ప్రభుత్వ విధానాలతో పోడు సమస్య జటిలం

ABN , First Publish Date - 2022-11-25T00:19:12+05:30 IST

ఏళ్ల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్న పోడు రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆరోపించారు.

ప్రభుత్వ విధానాలతో పోడు సమస్య జటిలం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని

పట్టాలు ఇవ్వకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

జూలూరుపాడు, నవంబరు 24: ఏళ్ల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్న పోడు రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆరోపించారు. గురువారం జూలూరుపాడులోని బీజేపీ జిల్లా కోశాధికారి నున్నా రమేష్‌ గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రోజురోజుకు పోడు సమస్య మరింత జఠిలంగా మారి అటవీశాఖాధికారులు, పోడు రైతులు ప్రత్యక్ష యుద్దానికి దిగాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండటంతో పోడు సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్ర సర్కార్‌ చోద్యం చూస్తూ అటవీ అధికారులపై నెట్టి వేస్తుందని విమర్శించారు. జిల్లాలోని పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతోనే టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లామని చెప్పారని, రైతులకు పట్టాలు ఇవ్వకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో కొత్తగూడెం క్లబ్‌లో రెండు రోజులపాటు కిసాన్‌మోర్చా ఉమ్మడి జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్‌, సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా కోశాధికారి నున్నా రమేష్‌, పార్టీ మండల అధ్యక్షుడు సిరిపొరపు ప్రసాద్‌, నాయకులు బి. శ్రీను, సుబ్బు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:19:12+05:30 IST

Read more