అంతిమయాత్రలో అండగా..

ABN , First Publish Date - 2022-09-20T04:43:19+05:30 IST

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కన్నుమూస్తే ఆ బాధ వర్ణణాతీతం! ఒక స్థాయి ఆర్థిక నేపథ్యం ఉంటే దహనసంస్కారాలు నిర్వహించేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు.

అంతిమయాత్రలో అండగా..
మహాప్రస్థానం వాహనం

పేదల కోసం మహాప్రస్థానం వాహన వితరణ

దాతృత్యాన్ని చాటుకున్న కల్లూరు ఆర్యవైశ్య కమిటీ

కల్లూరు, సెప్టెంబరు 19: కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కన్నుమూస్తే ఆ బాధ వర్ణణాతీతం! ఒక స్థాయి ఆర్థిక నేపథ్యం ఉంటే దహనసంస్కారాలు నిర్వహించేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే పేద కుటుంబంలో వారికైతే మహాకష్టం. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కల్లూరు ఆర్యవైశ్యకమిటీ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. అయిన వారు మరణిస్తే వారి అంతిమయాత్ర నిర్వహించేందుకు మహాప్రస్థానం వాహనాన్ని రూపొందిం చింది. ఇందుకోసం పట్టణంలో ఆర్యవైశ్య ప్రముఖులు చందాలు వేసుకుని రూ. తొమ్మిది లక్షల వరకు పోగు చేశారు. వాటితో ఒక ప్రత్యేకమైన వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనాన్ని పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని స్థలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో వాహనాన్ని నిలిపేందుకు రూ. లక్ష వెచ్చించి ప్రత్యేకంగా షెడ్‌ నిర్మించారు. అయినవారు కాలం చేస్తే ఎంతో బాధగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పేదింట్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటి వారికి ఉపయోగపడాలనే తాము ఈ వాహనాన్ని రూపొందించామని ఆర్యవైశ్య ప్రముఖులు పసుమర్తి చందర్‌రావు, చారుగుండ్ల అచ్యుత సీతారామారావు, దోసపాటి కృష్ణార్జునరావు, పసుమర్తి రాంబాబు, మిట్టపల్లి పరమేశ్వరరావు, మైలవరపు శ్యామ్‌ చెబుతున్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ఈసందర్భంగా పేర్కొన్నారు.


Read more