో కీలక బాధ్యతలు పెట్టకుండా యంత్రాంగం మొత్తాన్ని మోహరించాలని నిర్ణయించారు. మంత్రి, ఎమ్మెల్యే అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఒక ఎంపీటీసీ పరిధి అంటే 800 నుంచి 1200 మంది ఓటర్లకు మించి బాధ్యత ఇవ్వొద్దనే నిర్ణయం తీసుకున్నారు. మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఖరారు చేశారు. మొత్తం 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించారు. ఏ నేతల సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ నేతకు బాధ్యతలు కేటాయించారు. పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్న చండూరు మునిసిపాలిటీ పరిధిలోని కేవలం రెండు వార్డులను (6వ, 7వ) మాత్రమే ఎమ్మెల్సీ ఎల్‌.రమణకు కేటాయించారు. మంత్రి హరీశ్‌రావుకు మర్రిగూడ మండల కేంద్రం, మరో మంత్రి కేటీఆర్‌కు గట్టుప్పల్‌ మండల కేంద్రం, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చండూరు మునిసిపాలిటీలోని రెండు వార్డుల బాధ్యతలు అప్పగించారు. 


భారీగా కాంగ్రెస్‌ సైన్యం మోహరింపు..

మునుగోడు తమదేనని నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు భారీగా కసరత్తు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో నేతలకు బాధ్యతలు అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నారాయణపురం, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మునుగోడుకు ఇలా కీలక నేతలంతా ఒక్కో మండలం బాధ్యతలు తీసుకున్నారు. వారికి ఇద్దరు సహాయకుల చొప్పున నియమించుకున్నారు. ఇక ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 25 మంది స్థానిక నేతలను గుర్తించి.. వారికి పీసీసీ నుంచి ఇద్దరు చొప్పున నేతలను కేటాయించారు. వీరితోపాటు ఏడు మండలాలకు సోషల్‌ మీడియా కన్వీనర్లను ఖరారు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్‌ బూత్‌లు ఉండగా ప్రతి బూత్‌లో 254 ఓట్లకు తక్కువ కాకుండా 76 వేల ఓట్లు సాధించాలని కాంగ్రెస్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 400 నుంచి 1000 వరకు ఓట్లు ఉండగా రాజగోపాల్‌రెడ్డికి గతంలో 80 వేల ఓట్లు వచ్చాయి. అందులో 70 వేల ఓట్లు పక్కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందినవేనని ఆ పార్టీ పెద్దల అంచనా. కాగా, ఐదుగురు సభ్యులతో మునుగోడు ఉప ఎన్నిక, ఎత్తుగడల కమిటీని మధుయాష్కీగౌడ్‌ చైర్మన్‌గా గతంలో నియమించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత యాష్కీ స్థానంలో ఆ బాధ్యతలను నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి అప్పగించారు. మరోవైపు మండల స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన కీలక నేతలు.. స్థానిక బూత్‌ కమిటీ నేతలను, బయటినుంచి వచ్చిన ఇద్దరు సమన్వయకర్తలను సమావేశపరిచి గ్రామాలకు పంపారు. ఏయే పార్టీకి గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కించే పనిలో గ్రామస్థాయి నేతలున్నారు. ఈ పనులు ఎలా జరుగుతున్నాయో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్‌ మండలాల వారీగా సమీక్షలకు హాజరవుతున్నారు. ఇప్పటికే చౌటుప్పల్‌లో సమావేశం ముగియగా ఈ నెల 25న మునుగోడులో సమావేశానికి ఠాకూర్‌తో పాటు మండల ఇన్‌చార్జి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఇలా తమ సైన్యాలను మోహరించటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి మునుగోడు నియోజకవర్గంపైనే ఉంది.

Read more