వైరాలో రింగ్‌ నిర్మాణం ఎన్నడో!

ABN , First Publish Date - 2022-11-02T23:28:52+05:30 IST

నియోజకవర్గంగా, మునిసిపాలిటీగా రూపాంతరం చెందిన వైరా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది.

వైరాలో రింగ్‌ నిర్మాణం ఎన్నడో!
రింగ్‌ నిర్మించాల్సిన క్రాస్‌రోడ్డు

వైరా, నవంబరు 2: నియోజకవర్గంగా, మునిసిపాలిటీగా రూపాంతరం చెందిన వైరా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది. వైరాలోని జాతీయ ప్రధాన రహదారిలో క్రాస్‌రోడ్డు వద్ద రింగ్‌ నిర్మాణం గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. చౌరస్తా అయిన క్రాస్‌రోడ్డు వద్ద రింగ్‌ లేని కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇక్కడ రింగ్‌ నిర్మించి ఫౌంటేన్‌ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించినప్పటికీ ఇంతవరకు అతీగతీ లేదు. మునిసిపాలిటీలో పట్టణ సుందరీకరణలో భాగంగా పౌంటేన్‌ నిర్మిసా ్తమని ఖమ్మానికి ధీటుగా వైరాను కూడా సుందరీకరణ చేస్తామని మంత్రి పువ్వాడ పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్భంగా చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలు నీటిమూటగానే మిగిలిపోయాయి. దాదాపు ఐదేళ్ల కిందట టీయూఎఫ్‌ఐడీసీ కింద వైరాకు మంజూరైన రూ.20కోట్ల నిధుల్లో ఇక్కడ జాతీయ ప్రధాన రహదారిలో క్రాస్‌రోడ్డు వద్ద రింగ్‌ నిర్మాణం, ఫౌంటేన్‌ ఏర్పాటుకు రూ.30 లక్షలు నిధులు మంజూరైనా ఇంతవరకు దాని ఊసెత్తినవారే లేరు. సుడా(స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) నుంచి రూ.కోటికిపైగా నిధులిస్తామని, క్రాస్‌రోడ్డు వద్ద రింగ్‌ నిర్మాణంతోపాటు పౌంటేన్‌ ఏర్పాటు, రిజర్వాయర్‌కు వెళ్లే రోడ్డును అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ వైరాలో పలుసార్లు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు.

భారీగా లారీల రాకపోకలు

రిజర్వాయర్‌ రోడ్డు, మధిర-జగ్గయ్యపేట రోడ్డు, తల్లాడ-దేవరపల్లి రోడ్డు, ఖమ్మం-హైదరాబాద్‌ వెళ్లే రోడ్డుతో క్రాస్‌రోడ్డు చౌరస్తా ఉంది. మధిర-జగ్గయ్యపేట వైపు నిత్యం వేలాది సిమెంట్‌, బొగ్గు, యాష్‌కు చెందిన భారీ లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రధాన రహదారిని క్రాస్‌ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. అలాగే జాతీయ ప్రధాన రహదారి నుంచి ఇతర రోడ్లకు ఏవాహనం ఎటునుంచి వస్తుందో, ఎటు వెళ్తుందో కూడా తెలియని ప్రమాదకర పరిస్థితి. ఆర్టీసీ బస్టాండ్‌ కూడా మధిర-జగ్గయ్యపేట రోడ్డులో ఉండటంతో వందలాది బస్సులు రాకపోకలకు ప్రమాదకరంగా ఉంది. ఇటీవల భారీ వాహనాలు క్రాస్‌రోడ్డు వద్ద సెంట్రల్‌ లైటింగ్‌కు చెందిన హైమాస్‌ కరెంట్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ స్వయంగా సంఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఇక్కడ వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణ కోసం వెంటనే రింగ్‌ నిర్మాణం ఒక్కటే పరిష్కారమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ప్రమాదకర పరిస్థితి దృష్ట్యా వెంటనే రింగ్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-11-02T23:29:12+05:30 IST
Read more