ప్రశాంతంగా పది పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-24T06:48:45+05:30 IST

ప్రశాంతంగా పది పరీక్షలు

ప్రశాంతంగా పది పరీక్షలు
ఖమ్మం జ్యోతిబాలమందిర్‌ పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఇరు జిల్లాల్లో 403మంది విద్యార్థులు గైర్హాజరు

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు

కొన్నిచోట్ల తాగునీటి బాటిళ్లను అనుమతించని అధికారులు 

ఖమ్మం ఖానాపురం హవేలి/కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 23: పదో తరగతి వార్షిక పరీక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 9:30 అయినా వేసవి నేపధ్యంలో విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తొమ్మిది గంటలనుంచి విద్యార్థులను కేంద్రాల్లోనికి అనుమతించారు. రెండు జిల్లాల్లోనూ ఎవ్వరూ పరీక్షకు ఆలస్యంగా రాలేదు. ఇరు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీంచారు. తొలిరోజు పరీక్షకు రెండు జిల్లాల్లో మొత్తం 30,486 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 403మంది విద్యార్థులు పరీక్షకు గౌర్హాజరయ్యారు. అయితే కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తెచ్చుకున్న తాగునీటి బాటిళ్లను లోనికి అనుమతించకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.


ఖమ్మం జిల్లాలో 17,401మంది హాజరు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 104కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా మొత్తం 17,543మంది విద్యార్ధులకుగాను 17,401మంది హాజరయ్యారు. 142మంది గౌర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. తొలిరోజు ఆరు ఫ్లయింగ్‌స్వ్కాడ్‌లు 57పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపారు 41మంది దివ్యాంగులు పరీక్షకు హాజరైనట్లు డీఈవో తెలిపారు. ఖమ్మం నగరంలోని జ్యోతిబాలమందిర్‌ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ గౌతమ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జవాబు పత్రాలను భద్రాపరిచే విషయంలో అధికారులకు పలు సూచనులు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలను అనుమతించవద్దని ఆదేశించారు. పరీక్షల నిర్వాహణ సూపర్‌వైజర్లు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, ఇన్విజిలేటర్లు ఎవ్వరూ సెల్‌ఫోన్లు తీసుకొని పరీక్ష కేంద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. అనంతరం పోలీసుభద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీటీవీలు, తాగునీటి సౌకర్యం, తదితర అంశాలను పరిశీలించారు. ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురం పరీక్షా కేంద్రంలోని ఓ గదిలోకి పాము రావడంతో కొద్దిసేపు కలకలం ఏర్పడింది. 


భద్రాద్రి జిల్లాలో 13,080మంది..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిరోజు 98.09శాతం హాజరు నమోదైంది. జిల్లాలో మొత్తం 13,346మంది విద్యార్థులకుగాను 13,085మంది పరీక్షకు హాజరయ్యారు. 261మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ అనుదీప్‌, డీఈవో సోమశేఖర్‌ శర్మ పరిశీలించారు.   కొత్తగూడెంలోని బాంబుక్యాంపు, చుంచుపల్లి ఉన్నత పాఠశాలలను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తీసుకొచ్చిన తాగునీటి బాటిళ్లను అనుమతించకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ విషయంలో ఆయా పరీక్ష కేంద్రాల అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు వ్యక్తం చేశారు. పాల్వంచలోని అభ్యుదయ పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన 40నిమిషాల వరకు విద్యుత సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు



Updated Date - 2022-05-24T06:48:45+05:30 IST