తుమ్మల సేవలు భేష్‌

ABN , First Publish Date - 2022-07-18T05:31:05+05:30 IST

1986లో వచ్చిన వరద నివారణలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమర్థవంతంగా పనిచేశారని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఆదివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప

తుమ్మల సేవలు భేష్‌

1986 వరదల్లో మాజీ మంత్రి సేవలను ప్రస్తావించిన కేసీఆర్‌

ఐటీడీఏలో వరద సమీక్ష సమావేశంలో సీనియర్‌ నేతకు ప్రశంసలు

నాగేశ్వరరావుకు జేజేలు పలికిన ప్రజలు

భద్రాచలం/  ఖమ్మం ప్రతినిధి, జూలై 17: 1986లో వచ్చిన వరద నివారణలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమర్థవంతంగా పనిచేశారని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఆదివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 1986 నాటి వరదలలు, వరద నివారణ చర్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రసంగంలో 80వ దశకంలో గోదావరి వరదలు, అప్పుడు మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. తుమ్మల సూచనలను దృష్టిలో ఉంచుకొని కరకట్టల అభివృద్ది, పాలెంవాగు, మోడికుంట వాగు ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం, ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం పనులకు హామీ ఇచ్చారు. కాగా కరకట్ట వల్లే  భద్రాచలం పట్టం సురక్షితంగా ఉండటంతో స్థానికులు తుమ్మలకు జేజేలు పలికారు. ఐటీడీఏ సమీక్ష అనంతరం కారులో వెళుతుండగా గేటే వద్ద ఉన్న ఆయన అభిమానులు ‘మా దేవుడు మీరేసార్‌’ అంటూ నినాదాలు చేశారు. మీ ముందుచూపుతోనే సురక్షితంగా ఉన్నామంటూ చేతులు జోడించి అభిమానం చాటారు. అందుకు ప్రతిగా మాజీ మంత్రి తుమ్మల కూడా ప్రజలకు ప్రతి నమస్కారం చేసి ఉప్పొంగి పోయారు. జన నీరాజనం చూసి తుమ్మల చలించిపోయారు. 

చేసిన పనులే శాశ్వతంగా నిలుస్తాయి:  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం భద్రాచలంలో తాను మంత్రిగా నిర్మించిన కరకట్టను పరిశీలించారు. కరకట్టపై నడుస్తూ నాడు చేసిన కృషిని మీడియా ప్రతినిధులకు వివరించారు. ఆనాడు ఎన్టీఆర్‌ 1986 గోదావరి వరదల తరుణంలో ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీతో కరకట్ట పనులు ప్రారంభించి చంద్రబాబునాయుడి సహకారంతో కరకట్ట పూర్తి చేశామని తెలిపారు. అప్పుడు చేసిన పని ఈనాడు పట్టణ ప్రజలకు రక్షణగా మారిన విషయాన్ని జనం చెప్పుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. మంత్రిగా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని, తాగు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నానని విలేకరులకు వివరించారు. సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా భద్రాచలం రెండో వారధి నిర్మాణం, విజయవాడ జగదల్‌పూర్‌జాతీయ రహదారి అభివృద్ధి, సారపాక ఏటూరునాగారం భూపాలపట్నం  ఏటూరునాగారం రహదారుల అభివృద్ధికి కృషి చేశానన్నారు. సీతారామసాగర్‌ ప్రాజెక్టుతో పాటు బీటీపీఎస్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసానని, ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారమే లక్షంగా నాడు చేసిన పనులు ఇప్పుడు  ఉపయోగపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తుమ్మల వివరించారు. 



Updated Date - 2022-07-18T05:31:05+05:30 IST