నీ మాయ మాటలు నమ్మరు

ABN , First Publish Date - 2022-04-25T03:52:28+05:30 IST

పినపాక నియోజకవర్గంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సంధర్భంగా సీఎం కేసీఆర్‌ పాలపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పందించారు.

నీ మాయ మాటలు నమ్మరు
షర్మిల పాదయాత్రపై ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే రేగా కాంతారావు పెట్టిన పోస్ట్‌

మణుగూరు, ఏప్రిల్‌ 24: పినపాక నియోజకవర్గంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సంధర్భంగా సీఎం కేసీఆర్‌ పాలపై  చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పందించారు. ఆదివారం సోషల్‌ మీడియాలో పలు పోస్టులు చేశారు. ‘నీ మాయ మాటలు ఎవరూ నమ్మరు. ఎన్నికిలోమీటర్లు నడిశావో రాసుకో. నిన్ను ఆడిచ్చేవారికి చెప్పుకోవడానికే యాత్ర. అంతకంటే ఏమీ ఉపయోగం లేదు. కేసీఆర్‌ అంటే తెలంగాణ గొంతుక. నీలెక్క ఆడిస్తే ఆడేవాళ్లం కాదు షర్మిళక్కా.. ప్రతీ ఓడు తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ను తిడితే ఓట్లోస్తాయని అనుకుంట ఎలా? మంత్రాలకు చింతకాయలు రాలవు. 2023 తరువాత నీ పార్టీ అడ్రస్‌ ఎక్కడో జర చెప్పక్కా షర్మిలమ్మా’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ‘కేసీఆర్‌ను తిట్టి నవ్వుల పాలు కాకు. నువ్వునీ పార్టీ శక్తేంటో ప్రజలకు తెలుసని’ హితవు పలికారు. 

కాంతారావుపై అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదు

అశ్వాపురం ఏప్రిల్‌ 24: ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుపై వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసంకాదని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కోడి అమరేందర్‌ మాట్లాడారు. ఉనికిని కాపాడుకోవడానికే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కానరావడం లేదా అని ప్రశ్నించారు. పినపాక నియోజక వర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు, కూలీ ఇచ్చి జనాలను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తున్న వారికి రేగాను విమర్శించే అర్హత లేదన్నారు. సమావేశంలో  వైస్‌ ఎంపీపీ కంచుట్ల వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, నాయకులు వెన్నా అశోక్‌, వెంకటరమణ, వీరారెడ్డి, సురేష్‌రెడ్డి ,రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-04-25T03:52:28+05:30 IST