నువ్వు చనిపోయావమ్మా!

ABN , First Publish Date - 2022-07-19T04:52:00+05:30 IST

బతికి ఉన్న ఓ మహిళను చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు ఓ పంచాయతీ కార్యదర్శి.. ఫలితంగా ఆమెకు ఐదునెలలుగా పింఛన్‌ నిలిచిపోయింది.

నువ్వు చనిపోయావమ్మా!
బాధితురాలు ధనమ్మ

బతికుండగానే మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేసిన పంచాయతీ కార్యదర్శి 

 ఐదు నెలలుగా నిలిచిన పింఛన్‌ 

మండలపరిషత్‌ కార్యాలయంలో చెప్పటంతో అవాక్కైన మహిళ

ఖమ్మంరూరల్‌, జూలై18: బతికి ఉన్న ఓ మహిళను చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు ఓ పంచాయతీ కార్యదర్శి.. ఫలితంగా ఆమెకు ఐదునెలలుగా పింఛన్‌ నిలిచిపోయింది. మండల పరిషత్‌ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేయగా ఇది వెలుగులోకి వచ్చింది. ఖమ్మంరూరల్‌ మండలం, పెద్దతండా గ్రామానికి చెందిన బోడా ధనమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం వదిలి వెళ్లాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలను పెట్టుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఒంటరి మహిళ పింఛన్‌ తీసుకుంటోంది.  ఐదేండ్ల క్రితం నుంచి ప్రతి నెలా ఆమెకు అందుతోంది. అయితే ఐదునెలల నుంచి ఆమెకు పింఛన్‌ రావడంలేదు. దీంతో మండలపరిషత్‌ కార్యాలయానికి వెళ్లింది.  రికార్డులో ధనమ్మ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది విన్న ధనమ్మ అవాక్కైంది. తాను బతికే ఉంటే చనిపోయానని చెప్పడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో ధనమ్మ ఫించన్‌ ఆగిపోయింది. దీనిపై ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈవిషయంపై  పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి ప్రయత్నించగా సదరు అధికారి స్పందించ లేదు.

Updated Date - 2022-07-19T04:52:00+05:30 IST