కు.ని ఆపరేషన్ల క్యాంపులు రద్దు!

ABN , First Publish Date - 2022-08-31T08:24:12+05:30 IST

రాష్ట్రంలో క్యాంపుల ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల చేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కు.ని ఆపరేషన్ల క్యాంపులు రద్దు!

ఇబ్రహీంపట్నం ఘటనతో సర్కారు నిర్ణయం!.. రాష్ట్రంలో ఏటేటా తగ్గుతున్న కు.ని ఆపరేషన్లు 

ఇప్పటికే పడిపోతున్న సంతానోత్పత్తి రేటు 

ప్రస్తుతం 1.8కి పడిపోయిన టీఎ్‌ఫఎఆర్‌

ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్లే: వైద్యులు


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాంపుల ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల చేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు. అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే వారి సంఖ్య తగ్గుతోంది.  2021-22 సంవత్సరంలో 502 క్యాంపులను ఏర్పాటు చేసి 24,233 కు.ని ఆపరేషన్లు చేశారు. ఆ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 1,10,234 శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 38,656 కు.ని శస్త్రచికిత్సలు నిర్వహించారు. గతంలో ఏటా లక్షన్నర వరకు ఇటువంటి సర్జరీలు చేసేవారు. అయితే వీటి సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. అందుకు పలు కారణాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా వివాహాలు చేసుకోవడంతో సంతాన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు ప్రస్తుతం మార్కెట్లో అధునాతన గర్భనిరోధక మాత్రలు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో కు.ని సర్జరీలు తగ్గుతూ వస్తున్నాయి. 


రాష్ట్రంలో తగ్గుతున్న టీఎ్‌ఫఆర్‌..

రాష్ట్రంలో టోటల్‌ ఫర్టిలిటీ రేటు (టీఎ్‌ఫఆర్‌) తగ్గుతున్నట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య నాలుగో, ఐదో సర్వేల్లో వెల్లడైంది. మన రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.8గా ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. జాతీయ సగటు 2.0గా ఉంటే మన వద్ద ఇంత తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన 1980లో ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో టీఎ్‌ఫఆర్‌ రేటు 4.0గా ఉండేది. 1990 నాటికి అది 3.0కు చేరింది. 1999 నాటికి 2.4కు తగ్గింది. 2009 నాటికి 1.8కి పడిపోయింది. 2017నాటికి అది 1.7కు  మరింతగా తగ్గింది. ప్రస్తుతం 1.8గా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో అత్యధిక సంతానోత్పత్తి రేటు విషయంలో ప్రస్తుతం బిహార్‌ 3.0, మేఘాలయ 2.9, మధ్యప్రదేశ్‌ 2.6, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2.4, మణిపూర్‌ 2.2, హరియాణ 2.1గా ఉంది. అంటే జాతీయ సగటు కంటే ఆ రాష్ట్రాలో టీఎ్‌ఫఆర్‌ ఎక్కువగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏటాకేటా దిగజారుతోంది. దక్షణాదిన ఏ రాష్ట్రం కూడా కనీసం 2.0 టీఎ్‌ఫఆర్‌ రేటు లేదు. 


1952లో కు.ని. ఆపరేషన్లు ప్రారంభం..

మన దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే కార్యక్రమాన్ని 1952లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నాడు జనాభా నియంత్రణలో భాగంగా ఒక మిషన్‌ మోడ్‌లో కు.ని సర్జరీలను చేపట్టారు. పురుషులకు వేసక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు. అలాగే ఈ సర్జరీలు చేయించుకున్నవారికి నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తున్నారు. ఇక సర్జరీలు చేయించుకున్న మహిళలకు ప్రయాణ చార్జీలతో కలపి రూ.1500 ఇస్తున్నారు. అలాగే సర్జరీలు చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది అందరికీ కలిపి రూ.100 వరకు ఇస్తారు. ఈ నిధులన్నీ కేంద్రమే ఇస్తుంది. అలాగే వైద్య ఆరోగ్యశాఖకు నెలకు ఇన్నేసి కు.ని శస్త్రచికిత్సలు నిర్వహించాలని టార్గెట్లు విధించేవారు. దాంతో ప్రతి నెలా క్యాంపులు నిర్వహించి, టార్గెట్లను పూర్తిచేసే కార్యక్రమం ఇప్పటికీ నడుస్తోంది. అయితే ఇబ్రహీంపట్నం ఘటన తర్వాత ఇటువంటి క్యాంపులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


మున్ముందు ఏమవుతుదంటే...

మన రాష్ట్రంలో ఇప్పటికే సంతానలేమి సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఇప్పటికే మనదగ్గర ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌) కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వీటి చుట్టూ తిరిగే దంపతుల సంఖ్య నిత్యం పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పెళ్లి అయిన దంపతుల్లో ప్రతి 100 మందిలో ప్రస్తుతం 30 మందికి సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు గాంధీ ఆస్పత్రిలో ఇన్‌ఫర్టీలిటీ వింగ్‌ చూసే  గైనకాలజిస్టు డాక్టర్‌ వెల్లంకి జానకి తెలిపారు. గతంలో ఇది కేవలం 10 శాతమే ఉండేదన్నారు. మున్ముందు ఇటువంటి సమస్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. ముఖ్యంగా కెరియర్‌ కోసం పిల్లల్ని కనాలనుకోకపోవడం, ఒంటరి జీవితాలకు అలవాటు పడటం లాంటి అంశాలకు తోడు ఒత్తిడి జీవితం, ఫెస్టిసైడ్స్‌, కాలుష్యం వంటి కారణాలతో పురుషుల్లో సంతానలేమి సమస్యలకు దారితీస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే మన దగ్గర కూడా కేరళ రాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నమవుతాయని మరో డాక్టర్‌ తెలిపారు. ఆ రాష్ట్రంలో 1980ల్లోనే ఫర్టిలిటీ రేటు 2.4గా ఉండగా, ప్రస్తుతం అది బాగా తగ్గింది. అక్కడి యువత కెరీర్‌, లైఫ్‌ సెటిల్‌మెంట్‌, జాబ్స్‌ పేరుతో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడంతోనే ఆ పరిస్థితి నెలకొంది. ఇక మన దగ్గర ఇప్పటికే టీఎ్‌ఫఆర్‌ రేటు తక్కువగా ఉండటానికి తోడు ఇటువంటి కారణాల వల్ల సంతానోత్పత్తి రేటు మరింతగా ప్రమాదంలో పడేపోయే అవకాశాలు లేకపోలేదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర జనాభా బాగా తగ్గితే మున్ముందు కొత్త రకమైన సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొవాల్సివస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా  జనాభా ప్రాతిపదికన కేంద్రం ఇచ్చే నిధులు తగ్గిపోతాయంటున్నారు. అలాగే  అదే ప్రాతిపదికన పెరిగే శాసనసభా నియోజకవర్గాల సంఖ్యతో పాటు పార్లమెంట్‌ స్థానాల సంఖ్య పెరగకపోగా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. 

Updated Date - 2022-08-31T08:24:12+05:30 IST