మట్టి మరణిస్తోంది..

ABN , First Publish Date - 2022-12-05T00:54:42+05:30 IST

మనం చనిపోతే మట్టిలో కలిసిపోతాం.అలాంటి మట్టి కూడా మరణిస్తోంది. మట్టి కూడా మరణిస్తోందంటే.. అర్థం సారం కోల్పోతోందని. మట్టిని సంరక్షించుకోవడానికి ఏటా డిసెంబరు 5న ప్రపంచ మట్టి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

మట్టి మరణిస్తోంది..

సారం కోల్పోతున్న భూమి

పంటలసాగులో రసాయనాల వాడకం కారణం

భూమికోత, ఫ్యాక్టరీల వ్యర్థాలు కూడా..

నేడు అంతర్జాతీయ మట్టి దినోత్సవం

ఖమ్మం వ్యవసాయం, డిసెంబరు 4: మనం చనిపోతే మట్టిలో కలిసిపోతాం.అలాంటి మట్టి కూడా మరణిస్తోంది. మట్టి కూడా మరణిస్తోందంటే.. అర్థం సారం కోల్పోతోందని. మట్టిని సంరక్షించుకోవడానికి ఏటా డిసెంబరు 5న ప్రపంచ మట్టి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిలోకి మనమే విషాన్ని నింపుతున్నాం. అడవుల్ని నరికేస్తున్నాం. ఎరువులు, పురుగుల మందులు ఇష్టమొచ్చినట్టు వాడుతున్నాం. మట్టిలో నుంచి శక్తికి మించి పంటని పిండుకోడానికి ప్రయత్నిస్తున్నాం. ఫలితం సారం కోల్పోతోంది. అలాగే ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, ప్లాస్టిక్‌ కవర్ల కూడా భూమి సాగుకు పనికి రాకుండా పోతుంది. మట్టి మరణించడం అంటే ఇదే. ఇప్పటికే 30 శాతం భూమి క్షీణతకి గురైంది. వచ్చే 30ఏళ్లలో వ్యవసాయ భూమి తగ్గిపోయి ప్రపంచమంతా ఆకలి చావులొస్తాయి.

చేతులారా భూమికి నష్టం..

ఉమ్మడి జిల్లాలో సుమారు 12లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉంది. విపరీతంగా రసాయన ఎరువులు వాడి చేతులారా నేలను కలుషితం చేస్తున్నారు. పోడు పేరుతో అడువులను కొట్టడం, అభవృద్ధి పేరుతో చెట్లను నరకడం వల్ల నేల కోతకు గురవుతోంది. ఖనిజ లవనాలు కొట్టుకుపోతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల నేల విషతుల్యం అవుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కోలుకోలేని దెబ్బ తగులుతోంది.

మట్టిని పరిరక్షిద్ధాం

కుడుముల వెంకట రామిరెడ్డి, ప్రకృతి రైతు భూమి రత్న అవార్డు గ్రహీత

జీవరాశి మనుగడలో ఎంతో ప్రాముఖ్యమున్న భూమి గురించి ఎవరూ పట్టించుకోరు. రైతులుపంటలు అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల మట్టిసారం తగ్గి నిర్జీవమవుతోంది. భూమిలో అధిక రసాయనాలు వాడడం వల్ల నీరు, గాలి, కలుషితమై జీవరాశి ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికైనా రైతులు పంటలకు రసాయనిక మందులు వాడకాన్ని తగ్గించి, ప్రకృతి పద్ధతిలో పంటలు సాగు చేసి మట్టిని, నీరు, గాలిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-12-05T00:54:43+05:30 IST