శాంపిల్‌లోనే ‘స్కాం’పీ..!

ABN , First Publish Date - 2022-12-05T00:45:04+05:30 IST

మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చేప, రొయ్య పిల్లల పంపిణీలో రోజు రోజుకూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. గతంలో చేపపిల్లలు పోయకుండానే పోసినట్టుగా.. రావాల్సిన వాటికంటే తక్కువ తీసుకొచ్చి మమ అనిపించడం.. తప్పుడు బ్యాంకు గ్యారంటీలు, లారీల లెక్కలు చూపించడం లాంటి ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

శాంపిల్‌లోనే ‘స్కాం’పీ..!
ఇటీవల పాలేరులో లారీలో రొయ్యల శాంపిళ్లను సేకరిస్తున్న దృశ్యం

మిగిలిందంతా మాల్కంసోని పోత

మంచినీటి రొయ్యలకు బదులు మాంసాహార రొయ్యలు

చేప పిల్లల మాదిరిగానే రొయ్యల పంపిణీ కూడా

పాతవారికి అప్పగించడంతోనే అక్రమాలంటూ ఆరోపణలు

స్కాంపీ: ఈ రొయ్యల శరీరం నీలివర్ణంలో ఉండటంతో వీటిని నీలికంఠరొయ్యలుగా పేర్కొంటారు. చెరువుల అడుగు భాగంలో అతి వేగంగా పెరిగే ఈ రకం రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మంచినీటి చెరువుల్లో పెంపకానికి చాలా అనువైనవని నిపుణులు చెబుతున్న ఈ స్కాంపీ రొయ్యలు ఐదు నెలల్లోనే మంచి సైజు పెరిగి కిలోకు 30 రొయ్యల వరకు తూగుతాయి.

మాల్కంసోని: దీనిని తెల్లస్కాంపి రొయ్య (మాక్రో బ్రాకియం మాల్కంసోని) అని, కొన్ని ప్రాంతాల్లో వీటిని పచ్చరొయ్యగా వ్యవహరిస్తారు. ఇవి మాంసాహార రొయ్యలు కాగా.. వీటిని ఎక్కువగా గోదావరి నది పాయల్లో సాగు చేస్తారు. ఈ రకం రొయ్య వర్షాకాలం తర్వాత లార్వా దశకు చేరుకుంటుంది. శీతాకాలంలో ప్రౌడజీవులుగా మారే మాల్కంసోని ఏడాది పాటు పెరిగినా 100గ్రాముల నుంచి 150గ్రాముల మాత్రమే సైజు వస్తుంది.

ఖమ్మం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చేప, రొయ్య పిల్లల పంపిణీలో రోజు రోజుకూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. గతంలో చేపపిల్లలు పోయకుండానే పోసినట్టుగా.. రావాల్సిన వాటికంటే తక్కువ తీసుకొచ్చి మమ అనిపించడం.. తప్పుడు బ్యాంకు గ్యారంటీలు, లారీల లెక్కలు చూపించడం లాంటి ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అయినా గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా అక్రమాలకు పాల్పడవచ్చన్న ఉద్దేశంతో కొందరు బిడ్డర్లు అతి తక్కువకు టెండర్లు వేసి పంపిణీ కాంట్రాక్టులను చేజిక్కుంచుకున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా అదే తీరున అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన తొలిరోజుల్లోనే కలెక్టర్‌ చేపపిల్లల పంపిణీ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలని నిర్ణయించారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభం రోజునే నేరుగా కలెక్టర్‌ చేపపిల్లలు లెక్క వేయించగా.. నాలుగువేల చేప పిల్లలు తగ్గాయి. దీంతో వచ్చిన పిల్లలకే లెక్కలు రాసి మిగిలిన చేపపిల్లలు మళ్లీ తీసుకురావాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఇలా జిల్లాలో చాలాచోట్ల చేపల పంపిణీ విషయంలో ఆందోళన జరగడంతోపాటు పలుమార్లు పిల్లలను తిరస్కరించడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు తమ పప్రాబల్యాన్ని చాటుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే చేపపిల్లల పంపిణీ మాదిరిగానే ప్రస్తుతం జిల్లాలో సాగుతున్న రొయ్యపిల్లల పంపిణీలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రకం రొయ్య పిల్లలకు బదులుగా మరో రకం రొయ్య పిల్లలను పోసి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిల్లల పోయడంలోనే మాయ

