మార్కెట్‌ యార్డులో వేబ్రిడ్జి పని చేసేదెన్నడో!

ABN , First Publish Date - 2022-10-18T05:38:15+05:30 IST

వైరా వ్యవసాయ మార్కెట్‌యార్డులోని వేబ్రిడ్జి అనేక సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉంది.

మార్కెట్‌ యార్డులో వేబ్రిడ్జి పని చేసేదెన్నడో!
వేబ్రిడ్జి చుట్టూ పెరిగిన పిచ్చిచెట్లు

ఏళ్లతరబడి నిరుపయోగం

ప్రతినెలా రేషన్‌డీలర్లపై వేలాది రూపాయల భారం

వైరా, అక్టోబరు 17: వైరా వ్యవసాయ మార్కెట్‌యార్డులోని వేబ్రిడ్జి అనేక సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉంది. లక్షలాదిరూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఈ వేబ్రిడ్జి మూలనపడి ఉన్నప్పటికీ పట్టించుకొనే వారే కరువయ్యారు. రైతులు, పౌరసరఫరాలశాఖ, ఇతర పలుశాఖలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండాల్సిన ఈ వేబ్రిడ్జి పనిచేయకుండా నిరుపయోగంగా పడి ఉంది. దాంతో ప్రతినెలా మూడుమండలాలకు చెందిన రేషన్‌డీలర్లు అలాగే ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల సమయంలో రైతులు, పౌరసరఫరాలశాఖ, ఎఫ్‌సీఐ శాఖల వారు ప్రైవేట్‌ వేబ్రిడ్జిల వద్ద కాంటా వేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో రేషన్‌డీలర్లు, రైతులు, ఆయా ప్రభుత్వశాఖలు ప్రైవేట్‌ వేబ్రిడ్జిలకు వేలాదిరూపాయలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఏపీలో కేంద్రమంత్రి రేణుకాచౌదరి కృషితో సీసీఐ నుంచి కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి వైరా వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేశారు. ఆసమయంలోనే రైతులు ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేబ్రిడ్జిని కూడా ఏర్పాటుచేశారు. కొంతకాలం వేబ్రిడ్జిపై రైతులు విక్రయించిన పంట ఉత్పత్తులు, పౌరసరఫరాలశాఖకు చెందిన రేషన్‌బియ్యం లారీలను ఈ వేబ్రిడ్జిపై కాంటా వేసేవారు. అయితే కొన్నిసంవత్సరాల నుంచి ఈ వేబ్రిడ్జి పనిచేయటం లేదు. మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలనే స్పృహ కూడా కరువైంది. ఒకట్రెండు సందర్భాల్లో ఈ వేబ్రిడ్జిపై కాంటా వేసిన సమయంలో తూకాల్లో తేడా రావడంతో తూనికలు కొలతల అధికారులు తనిఖీ చేసి సీజ్‌చేశారు. ఆతర్వాత ఈ వేబ్రిడ్జికి మరమ్మతులు చేయించాల్సిన వ్యవసాయ మార్కెట్‌ అధికారులు దీన్ని పూర్తిగా విస్మరించారు. ప్రతినెలా వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల్లోని రేషన్‌షాపులకు ఈ మార్కెట్‌యార్డు గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. లారీల్లో లోడ్‌ చేసిన బియ్యాన్ని ప్రైవేట్‌ వేబ్రిడ్జిల వద్ద కాంటా వేయిస్తున్నారు. ఆకాంటాకయ్యే మొత్తాన్ని రేషన్‌ డీలర్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే రైతులు విక్రయించిన ధాన్యం, మొక్కజొన్న ఇతర పంటలకు సంబంధించిన కాంటా కూడా ప్రైవేట్‌ వేబ్రిడ్జిల్లోనే వేయించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులే ఆమొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్‌ అధికారులు ఈవేబ్రిడ్జికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు, రేషన్‌డీలర్లు, ఆయా ప్రభుత్వశాఖల అధికారులు కోరుతున్నారు.


Read more