పక్కనే కూర్చుని పరీక్ష రాయిస్తారు

ABN , First Publish Date - 2022-10-11T05:36:16+05:30 IST

విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీలో చదువుకోవడం చాలా మంది విద్యార్థుల కల! ఆ కలను సాకారం చేసుకోవాలంటే అందుకు ఎక్కాల్సిన తొలి మెట్టు.. జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్స) అనే అర్హత పరీక్ష. ఆ మెట్టు విజయవంతంగా ఎక్కాలనుకునే విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆశలే ఆసరాగా దందా మొదలెట్టారు కొం

పక్కనే కూర్చుని పరీక్ష రాయిస్తారు

‘జీఆర్‌ఈ’ ఆనలైన పరీక్షల్లో అక్రమాలు

ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు

ఎక్కువ మంది అభ్యర్థులు ఒకేచోట ఉంటే

వారి వద్దకే వచ్చి రాయిస్తున్న కేటుగాళ్లు

తక్కువ మంది ఉంటే హైదరాబాద్‌, గుంటూరుకు

ఒక్కొక్కరి నుంచి రూ.30-50 వేల దాకా వసూలు

ఖమ్మం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీలో చదువుకోవడం చాలా మంది విద్యార్థుల కల! ఆ కలను సాకారం చేసుకోవాలంటే అందుకు ఎక్కాల్సిన తొలి మెట్టు.. జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్స) అనే అర్హత పరీక్ష. ఆ మెట్టు విజయవంతంగా ఎక్కాలనుకునే విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆశలే ఆసరాగా దందా మొదలెట్టారు కొందరు అక్రమార్కులు. ‘విద్యార్థి పక్కనే ఉండి పరీక్ష రాయిస్తాం’ అంటూ విద్యార్థులకు ఎర వేసి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. గతంలో ఈ పరీక్షను విద్యార్థులు ఆఫ్‌లైనలో (ప్రత్యక్షంగా హాజరై) రాసేవారు. కానీ కొవిడ్‌ సమయంలో.. ఆనలైనలో రాసే వెసులుబాటు విద్యార్థులకు లభించింది. దీన్నే అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రవేశ పరీక్షకు అయ్యే ఫీజు నుంచి పరీక్ష రాయించేదాకా అన్నీ తామే చూసుకుంటామంటూ ప్రత్యేక ప్యాకేజీలు పెడుతున్నారు. తమతో ఒప్పందం చేసుకున్న వారికి ఆనలైన పరీక్ష సమయంలో ఏకంగా పక్కన కూర్చునే సమాధానాలు అందిస్తున్నారు.

ఇలా చేస్తున్నారు..

విద్యార్థులతో బేరం కుదుర్చుకుంటున్న మధ్యవర్తులు.. వారు ఎప్పుడు ఎక్కడ పరీక్ష రాయాలో ముందుగా చెబుతారు. పరీక్ష రాసే సమయంలో పక్కన ఉండి సమాధానాలు చెప్పే వ్యక్తులను ఏర్పాటు చేస్తారు. అయితే.. ఆనలైన పరీక్ష రాయడానికి ముందు.. విద్యార్థులు తాను ఉన్న ప్రదేశం మొత్తాన్నీ కెమెరాలో చూపించాల్సి ఉంటుంది. ఆ సమయంలో సదరు వ్యక్తులు అక్కడ కనిపించకుండా దాక్కుని ఉంటున్నారు.  పరిశీలన పూర్తయిన అనంతరం వారు చాటుగా అభ్యర్థుల పక్కకు వచ్చి కూర్చుని.. మాట్లాడకుండా పుల్లలను ఉపయోగించి వారికి ఆప్షన్లను చూపుతూ సమాధానాలు తెలిసేలా చేస్తున్నారు. అలా అభ్యర్థి పక్కన కూర్చుని సమాధానాలు చెప్పే వారితో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థి పక్కన కూర్చున్న వ్యక్తికి ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. వారు వెంటనే ఆ ప్రశ్నను వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేస్తారు. వెంటనే ఆ గ్రూపులో దానికి సమాధానం వచ్చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా బ్రోకర్లు..

ఈ అక్రమ దందాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా బ్రోకర్లు ఉన్నట్టు సమాచారం. వారు అభ్యర్థుల నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసి పరీక్షలు రాయిస్తున్నట్టు తెలిసింది. ఒకే చోట ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే.. వారంతా ఉన్న ప్రదేశంలోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారని, తక్కువ మంది అభ్యర్థులు ఉంటే వారిని హైదరాబాద్‌, గుంటూరు ప్రాంతాలకు రమ్మని చెప్పి అక్కడ పరీక్షలు రాయిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఖమ్మం జిల్లాలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఇదే రీతిలో పరీక్షలు రాసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. కొందరు అభ్యర్థులు రూ.50 వేల దాకా చెల్లించినా వారికి జీఆర్‌ఈ పరీక్షలో తాము అనుకున్న యూనివర్సిటీకి కావాల్సినంత స్కోర్‌ రాలేదంటూ వాపోతున్నట్టు సమాచారం. ఈ తంతంగమంతా హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ ప్రాంతం నుంచి సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుల పాత్ర ఉన్నట్లు సమాచారం. 

ఆనలైన ఎత్తేస్తారంటూ.. 

వచ్చే ఏడాది నుంచి జీఆర్‌ఈ ఆనలైన పరీక్ష విధానాన్ని ఎత్తేస్తారని ప్రచారం చేస్తూ అక్రమార్కులు తమ జోరును పెంచుతున్నారు.  ఆఫ్‌లైనలో పరీక్ష రాస్తే స్కోర్‌ చేయడం కష్టమని, ఆనలైనలో అయితే.. తమకు నగదు చెల్లిస్తే అంతా తామే నడిపిస్తామని చెబుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎరవేస్తున్నారు. ఒక్కసారి జీఆర్‌ఈలో అర్హత సాధిస్తే ఐదేళ్ల వరకు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉండటంతో విద్యార్థులు కూడా కాపీయింగ్‌కు వెనకాడటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా.. బీటెక్‌ తృతీయ, చివరి సంవత్సరంలో ఉన్న వారు ఆయా మధ్యవర్తులను సంప్రదిస్తుండటంతో కేటుగాళ్ల డిమాండ్‌ పెరిగిపోయినట్టు తెలుస్తోంది. అయితే.. కష్టపడి జీఆర్‌ఈకి సిద్ధమవుతున్న వారికి ఈ కాపీయింగ్‌ అభ్యర్థులు, అక్రమార్కుల వల్ల తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి, ఇప్పటికైనా ఈ దందాను కట్టడిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2022-10-11T05:36:16+05:30 IST