రొయ్య పిల్లల పంపిణీకి సంబంధించి స్కాంపీ (నీలికంఠ రొయ్య)లను పంపిణీ చేస్తామంటూ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటిని జలశయాల్లో వదిలే సమయంలోనే ‘స్కాం’ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా రొయ్యలను తీసుకొచ్చిన సమయంలో లారీల నుంచి శాంపిళ్లను సేకరించి ఉన్నతాధికారులకు ఆనలైనలో చూపించే సమయంలో స్కాంపీ రొయ్యలను చూపి ఆ తర్వాత ఆ రొయ్యలకు బదులుగా మాల్కంసోనిలను నీటిలోకి వదులుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కాంపీ ధర రూ.2 వరకు ఉండగా.. మాల్కంసోని ధర మాత్రం రూ.15 నుంచి రూ.20పైసలు మాత్రమే ఉండటంతో కాంట్రాక్టర్లు ఈ రకమైన ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ స్కాంపీ తీసుకొచ్చినా కేవలం 50వేల నుంచి 60వేల సీడ్‌ను మాత్రమే తీసుకొచ్చి 2లక్షల వరకు తీసుకొచ్చినట్టుగా చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి లారీల్లో వచ్చిన పిల్లలను లెక్కించాల్సి ఉండగా.. అలాంటివేమి లేకుండానే నేరుగా రిజర్వాయర్లో వదులుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాలో ఓ ప్రాంతంలో డ్రమ్ముల నుంచి నెట్‌ వేసి పిల్లలను శాంపిళ్లు తీసిన క్రమంలో నెట్‌ పూర్తిగా లోపలకి తీసుకెళ్లినా కేవలం మూడు, నాలుగు పిల్లలే చిక్కాయని, రొయ్య పిల్లల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనడానికి అదే నిదర్శనమన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పిల్లలు పోసే సమయంలో అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులను పిలవాల్సి ఉన్నా వారికి సంబంధం లేకుండానే పోస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే తక్కువ ధరకు బిడ్డింగ్‌ వేసిన గత కాంట్రాక్టర్లు ఈ తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గతంలో అక్రమాలకు పాల్పడిన సంఘటనలకు సంబంధించి ముందడుగు పడకపోవడంతో వారు యథేచ్చగా తమ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు?

రొయ్యల పంపిణీకి సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్లతో అధికారులు కూడా కుమ్మక్కయ్యి మామూళ్ల మత్తులో అక్రమార్కులకు వంత పాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా కాంట్రాక్టర్లు రొయ్యలను తీసుకొచ్చిన సమయంలో స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ముడుపులు మూటగట్టుకుంటున్నారన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఒక్కో లారీకి సంబంధించి రూ.30వేల నుంచి రూ.50వేల వరకు మామూళ్లు ముట్టజెబుతున్న కాంట్రాక్టర్లు తమ పని తాము చేసుకుని పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలా అక్రమాల్లో భాగంగా స్కాంపీ బదులు, మాల్కంసోని పోయడం, వేలల్లో తీసుకొచ్చి లక్షల్లో పంపిణీ చేసినట్టు చూపించడం లాంటి కారణాలతో అంతిమంగా మత్య్సకారులు నష్టపోయే ప్రమాదం ఉంది. పిల్లలు పోసిన అనంతరం వాటిని తిరిగి మత్య్సకారులు పట్టే క్రమంలో అనుకున్నస్థాయిలో దిగుబడి రాకపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై విచారణ జరిపి మున్ముందు ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మత్య్సకారులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-05T00:45:05+05:30 IST