బండారుగుంపులో చెలరేగిన పోడు వివాదం

ABN , First Publish Date - 2022-09-25T04:36:16+05:30 IST

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని బండారుగుంపు గిరిజన గ్రామంలో పోడు వివాదం తారాస్థాయికి చేరింది. గత కొంతకాలంగా సాగుతున్న

బండారుగుంపులో చెలరేగిన పోడు వివాదం

గిరిజనులు, అటవీ అఽధికారుల మధ్య ఘర్షణ

అశ్వారావుపేట, సెప్టెంబరు 24: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని బండారుగుంపు గిరిజన గ్రామంలో పోడు వివాదం తారాస్థాయికి చేరింది. గత కొంతకాలంగా సాగుతున్న వివాదం రెండు రోజులుగా ముదిరి పాకాన పడింది. గిరిజనులు పోడు భూముల్లో అరకలు కట్టి దున్నుతుండగా అటవీ అధికారులు అడ్డుకోవటంతో గిరిజనులు, అటవీ అధికారుల మధ్యతోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గిరిజనులకు గాయాలయ్యాయి. బండారుగుంపు సమీపంలోని పోడుభూముల్లో దాదాపు వంద ఎకరాల్లో వివిధ గ్రామాలకు చెందిన వందమందికిపైగానే గిరిజనులు పోడు చేసుకుని జీవిస్తున్నారు. పోడు సాగు చేసుకుంటున్న తరుణంలో రెండు రోజులుగా గిరిజనులు అరకలు కట్టగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు అటవీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో ఒకానొక సమయంలో గిరిజనులు అటవీశాఖాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా అటవీశాఖాధికారులు దాడులు చేసి కొట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట రేంజ్‌ పరిధిలోని ఈ పోడు వివాదం నేపథ్యంలో దమ్మపేట, అశ్వారావుపేట రేంజ్‌లకు చెందిన దాదాపు వంద మంది సిబ్బంది ఘటన స్థలానికి వచ్చారు. పోడుసాగుదారులు రావటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పోడు భూమిని వదిలేదని, తమకు జీవనాధారం అయిన పోడుభూమిని తీసుకుంటే తాము ఎలా బతకాలంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు వివాదం నేపథ్యంలో  అశ్వారావుపేట పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసుల ఎదుటే రెండు వర్గాలు తీవ్రస్థాయిలో వాగ్వాదపడ్డాయి. అయినా గిరిజనులు పోడుభూములను వదలకపోవటంతో అటవీ అధికారులే సంఘటన స్థలం నుంచి వచ్చారు. ప్రస్తుతానికి బండారుగుంపులో హైటెష్షన్‌ నెలకొంది.


Read more