Forest Range Officer murder : ఆటవిక హత్య!

ABN , First Publish Date - 2022-11-23T03:03:10+05:30 IST

పోడు వివాదాలతో రగులుతున్న కొత్తగూడెం జిల్లా మన్యం ప్రాంతంలో నెత్తురు చిమ్మింది. మొక్కలు నాటిన అటవీ భూముల్లో పశువులను మేపడాన్ని అడ్డుకున్నందుకు విధినిర్వహణలో ఉన్న..

 Forest Range Officer murder  : ఆటవిక హత్య!

ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావును చంపిన గొత్తికోయలు

కత్తితో మెడపై దాడి చేసి క్రూరంగా చంపేసిన వైనం

ప్లాంటేషన్‌ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే..

కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఘటన

మరో ఇద్దరు ఉద్యోగులకు మాత్రం కర్రలతో బెదిరింపులు

విధి నిర్వహణలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు

పథకం ప్రకారమే హత్య? మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా?

లింగాలలో పనిచేస్తున్న రోజుల్లో హిట్‌లి్‌స్టలో ఉన్నట్లు ప్రచారం

అటవీశాఖలో అనుమానాలు.. ఉద్యోగుల్లో భయాందోళనలు

నిజాయతీగా పనిచేస్తే ఇదేనా ప్రతిఫలం?

అంతా బాగుండాలని ఎన్నో పూజలు చేశా.. ఎందరో దేవుళ్లను మొక్కా. కానీ ఏ దేవుడూ నా భర్తను కాపాడలేకపోయాడు. నిజాయితీగా పనిచేస్తున్న నా భర్తను పొట్టనబెట్టుకున్నారు. నిజాయితీకి దక్కిన ప్రతిఫలమిదేనా. ఎప్పుడూ డ్యూటీ డ్యూటీ అంటూ పనిచేసేవారు. ఇప్పుడు నా కుటుంబం పరిస్థితి ఏంటి?

- శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి

మా నాన్న మాకు కావాలి

డ్యూటీకి వెళ్లిన మా నాన్నను ఇలా చంపేస్తారా.. మా నాన్న మాకు కావాలి. ఇంతమంది ఉండి కూడా మా నాన్న ప్రాణాలు కాపాడలేదు. అసలు ఒక్కడినే అడవికి ఎందుకు పంపారు.

- శ్రీనివాసరావు కుమారుడు జశ్వంత్‌

చండ్రుగొండ, ఖమ్మం, నవంబరు 22: పోడు వివాదాలతో రగులుతున్న కొత్తగూడెం జిల్లా మన్యం ప్రాంతంలో నెత్తురు చిమ్మింది. మొక్కలు నాటిన అటవీ భూముల్లో పశువులను మేపడాన్ని అడ్డుకున్నందుకు విధినిర్వహణలో ఉన్న అటవీ అధికారి ప్రాణాలనే బలిగొన్నారు. మరో ఇద్దరు ఉద్యోగులు చూస్తుండగానే పథకం ప్రకారం కిరాతకంగా మెడపై పదునైన కత్తితో దాడి చేసి చంపారు. జిల్లాలోని చండ్రుగొండ మండలంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇంతటి ఘోరానికి పాల్పడింది ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చి స్థిరపడిన గొత్తికోయలు. మృతుడు చండ్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు (43). నిజాయితీగా పనిచేస్తారని పేరున్న శ్రీనివాసరావు, గొత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోవడం అటవీశాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర భయాందోళనలనూ రేకిత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులైన సెక్షన్‌ ఆఫీసర్‌ రామారావు, వాచర్‌ రాములు వెల్లడించిన వివరాల ప్రకారం. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మంగళవారం ఉదయం 10 గంటలకు చండ్రుగొండ మండలంలోని పోకలగూడెం అటవీ ప్రాంతంలో జరుగుతున్న ప్లాంటేషన్‌ పనులను పరిశీలించేందుకు వెళ్లారు.

మధ్యాహ్నం 12గంటలకు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా శ్రీనివాసరావుకు బెండాలపాడు అటవీ ప్రాంతానికి చెందిన వాచర్‌ రాములు ఫోన్‌ చేశారు. మొక్కలు నాటిన ప్రాంతంలో గొత్తికోయలు.. పశువులను మేపుతున్నారని సమచారమిచ్చారు. వెంటనే శ్రీనివాసరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ రామారావుతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రామారావు, రాములు కలిసి పశువులను ప్లాంటేషన్‌ నుంచి బయటకు తోలేందుకు ప్రయత్నించారు. దీన్ని గొత్తికోయలు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీసేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించారు. గొత్తికోయలకు చెందిన తోలెం తుల అనే వ్యక్తితో పాటు మరో వ్యక్తి వెనుక నుంచి శ్రీనివాసరావుపై కత్తితో దాడి చేశారు. ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నించినా తుల, మరోసారి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో గొంతు భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావం జరగడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకులారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ఉద్యోగులు రామారావు, రాములు ప్రయత్నించినా వారిపైనా ఆ ఇద్దరు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. శ్రీనివాసరావును రామారావు, రాములు కలిసి తొలుత చండ్రుగొండ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామైన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీర్లపూడికి తరలించారు. బుధవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీనివాసరావుకు భార్య భాగ్యలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితుల్లో తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పక్కా పథకం ప్రకారమే!

