లౌకికవాదులు ఏకం కావాలి

ABN , First Publish Date - 2022-08-15T06:12:47+05:30 IST

లౌకికవాదులు ఏకం కావాలి

లౌకికవాదులు ఏకం కావాలి
కల్లూరులో భట్టి విక్రమార్క పాదయాత్ర

రాహుల్‌ను ప్రధాని చేయడమే వారి లక్ష్యం కావాలి 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రకు పెనుబల్లిలో ముగింపు

కల్లూరు/పెనుబల్లి, ఆగస్టు 14: రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లౌకికవాదుల లక్ష్యమై ఉండాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చేపట్టిన ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర ఆదివారం ముగిసింది. ఈ యాత్ర జిల్లాలోని కూసుమంచిలో ప్రారంభం కాగా మొత్తం 90 కిలోమీటర్లు సాగిన యాత్ర పెనుబల్లిలో ముగిసింది. ఈ సందర్భంగా పలు మండలాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకికవాదులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. సంపన్నులకి ఇచ్చిన సబ్సిడీలు, పేదలకు వెచ్చించిన సంక్షేమ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులు రాహుల్‌ను ప్రధానిని చేసి లౌకికవాదాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో జాతీయవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటం  కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం కూల్చివేస్తోందని ఆరోపించారు. ప్లానింగ్‌ కమిషనను ఎత్తివేయడం, పంచవర్ష ప్రణాళికలు లేకుండా చేయడం అందులో భాగమేనన్నారు. దేశాభివృద్ధికి మోదీ వ్యతిరేకం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ప్రశ్నించే వారిపైకి సీబీఐ, ఐటీ, ఈడీ వ్యవస్థలను ఉసిగొల్పుతూ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని భట్టి పిలుపు నిచ్చారు.


కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

 కాంగ్రెస్‌ హయాంలోనే మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పాఠశాలలు, రోడ్లు, ఏర్పాటుచేసినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పెనుబల్లిలో ఆదివారం రాత్రి ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75సంవత్సరాలైన సందర్భంగా వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన యాత్ర పెనుబల్లి వరకు కొనసాగిందన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్న మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు ఈ 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నాంది కావాలన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు మాట్లాడారు.  


90 కిమీ పూర్తి చేసుకున్న పాదయాత్ర 

75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ప్రారంభమై సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ, కల్లూరు, మండలాల మీదగా ఆదివారం రాత్రి పెనుబల్లి మండలానికి చేరుకొని 90 కిమీతో ముగిసింది. జిల్లాలో ఆరురోజులుగా సాగిన ఈ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన రావటంతో కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌లో జోష్‌ నింపింది. ‘ఆజాదీ కా గౌరవ్‌’ పేరిట  నిర్వహించిన ఈ పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగెస్‌ భావాజాలన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ పాదయాత్ర ఎంతగానో దోహద పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంబాని చంద్రశేఖర్‌తోపాటుగా కాంగ్రె్‌సమండల అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, అంకిరెడ్డి సుధీర్‌రెడ్డి, కొండూరి కిరణ్‌, తోట జనార్థన పాల్గొన్నారు.



Updated Date - 2022-08-15T06:12:47+05:30 IST