వెలవెల పోతున్న వీధివ్యాపారుల ప్రాంగణం

ABN , First Publish Date - 2022-02-20T04:51:08+05:30 IST

వీధి వ్యాపారులకు ఒక నీడ కల్పించాలన్న ఉద్దేశ్యంతో రోటరీనగర్‌లో ఏర్పాటు చేసిన వీధివ్యాపారుల ప్రాంగణం నిరుపయోగంగా మారింది. దుకాణదారులు లేక వెలవెల పోతున్నది.

వెలవెల పోతున్న వీధివ్యాపారుల ప్రాంగణం

నిరుపయోగంగా వీధివ్యాపారుల ప్రాంగణం 

కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితి

ఖమ్మంకార్పొరేషన్‌, ఫిబ్రవరి19: వీధి వ్యాపారులకు ఒక నీడ కల్పించాలన్న ఉద్దేశ్యంతో రోటరీనగర్‌లో ఏర్పాటు చేసిన వీధివ్యాపారుల ప్రాంగణం నిరుపయోగంగా మారింది. దుకాణదారులు లేక వెలవెల పోతున్నది. చివరకు కరెంటుబిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో దుకాణదారులు ఉండగా, బిల్లు చెల్లించలేదని ఇటీవల ప్రాంగణానికి కరెంటు కట్‌ చేశారు. నగరపాలక సంస్థ అధికారులు చెప్పటంతో తిరిగి విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు.

రూ.36లక్షల వ్యయంతో

రోటరీనగర్‌లో పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంలో రూ.36లక్షల వ్యయంతో  ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 6నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో మొత్తం 128 షాపులు ఏర్పాటు చేసి వీధివ్యాపారులకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తొలుత 90 మంది వీధివ్యాపారులు దరఖాస్తు చేసుకోగా, వారికి దుకాణాలు కేటాయించారు. కూరగాయలతో పాటు పండ్లు విక్రయించే దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వ్యాపారం సరిగా సాగక పోవటంతో వీధివ్యాపారులు ఉండేందుకు ఇష్టపడటం లేదు. పండ్లను ప్రాంగణం బయటే విక్రయిస్తున్నారు. కొందరు తిరిగి బళ్లమీదనే కూరగాయల విక్రయాలు సాగిస్తున్నారు. వీధివ్యాపారులకు శాశ్వతంగా వ్యాపారాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిని వీధివ్యాపారుల ప్రాంగణం నిరుపయోగంగా మారింది.

10మంది కూడా లేరు.

ప్రస్తుతం ఈ వీధివ్యాపారుల ప్రాంగణంలో 10 మంది దుకాణదారులు కూడా లేరు. వారు కూడా సరిగా దుకాణాలు తీయటం లేదు. మిగిలిన షాపులు వ్యాపారులు లేక వెలవెల పోతున్నాయి. ఈ ప్రాంగణానికి కరెంట్‌బిల్లు చెల్లించే పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా దుకాణదారులు అందరూ కలిసి, కరెంట్‌బిల్‌ చెల్లించాలి. వ్యాపారం లేక పోవటంతో కరెంట్‌బిల్‌ చెల్లించక విద్యుత్‌ సరఫరాను నాలుగురోజుల పాటు నిలిపివేశారు. కాగా ఇక్కడ తాము ఉండమని, వ్యాపారం సాగటంలేదని వీధివ్యాపారులు మెప్మా అధికారులకు స్పష్టంగా చెబుతున్నారు. కాగా దుకాణాల కేటాయింపుకు మళ్లీ ధరఖాస్తులు తీసుకుంటామని మెప్మా జిల్లా సమన్యయకర్త సుజాత ఆంధ్రజ్యోతికి తెలిపారు.


Updated Date - 2022-02-20T04:51:08+05:30 IST