సొంత తమ్ముడైనా.. బాబాయి కొడుకైనా..

ABN , First Publish Date - 2022-09-14T05:04:04+05:30 IST

‘సొంత తమ్ముడైనా.. బాబాయి కొడుకైనా కమ్యూనిస్టు పార్టీ దృష్టిలో అంతా సమానమే’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తన స్వగ్రామమమైన ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రైతాం

సొంత తమ్ముడైనా.. బాబాయి కొడుకైనా..

కమ్యూనిస్టు పార్టీ దృష్టిలో అంతా సమానామే

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

తెల్దారుపల్లిలో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు హాజరు

గ్రామంలో శ్రేణుల భారీ ర్యాలీ

ఖమ్మం రూరల్‌, సెప్టెంబరు 13 : ‘సొంత తమ్ముడైనా.. బాబాయి కొడుకైనా కమ్యూనిస్టు పార్టీ దృష్టిలో అంతా సమానమే’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తన స్వగ్రామమమైన ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తెల్దారుపల్లి స్టేజీ నుంచి గ్రామంలోకి కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి.. సీపీఎం నాయకులు, అమర వీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్బంగా  జరిగిన సీపీఎం సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా మతాల గురించి ప్రస్తావిస్తున్న బీజేపీని రాష్ట్రంలోకి రానీయొద్దని, తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించే ఆ పార్టీని దేశం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు కమ్యూనిస్టులకు బలమైన స్థానమని కేసీఆర్‌తో విభేదాలున్నా బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికామన్నారు. కానీ తెల్దారుపల్లి ఘటన నుంచి బయటపడేందుకు మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని కొందరు దుష్పృచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ ఒక ఊరు కోసం సిద్ధాంతాలు మార్చుకోదని, రాజకీయ మూర్ఖులు మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేస్తారని ఎద్దేవా చేశారు.  గ్రామంలో జరిగే ఈ సభకు గ్రామంలో జరిగిన ఘటనకు ఎలాంటి సంబంధం లేదని, తెల్దారుపల్లిలో జరిగిన ఘటన అనంతరం జరిగిన దాడుల గురించి ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎవరెవరు ఏయే ఘటనల్లో పాల్గొన్నారనే విషయంపై తరువాత ప్రశాంతంగా మాట్లాడుకుందామన్నారు. గతంలో కొన్ని ఘటనలు జరిగినా ఆనాడు తాత్కాలిక ఉద్రేకాలు చెలరేగాయాని గుర్తుచేశారు. గ్రామంలో ఏ ఘర్షణ జరిగినా అది పోలీసు స్టేషన, కోర్టుకు వెళ్లినా చివరకు మనమే పరిష్కరించుకున్నామని గుర్తు చేశారు. బయటి వారు కొందరు రాజకీయ స్వలాభం కోసం రాజకీయాలు మాట్లాడవచ్చని, గ్రామంలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులు రాత్రికి తనకు ఫోన చేసి చెబుతున్నారని తెలిపారు. ఈ సభకు ముందుగా పోలీసులు అనుమతించి తరువాత రద్దు చేశారని, అయితే ఒక సారి సభ నిర్వహించాలని ప్రకటించిన తరువాత పోలీసులు కాదు మిలటరీ వచ్చినా ఆపేది లేదన్నారు. కానీ తరువాత పోలీసులే అనుమతులు ఇచ్చారని, పోలీసులు ఎప్పుడు న్యాయం వైపే ఉండాలని కోరారు. సాయుధ పోరాట చరిత్రలో కాంగ్రెస్‌, బీజేపీల పాత్ర ఏంటని ప్రశ్నించారు. మరికొంత కాలం తరువాత రాష్ట్ర పార్టీ బాధ్యతలు పూర్తవగానే గ్రామంలోనే ఉంటానని, గ్రామంలో అంతా ఐక్యంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, రాష్ట్ర నాయకులు సోమయ్య, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేశ, ఆంధ్రా బ్యాంకు సహకార సంఘం వైస్‌ చైర్మన తమ్మినేని విజయలక్ష్మి, సర్పంచ సిద్దినేని కోటయ్య, జాలారు సంగయ్య, తమ్మినేని కమలమ్మ, బండి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం ర్యాలీపైకి చెప్పు విసరబోయిన కృష్ణయ్య కూతురు రజిత

 తెల్దారుపల్లి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ర్యాలీ.. ఇటీవల హత్యకు గురైన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య ఇంటి వద్దకు చేరుకున్న సమయంలో కృష్ణయ్య కూతురు రజిత ఆ ర్యాలీపైకి చెప్పును విసరబోయారు. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కృష్ణయ్య కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ‘తమ్మినేని వీరభద్రం గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య కూతరు, కుమారుడు రజిత, నవీన మాట్లాడుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచే సి తమను రెచ్చగొట్టడానికే తమ్మినేని వీరభద్రం సీపీఎం నాయకులను, కార్యకర్తలను వెంటపెట్టుకుని గ్రామంలోకి వచ్చారని వారు ఆరోపించారు. తమ తండ్రి హత్య కేసులో ఉన్న నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాటం చేస్తామన్నారు. గతంలో వీరభధ్రం గ్రామంలోకి వచ్చినప్పుడు పూలు చల్లి హరతులు పట్టారని ఇప్పుడు గ్రామంలో ఆ పరిస్తితులు లేవన్నారు. స్వలాభం కోసం ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు అమ్ముకుంటారని వారు విమర్శించారు. సీపీఎం ర్యాలీలో గ్రామస్థులు ఎవరూ లేరని బయటి వాళ్లతో ర్యాలీ నిర్వహించుకున్నారని, గ్రామస్థులంతా వీరభద్రం కుటుంబాన్ని చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామంలో వారి అక్రమ సంపాదనకు అడ్డుగా నిలుస్తున్నాడనే తమ తండ్రిని హత్య చేయించారని, గ్రామంలో 144 సెక్షన అమల్లో ఉండగా ర్యాలీ, సభకు పోలీసులు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.


Read more