క్లస్టమ్‌ మిల్లంగ్‌ బియ్యం గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-11-25T00:33:07+05:30 IST

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి ఎఫ్‌సీఐకి అందించాల్సిన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ఉమ్మడి జిల్లాలో దారి మళ్లుతోంది. చట్టంలోని లొసుగులు, రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పే సామర్థ్యమున్న మిల్ల ర్లు, వీరికి స్థానిక అధికారులు తోడవడంతో వందల కోట్ల రూపాయల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ వారికి కాసుల వర్షం కురిపిస్తోంది.

క్లస్టమ్‌ మిల్లంగ్‌ బియ్యం గోల్‌మాల్‌

సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో రూ.380కోట్ల విలువైన బియ్యం పక్కదారి

మిల్లర్లు, అధికారుల కుమ్మక్కు

విజిలెన్స్‌కు సహకరించని జిల్లా అధికారులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి ఎఫ్‌సీఐకి అందించాల్సిన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ఉమ్మడి జిల్లాలో దారి మళ్లుతోంది. చట్టంలోని లొసుగులు, రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పే సామర్థ్యమున్న మిల్ల ర్లు, వీరికి స్థానిక అధికారులు తోడవడంతో వందల కోట్ల రూపాయల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. పైసా పెట్టుబ డి లేకుండా ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏళ్లతరబడి దగ్గర ఉంచుకొని బ్యాంకు లోన్లు తీసుకోవడంతోపాటు, బహిరంగ మా ర్కెట్‌లో అధిక ధరకు విక్రయించి కొందరు మిల్లర్లు కోట్లకు పడగలెత్తారు.

సీఎంఆర్‌ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు ఇగో, అదిగో అంటూ కాలం గడుపుతుండగా అధికారులు మళ్లీ వారికే ఏటా ధాన్యం కేటాయిస్తున్నారు. తాజాగా కోదాడ మండలానికి చెందిన ఓ మిల్లర్‌ జెండా ఎత్తేయగా, ఆయన నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రూ.35 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం ఉంది. ఇప్పటికే రూ.380కోట్ల విలువైన ధాన్యం ఎక్కడుందో తెలియని పరిస్థితి. కాగా, విచారణకు వచ్చిన విజిలెన్స్‌ అధికారులకు స్థానిక అధికారులు సహకరించకపోవడంతో పలు అక్రమాలు వెలుగులోకి రావడం లేదు.

రూ.35కోట్ల ధాన్యం మాయం

గత మూడు సీజన్ల నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 300మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బకాయి చెల్లించకుండా సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు శ్రీఉషశ్వి రైస్‌మిల్లు యజమానులు ధాన్యం నిల్వలను పక్కదారిపట్టించారు. సీఎంఆర్‌ బకాయి తిరిగి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేయగా, యజమానులు మిల్లుకు తాళం వేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా పౌరసరఫరాల అధికారులు బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకు మిల్లుకు వెళ్లగా ప్రభుత్వానికి అందించాల్సిన రూ.35కోట్ల విలువైన బియ్యం నిల్వలు కనిపించలేదు.

రూ.380కోట్ల విలువైన బియ్యం ఎక్కడ?

గడిచిన 2020-21 యాసంగి, వానాకాలం సీజన్లు కలుపుకుని సూ ర్యాపేట జిల్లాలో రూ.300కోట్ల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం ఇంకా మిల్లర్ల వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగానే 2021-22 యాసంగి సీజన్‌లో సూర్యాపేట జిల్లాలోని మిల్లులకు మరో 2.14లక్షల టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. 2021లో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ బి య్యాన్ని ఆయా మిల్లుల నుంచి సేకరించడంలో విఫలమైన అధికారులు మళ్లీ అవే మిల్లులకు సీఎంఆర్‌ కోటా కేటాయించడం గమనా ర్హం. డీఫాల్ట్‌ మిల్లర్లపై కొరడా ఝుళిపించాల్సిందిపోయి వారికే అధి క ప్రాధాన్యం ఇవ్వడం వెను క పెద్దఎత్తున ముడుపుల వ్యవహారం ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో సుమారు 85 రైస్‌మిల్లులు ఉండగా, అందులో పార్‌బాయిల్డ్‌ 75, ముడిరైస్‌ మిల్లులు 10వరకు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 2021లో రెండు సీజన్లు కలిపి గడ్డిపల్లికి చెంది న ఓ మిల్లు నుంచి రూ.37.91కోట్ల విలువైన సీఎంఆర్‌ రావాల్సి ఉం ది. అదేగ్రామానికి చెందిన మరో బిన్నీ రైస్‌ మిల్లు నుం చి రూ.24. 42కోట్లు, ముకుందాపురానికి చెందిన రైస్‌ఇండస్ట్రీ నుంచి రూ.29.49 కోట్లు, కోదాడకు చెందిన ఓ రైస్‌మిల్లు నుంచి రూ.2కోట్లు, కాపుగల్లు శ్రీఉషశ్వి రైస్‌మిల్లు నుంచి రూ.29.41కోట్లు, సూర్యాపేట పట్టణానికి చెందిన ఓరైస్‌ ఇండస్ట్రీ నుంచి రూ.17.51 కోట్లు, నేరేడుచర్లకు చెంది న రైస్‌కార్పొరేషన్‌ మిల్లు నుంచి రూ.17.85 కోట్లు, సూర్యాపేటకు చెందిన శివదుర్గ, శ్రీమాతా, జగన్మాత రైస్‌ ఇండస్ట్రీస్‌ రూ.31.96కోట్ల విలువైన కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖకు అప్పగించాల్సి ఉన్నట్లు తెలిసింది. మొత్తం 10 రైస్‌మిల్లర్ల యజమానులు 2021 సీజన్లకు సంబంధించి సీఎంఆర్‌ బియ్యం బకాయి ఉం డటంతో వీరికి 2022 యాసంగి ధాన్యాన్ని కేటాయించలేదు. 18నెల లు గడవగా రూ.190కోట్ల విలువైన సీఎంఆర్‌ బియ్యం జాడ లేదు.

