సాయం అందేదెన్నడు?

ABN , First Publish Date - 2022-08-30T06:43:16+05:30 IST

సాయం అందేదెన్నడు?

సాయం అందేదెన్నడు?
పొరుగింట్లో నివాసముంటున్న బాధితురాలు

వందల మంది గోదావరి వరద బాధితులకు అందని రూ.10వేలు

పొరుగిళ్లలో తలదాచుకుంటున్న బాధితులు

గందరగోళంలో పెండింగు లిస్టు వ్యవహారం

దుమ్ముగూడెం, ఆగస్టు 29: గత నెలలో వచ్చిన గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన భద్రాద్రి జిల్లా ఏజెన్సీలోని వరద బాధితులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. జూలై 15న గోదావరికి భారీ వరదలు రావడంతో నదీపరివాహకంలోని పలు మండలాల్లో వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, బైరాగులపాడు, వర్కుషాపు, ఎం కాశీనగరంలతోపాటు పలు గ్రామాలు నీట మునిగాయి. సున్నంబట్టి, ఎం కాశీనగరం, వర్కుషాపు గ్రామాలు వరద ఉదృతికి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. సర్వం కోల్పోయిన వరద బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసి విసిగిపోతున్నారు. పరిహారం పంపిణీ ప్రారంభించి 25రోజులవుతున్నా ఇంకా వందల మంది బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల సాయం అందలేదు. ఆ నగదు చేతికందితే చిన్నపాటి గుడిసైనా వేసుకుందామని ఎదురు చూస్తున్న బాధితురాలు కుంచం పుల్లమ్మ కనీసం నిలువ నీడ లేకపోవడంతో పొరుగిళ్లలో తలదాచుకుంటోంది. బాధితుల పెండింగ్‌ లిస్టు వ్యవహారం గందరగోళంగా మారింది. పరిహారం కోసం ఎంపికైన జాబితాలో పేరు నమోదై ఉండి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడక, ఇటు పెండింగు లిస్టులోనూ పేరు లేకపోవడం ఎంతో మందిని కుంగతీస్తోంది. 


పంపిణీ ప్రారంభించి 25 రోజులు 

వరద ముంపు ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన అధికారులు 1,936 మంది బాధితులను గుర్తించారు. వీరికి రూ.10వేల పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో వేసే ప్రక్రియను ఆగస్టు 4న ప్రారంభించారు. సుమారు 400 మంది బాదితుల బ్యాంకు ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేయడంతో నేటికీ వారికి నగదు అందలేదు. ఖాతాలను సరిచేసి పంపుతున్నామంటున్న రెవెన్యూ అధికారులు, నేటికీ పూర్తిస్థాయిలో బాధితులకు న్యా యం చేయలేదు. దీంతో వరద బాధితులు రోజూ బ్యాంకులు, మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి విసిగిపోతున్నారు. 


గందరగోళంగా పెండింగు లిస్టు

రెవెన్యూ కార్యాలయ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు సంబందించిన ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లను ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేయడం వరద బాధితులకు శాపంగా మారింది. నేటికీ వందల మందికి నగదు జమకాలేదని తెలుస్తోంది. అయితే జాబితాను సరిదిద్దే వ్యవహారం నత్తనడకన సాగుతోంది. పరిహారం జాబితాలో పేరు నమోదై, బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోగా, పెండింగు లిస్టులో కొన్ని పేర్లు కనబడకపోవడంతో వ్యవహారం గందరగోళంగా మారింది. బాధితులు ఈ విషయమై రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించగా ఖాతా వివరాలన్నీ సక్రమంగానే ఉన్నాయని, త్వరలో డబ్బులు జమ అవుతాయని సమాధానమిస్తున్నారు. వివరాలన్నీ సక్రమంగా ఉండి నగదు ఎందుకు జమవ్వడం లేదనే ప్రశ్నకు రెవెన్యూ అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, పెండింగు లిస్టును సరిదిద్దే పనిలోనే ఉన్నామన్నారు. గ్రామీణ బ్యాంకుల వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో నగదు జమకాలేదని తెలిపారు. 

Read more