స్వరాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది

ABN , First Publish Date - 2022-05-30T05:40:01+05:30 IST

స్వరాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది

స్వరాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది
సిద్దారంలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల,

ఆశీర్వదిస్తే వైఎస్‌ఆర్‌ తరహాలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం

‘ప్రజాప్రస్థానం’లో వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల

సత్తుపల్లి / వేంసూరు, మే 29 : స్వరాష్ట్రంలో ఏనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ఆయన ప్రజలను పట్టించుకోలేదని, పరిపాలన చేతకాకపోతే అధికారంలో ఉండి ఏం లాభమని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సత్తుపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించిన ఆమె సిద్ధారంలో ప్రజలతో మాటామంతి, సదాశివునిపేట సత్తెమ్మతల్లి ఆలయం వద్ద రైతుగోస ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల సీఎం కేసీఆర్‌ పాలనపై విరుచుకుపడ్డారు. రైతును రారాజు చేస్తానని, భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్‌ రాష్ట్రం మీద రూ.4లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నారని ఆరోపించారు. రైతులను పట్టించుకోని కారణంగా 17లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారన్నారు. తనను ఆశీర్వదిస్తే వైఎ్‌సఆర్‌లాగే వ్యవసాయాన్ని పండుగ చేస్తానన్నారు. ఈసారి దళితబంధును పక్కన పెట్టి బీసీ, ఎస్టీబంధు అంటూ వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి రానున్నాడని, రైతును అన్నిరకాలుగా మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా పరిపాలన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఏ విధంగా ఆదుకోని ఈ ప్రభుత్వంలో రైతుబీమా రావాలంటే 60ఏళ్లకు ముందే చావాలా? అని ప్రశ్నించారు. భరోసా ఇచ్చే వారులేక రైతులు అప్పుల మీద అప్పులు చేస్తూ.. దిక్కుతోచక చనిపోతున్నారన్నారు. పంటలకు మద్దతు ధరను ప్రకటించక ముందే రైతులంతా తక్కువకు అమ్ముకుంటున్నారని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే దళారులను ఆశ్రయించి నట్టేట మునిగారన్నారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్‌కు మాత్రం ఆ నిబంధన వర్తించదా అని, ఏదీ కొనకుండా చేతులేత్తేస్తే రైతులు ఏం చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆమె పాదయాత్ర భీమవరం మీదుగా వేంసూరు మండలంలోకి ప్రవేశించారు. 


నేటి పాదయాత్ర ఇలా.. 

ఆదివారం సాయంత్రం భీమవరం వద్ద వేంసూరు మండలంలోకి ప్రవేశించిన షర్మిల లింగపాలెం, వేంసూరు, మర్లపాడులో పర్యటించి రాత్రికి మర్లపాడులో బస చేశారు. సోమవారం ఉదయం మర్లపాడు నుంచి ప్రారంభమై రాయిడుపాలెం, కొత్తూరు క్రాస్‌రోడ్‌, కల్లూరుగూడెం, ఎర్రసానివారిబంజర, గూడూరు, మొద్దులగూడెం మీదుగా అడసర్లపాడు గ్రామానికి చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు. ఈ క్రమంలో కల్లూరుగూడెంలో రైతుగోస ధర్నా, అడసర్లపాడులో ప్రజలతో మాటముచ్చటలో పాల్గొంటారు.Read more