తెల్లకోటుకు.. నకిలీ మకిలీ

ABN , First Publish Date - 2022-07-05T06:41:58+05:30 IST

తెల్లకోటుకు.. నకిలీ మకిలీ

తెల్లకోటుకు.. నకిలీ మకిలీ
ఆస్పత్రి ఎదుట వైద్యుల పేర్లు లేకుండా స్పెషలిస్టులున్నట్లు బోర్డు పెట్టిన దృశ్యం

పేరొందిన ఆస్పత్రుల్లోనూ వార్డుబాయ్‌లే వైద్యులు

చికిత్సకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న రోగులు

చోద్యం చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ

జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అపరేషన థియేటర్‌లో అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసినట్టు చెప్పుకొని నగరంలోని ఓ ప్రధాన సెంటర్‌లో సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించాడు. ఇంటర్‌కూడా చదవని ఈయన కొవిడ్‌ సమయంలో రోగులకు యథేచ్ఛగా చికిత్స చేసి.. రూ.లక్షలకు.. లక్షలు గుంజారు.

వారు ఇంటర్‌ కూడా చదివారో లేదో తెలీదు కానీ ఏకంగా ఎంబీబీఎస్‌, ఎండీ జనరల్‌, ఫిజీషియన, సర్జన ఇలా పలువురు స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని, తమది మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని బోర్డు పెట్టేశారు. వైద్యులకు రూ.లక్షల్లో వేతనాలు ఇచ్చుకుంటూ... ఆసుపత్రి, వైద్యం పేరుతో పెద్దదందానే నడుపుతున్నారు. 

రిలీఫ్‌ ఆస్పత్రి... నగరంలో ఓ పేరుమోసిన ఆస్పత్రిపేరును కాపీ చేస్తూ ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇది. ఎంబీబీఎస్‌, ఎండీ జనరల్‌ ఫిజీషియన, ఎండీ సర్జన అంటూ వైద్యుల పేర్లే లేకుండా బోర్డు పెట్టేశాడు. ఆర్‌ఎంపీలను కూడగట్టుకుని యథేచ్ఛగాస్కానింగ్‌, అబార్షన్లు చేస్తున్నారు. అందులో నిపుణులైన వైద్యులు మాటెలా ఉన్నా.. ఇక్కడ నర్సులే అబార్షన్లు చేస్తున్నారు. ఇటీవల జిల్లా వైద్యాధికారులు చేసిన దాడుల్లో వాస్తవాలు వెలుగులోకి రాగా.. ఆ ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఐదుగురు సిబ్బందిని, మరో వైద్యుణ్ని కూడా ఈ సంఘటనలో అరెస్ట్‌ చేశారు. 

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 4: దొరికితే దొంగ.. దొరక్కుంటే దొర అన్నట్టు ఉంది జిల్లా కేంద్రంలోని కొందరు ఆసుపత్రుల తమకు అర్హత లేకపోయినా సంపాదనే లక్ష్యంగా ఆసుపత్రులను నిర్వహిస్తూ  ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డులో ఉండే ప్రముఖ డాక్టుర్లు.. సీట్లలో ఉండటం లేదని, చివరకు ఆ డాక్టర్‌కు చూయించుకుందామని వచ్చే వారికి.. ‘సార్‌ సెలవులో ఉన్నారు. ఇంకో డాక్టర్‌ఉన్నారు’ అని చెప్పి దాటేయడం, తూతూ మంత్రంగా వైద్యం చేయడం, అందినకాడికి దండుకోవడం లాంటివి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఆసుపత్రి పెట్టాలంలే కనీసం ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎంబీబీఎస్‌ ధ్రువపత్రంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు దరఖాస్తు చేస్తే అన్నీ పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. కానీ అక్రమార్కులు నకిలీ ఎంబీబీఎస్‌ ద్రువపత్రాన్ని సంపాదించి అధికారులను ఏమార్చి అనుమతులు పొందుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి బోర్డు ఏర్పాటు చేసి రాజధాని పరిధిలోని ప్రముఖ వైద్యుల పేర్లు బోర్డు మీద రాయిస్తున్నారు. లోపలికి వెళ్తే ఆ వైద్యులు కనిపించడం లేదు. వారిస్థానాల్లో జూనియర్‌ డాక్టర్లు కనిపిస్తున్నారు. అదేమని అడిగితే మీకు అత్యవసరమైతే వైద్యులను పిలిపిస్తామంటూ రోగులకు, వారి బంధువులకు నచ్చచెప్పుతున్నారు. మరికొన్ని ఆస్పత్రుల్లో మెడికల్‌ షాపు నిర్వాహకులే వైద్యులతో మందులు రాయించడం, వారి వ్యాపారానికి తగినట్టుగా రోగుల నుంచి అనవసరమైన చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా నిబంధనలు పెడుతూ అటు వైద్యులకు.. ఇటు వైద్య రంగానికి మకిలీ అంటేలా వ్యవహరిస్తున్నారు. 


నగరంలో వైరా రోడ్డు సమీపంలోనే..

ఈ దందా జరిగేది.. నగరంలోని మారుమూల ప్రాంతంలో అంటే పొరబడినట్టే. పక్కాగా నగర ప్రధాన రహదారి వైరారోడ్డు సమీపంలోనే ఇదంతా సాగుతోంది. వైరారోడ్డు సమీపంలో వందల కొద్ది ఆస్పత్రులు ప్రముఖ వైద్యుల పేర్లుతో పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఆర్‌ఎంపీలు, బంధువులు.. ఇతరత్రా పరిచయం ఉన్న వ్యక్తులతోనే కొనసాగుతున్నాయి. ఇలాంటి ఆస్పత్రులపై కన్నేయాల్సిన వైద్య ఆరోగ్యసిబ్బంది ఏదైనా సంఘటనలు జరిగితే తప్ప మిగతా సమయాల్లో మిన్నకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 


వైద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు?

తమ పరిధిలో ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. వైద్యానికి సంబంధించిన అంశాలే కాకుండా ఫీజులు, ఇతరత్రా వ్యవహారాలన్నీంటిని ఓ కంట కనిపెట్టాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. శాఖలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం, పని ఒత్తిడి వల్లే ఆస్పత్రులను తరచుగా తనిఖీలు చేయలేకపోతున్నామంటూ చెబుతున్నారు. దీంతో నకిలీలు, వైద్యాన్ని వ్యాపారంగా నిర్వహించే వ్యక్తులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. 

Updated Date - 2022-07-05T06:41:58+05:30 IST