పెట్రో పన్నులతో ఒక్కో కుటుంబం నుంచి లక్ష దోపిడీ

ABN , First Publish Date - 2022-04-07T07:56:27+05:30 IST

‘‘అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడి చమురు ధర 2014లో ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది? మరి ఆనాడు లీటర్‌ పెట్రోల్‌ ఎంత ధరకు దొరికిందో..

పెట్రో పన్నులతో ఒక్కో కుటుంబం నుంచి లక్ష దోపిడీ

  • ఇది కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా?.. 
  • పన్నులు పెంచుడే పాలనా...? 
  • యుద్ధం సాకుతో పెట్రోల్‌ ధరలు పెంచేస్తారా?.. 
  • కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడి చమురు ధర 2014లో ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది? మరి ఆనాడు లీటర్‌ పెట్రోల్‌ ఎంత ధరకు దొరికిందో.. ఇప్పుడూ అంతే ధరకు ఎందుకు దొరకట్లేదు?’’ అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. 2014తో పోలిస్తే పెట్రోల్‌ ధర రెట్టింపు ఎందుకయిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై ఉందన్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఒకానొక దశలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల కంటే తక్కువకు పడిపోయినా... బీజేపీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్‌ ధరలను తగ్గించడానికి బదులుగా పెంచుతూ పోయిందన్నారు. ‘‘దేశంలోని 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నరేళ్లుగా రూ.26.51లక్షల కోట్ల మేరకు పెట్రో పన్నులు వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సగటున ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష చొప్పున మోదీ ప్రభుత్వం లూఠీ చేసింది. ప్రతిదీ.. దేశం కోసం, ధర్మం కోసమనే మోదీ ప్రభుత్వం.. ఈ దోపిడీ కూడా దేశం కోసం, ధర్మం కోసమే చేసిందా?’’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.  ‘‘చమురు సరఫరాలో ఇబ్బందులని కొన్నిరోజులు... ముడి చమురు ధరలు పెరిగాయని ఇంకోసారి, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం పేరుతో ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెబుతున్నారు. ఇదంతా నిజం కాదు. ’’ అని ఆయన అన్నారు. 


తెలంగాణకు వచ్చేది పది పైసలే..

లీటరు పెట్రోల్‌పై ఎక్సయిజ్‌ పన్ను 2014కు ముందు రూ. 9.48గా ఉంటే.. మోదీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.32.98 చేసిందని కేటీఆర్‌ అన్నారు. గతేడాది కాస్త తగ్గించడంతో ప్రస్తుతం రూ.27.90గా ఉందని చెప్పారు. ఇందులో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వెళ్తుందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ వాట్సాప్‌ యూనివర్సిటీ బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో డప్పు కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎక్సయిజ్‌ పన్ను రూ.27.90లో బేసిక్‌ ఎక్సయిజ్‌ డ్యూటీ రూ.1.40  మాత్రమేనన్నారు. అందులో తెలంగాణ వాటా లీటరుకు పది పైసలు మాత్రమేనన్నారు. లీటరుకు రూ.28 ఎక్సయిజ్‌ డ్యూటీని ముక్కు పిండి వసూలు చేస్తున్న మోదీ సర్కారు... అందులో ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తోందని వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచని మోదీ ప్రభుత్వం... ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రం ధరలు పెంచుకుంటూ పోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గడచిన 15 రోజుల్లో 13సార్లు పెట్రోల్‌ ధరలను పెంచి.. ప్రజల కష్టాలంటే తనకు ఎంత చులకనో బీజేపీ చాటుకుందన్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు బీజేపీని తిరస్కరించుడు ఖాయమన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయనున్నారు.

Updated Date - 2022-04-07T07:56:27+05:30 IST