దేశాన్ని అవినీతిపరులు, నేరస్థులు పాలిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-05T00:52:46+05:30 IST

‘ఆపరేషన ఆకర్ష్‌’ రాజ్యాంగ విరుద్ధమని, దేశాన్ని అవినీతిపరులు, నేరస్థులు పాలిస్తున్నారని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్‌ స్కాంపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

దేశాన్ని అవినీతిపరులు, నేరస్థులు పాలిస్తున్నారు
మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

లిక్కర్‌ స్కాంపై కేసీఆర్‌ స్పందించరెందుకు?

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ఖమ్మం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన ఆకర్ష్‌’ రాజ్యాంగ విరుద్ధమని, దేశాన్ని అవినీతిపరులు, నేరస్థులు పాలిస్తున్నారని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్‌ స్కాంపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పులిబిడ్డలు అని ప్రకటించిన సీఎం లిక్కర్‌ స్కాంలో తన కూతురుని కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రతీ అంశంపై గంటల తరబడి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడే ముఖ్యమంత్రి ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు.

వందల కోట్ల అవినీతి జరిగిన కేసులో సీబీఐ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఆధారాలు కూడా దొరకకుండా మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మరో వైపు బీజేపీకి చెందిన బీఎల్‌ సంతోష్‌ వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం బీసీ కులగణన చేయడం లేదని విమర్శించారు. తమిళనాడు, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేవలం బహుజన సమాజ్‌ పార్టీ మాత్రమే నిజాయితీ, పారదర్శకత, సమాన అవకాశాల పరిపాలన అందిస్తుందని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఎస్పీ దూసుకుపోతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T00:52:47+05:30 IST