చట్టంలో లొసుగులే మిల్లర్ల బలం

సీఎంఆర్‌ ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్రంలో చట్టంలోని లొసుగులు మిల్లర్లకు బలంగా మారాయన్న వాదన ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న ఇద్దరు మిల్లర్ల ష్యూరిటీతో పాటు ఆ జిల్లా రైస్‌మిల్లర్స్‌ అధ్యక్షుడు సంతకం చేస్తే చాలు వందల కోట్ల విలువైన ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్లకు అందజేస్తున్నారు. సీఎంఆర్‌ తిరిగ్చే ందుకు అధికారులు ఒత్తిడి చేస్తే కేసులు, కోర్టులకు వెళ్లేందుకు కూడా మిల్లర్లు జంకడం లేదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ మిల్లర్‌ సీఎంఆర్‌ గోల్‌మాల్‌లో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. సీఎంఆర్‌ జాప్యం చేసేందుకు అధికారులు, నాయకులను మేనేజ్‌ చేయడంలో ఆ మిల్లర్‌ సిద్ధహస్తుడు. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ ఉన్న సమయంలో ఈ అక్రమార్కుడి భరతం పట్టగా, ఆయనపై పీడీకేసు నమోదై జైలుకు సైతం వెళ్లివచ్చాడు.

నల్లగొండ జిల్లాలో రూ.80కోట్ల విలువైన బియ్యం

నల్లగొండ జిల్లాకు చెందిన నాలుగు రైస్‌మిల్లుల నుంచి 30,398 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం జాడ లేదు. వీటి విలువ సుమారు రూ.80కోట్ల వరకు ఉంటుంది. మిల్లర్లు ఈ బియ్యాన్ని మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు వెళ్లగా విచారణకు వారు జిల్లా కేంద్రానికి వచ్చారు. అయితే మిల్లుల్లో పెద్ద మొత్తంలో ధాన్యం ఉందని, లెక్కింపు సాధ్యం కాదని, కొంత సమయం కావాలంటూ విజిలెన్స్‌ అధికారులకు జిల్లాకు చెందిన పౌరసరఫరాలశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ నాలుగు రైస్‌మిల్లులు ఈ ఏడాది అక్టోబరు17 నాటికి 30,398 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టులో కొందరు పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీచేసింది.

ఆర్‌ఆర్‌ యాక్ట్‌, క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం : ఎస్‌.మోహన్‌రావు, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌

రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) యాక్ట్‌, క్రిమిన ల్‌ కేసుల ద్వారా సీఎంఆర్‌ ధాన్యాన్ని మిల్లర్లు నుంచి రాబడతాం. సూర్యాపేట జిల్లాలో శ్రీఉషశ్వి, లక్ష్మీసహస్ర మిల్లుల యజమానులు మాత్రమే బియ్యాన్ని మాయం చేసినట్టు నాలుగు రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో గుర్తించాం. శ్రీఉషశ్వి మిల్లుకు సంబంధించి రూ.35కోట్లు, లక్ష్మీసహస్రకు సంబంధించి రూ.18కోట్ల విలువైన బియ్యం రావాల్సి ఉంది. సదరు యజమానుల పార్ట్‌నర్లు, గ్యారెంటీర్లపై ఒత్తిడి తెచ్చి రికవరీ చేస్తాం. ఆరుగురు మిల్లర్లు నకిలీ ట్రక్‌ షీట్‌ కేసులో ఉండటంతో వారికి ధాన్యం ఇవ్వలేదు. గత యాసంగి సీఎంఆర్‌ అప్పగించేందుకు ఇంకా సమయం ఉంది.

Updated Date - 2022-11-25T00:33:20+05:30 IST