సర్కారు లబ్ధికి పేదరికమే గీటురాయి

ABN , First Publish Date - 2022-11-27T22:53:40+05:30 IST

‘సర్కారు పొందే లబ్ధికి పేదరికమే గీటురాయి. 899 మందికి మంజూరైన రూ.57.50 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నట్లు’ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

సర్కారు లబ్ధికి పేదరికమే గీటురాయి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, నవంబరు 27: ‘సర్కారు పొందే లబ్ధికి పేదరికమే గీటురాయి. 899 మందికి మంజూరైన రూ.57.50 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నట్లు’ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులు 899 మంది లబ్ధిదారులకు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దూరపు కొండలు నునుపు.. ఎండమావులను చూసి సామెతలను గుర్తుచేస్తూ వ్యతిరేక శక్తుల ఆలోచనలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వార్థపర రాజకీయాలు, తప్పుడు పద్ధతులను ప్రజలు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారన్నారు. కేసీఆర్‌ను మించిన నాయకుడు దేశంలో ఎక్కడా లేడని అన్నారు. కొత్తగూడెంతో పాటు ఖమ్మంలో మెడికల్‌ కళాశాలలు, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, పెనుబల్లి, కల్లూరులో ఆసుపత్రుల నిర్మాణాలకు ప్రతిపాదనలు.. ఇంకా పల్లె, బస్తీదవాఖానలతో వైద్యారోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రహదారులు లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ఇతర గ్రామాలకు లింకు రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, సీజనల్‌ వ్యాధులపై దృష్టి పెడుతూ త్వరలోనే కంటివెలుగులో భాగంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

సంక్రాంతిలోగా శంకుస్థాపనలు

రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండి పార్థసారధిరెడ్డి సొంత నిధులతో సత్తుపల్లి, వేంసూరు మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలు, సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవనం, కల్లూరులో బస్టాండ్‌ తదితర పనులకు ఈ సంక్రాంతిలోగా శంకుస్థాపనలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్‌డీఎఫ్‌, సీఎస్‌ఆర్‌ నిధులు, కేటీఆర్‌ సత్తుపల్లి పర్యటనలో ఇచ్చిన హామీలతో పాటు తన నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల సాగే లక్ష్యంగా పామాయిల్‌ రైతులను ప్రోత్సహించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలను నర్సరీల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఆయిల్‌ఫెడ్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంధాలయ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు మోనార్క్‌ రఫీ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:53:46+05:30 IST