అటవీ భూముల్లో గొత్తికోయల అక్రమాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటుండటంతో కక్ష పెంచుకొనే శ్రీనివాసరావుపై పథకం ప్రకారం దాడికి పాల్పడినట్లు అటవీశాఖ అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో కొన్ని వివరాలు తెలిశాయి. 20 ఏళ్ల క్రితం ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వలసొచ్చిన గొత్తికోయలు చండ్రుగొండలోని బెండాలపాడు, మద్దుకూరు అటవీ ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా వారు పోడు భూముల్లో సాగు చేసుకోవడమే కాకుండా జంతువుల వేట, గంజాయి సాగు వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడి గొత్తికోయలకు రాజకీయ నేతల అండదండలున్నాయని, వారి ద్వారానే హైదరాబాద్‌లో కొందరు నేతలకు అడవి జంతువుల మాంసం, గంజాయి సరఫరా అవుతున్నట్లు చర్చ జరుగుతోంది.

2004లో సెక్షన్‌ ఆఫీసర్‌గా..

శ్రీనివాసరావు 2004 ఫిబ్రవరి 16న అటవీశాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికై సత్తుపల్లిలో ఫ్లైయింగ్‌స్క్వాడ్‌గా విధుల్లో చేరారు. 2017లో రేంజ్‌ అధికారిగా ప్రమోషన్‌ పొంది తాడ్వాయి డివిజన్‌ పరిధిలోని లింగాల మండలంలో బాధ్యతలు చేపట్టారు. అక్కడ విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించడంతో మావోయిస్టుల హిట్‌లిస్టులో చేరాడని తెలుస్తోంది. దీంతో ఆయన్ను 2020లో డిప్యుటేషన్‌పై చండ్రుగొండ మండల రేంజ్‌ అధికారిగా బదిలీ చేశారు. 2021 నవంబరు 1నుంచి అదే రేంజ్‌కు పూర్తిస్థాయి ఎఫ్‌ఆర్‌వోగా నియమితులయ్యారు. నిరుడు అటవిశాఖలోనే అత్యుత్తమ అవార్డు అయిన కేవీఎస్‌ బాబు అవార్డును శ్రీనివాసరావు అందుకొన్నారు. అటవీభూముల రక్షణ, హరితహారం లక్ష్య సాధనలో బాగా పనిచేయడంతో అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారి, సీసీఎ్‌ఫల నుంచి అవార్డు అందుకున్నారు.

మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా?

శ్రీనివాసరావుపై గొత్తికోయలు కత్తితో దాడికి పాల్పడడం.. అక్కడ మరో ఇద్దరు సిబ్బంది ఉన్నా, వారిపై కర్రలతో దాడికి ప్రయత్నించడం చూస్తే ఈ ’దాడి ఘటన’ పథకం ప్రకారం జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో శ్రీనివాసరావు కఠినంగా వ్యవహరిస్తారని పేరుంది. చండ్రుగొండలో పోడు పేరుతో అటవీ భూముల్లో సాగు, గంజాయి సాగు, జంతువుల వేటపై ఆయన ఉక్కుపాదం మోపారు. ములుగు జిల్లాలో పనిచేసిన సమయంలో కూడా ఆయన, గొత్తికోయల ఆక్రమించిన అటవీభూములను స్వాధీనంలోనూ కీలకంగా వ్యవహరించారు. అటవీభూములను రక్షించే క్రమంలో గొత్తికోయలకు శ్రీనివాసరావు, ఇతర అధికారులకు మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి. అప్పట్లో శ్రీనివాసరావుపై మావోయిస్టులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయని ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన్ను కొత్తగూడెం జిల్లాకు బదిలీచేశారు. గతంలో శ్రీనివాసరావుపై దాడి చేసిన గొత్తికోయలకు ఛత్తీ్‌సగఢ్‌ మిలీషియా సభ్యులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు హత్యవెనుక మావోయిస్టుల ప్రోత్సాహం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-11-23T03:03:12+05:30 IST