సీతారామ ప్రాజెక్టుకు రైల్వే లైన్‌ క్రాసింగ్‌

ABN , First Publish Date - 2022-12-13T23:33:03+05:30 IST

సీతారామ ప్రాజెక్టు కాలువల తవ్వకంలో డోర్నకల్‌- పోచారం, డోర్నకల్‌- గార్ల సమీపంలో రెండు రైల్వే వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌కు సీతారామ ప్రాజెక్టు కాలువ అనుసంధానం చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలువ డోర్నకల్‌- పోచారం స్టేషన్‌, డోర్నకల్‌- గార్ల సమీపంలో 34.561, 37.551 కిలోమీటర్‌ సమీపంలో రైల్వే లైన్‌ను క్రాస్‌ చేస్తోంది.

సీతారామ ప్రాజెక్టుకు రైల్వే లైన్‌ క్రాసింగ్‌
రైల్వే అధికారులతో సమీక్షిస్తున్న నీటిపారుదల సీఈ శంకర్‌నాయక్‌ తదితరులు

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 13: సీతారామ ప్రాజెక్టు కాలువల తవ్వకంలో డోర్నకల్‌- పోచారం, డోర్నకల్‌- గార్ల సమీపంలో రెండు రైల్వే వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌కు సీతారామ ప్రాజెక్టు కాలువ అనుసంధానం చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కాలువ డోర్నకల్‌- పోచారం స్టేషన్‌, డోర్నకల్‌- గార్ల సమీపంలో 34.561, 37.551 కిలోమీటర్‌ సమీపంలో రైల్వే లైన్‌ను క్రాస్‌ చేస్తోంది. ఇక్కడ రైల్వే లైన్‌ కింది నుంచి సీతారామ కాలువ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహిం చారు. అక్కడ వంతెన నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. దీనికోసం ప్రతిపాదనలను సిద్దం చేసేందుకు రూ.కోటి నిధులను నీటిపారుదల శాఖ రైల్వే శాఖకు అందించింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు వంతెన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. మంగళవారం ఖమ్మానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ అభయ్‌కుమార్‌ గుప్తా, సీనియర్‌ డీఈఎన్‌ సజ్జ తో పాటు ఇతర విభాగాల అధికారులతో నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌నాయక్‌ సమీక్షించారు. ఈ రెండు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతులు ఇవ్వడంతో వాటిపై చర్చించారు. వంతెనల నిర్మాణానికి రూ.66 కోట్లను ఇప్పటికే నీటిపారుదల శాఖ రైల్వే అధికారులకు డిపాజిట్‌ చేసింది. వంతెనలకు ప్రతిపాదనలను సిద్ధం చేసిన రైల్వేశాఖ త్వరలో టెండర్ల ప్రక్రియను నిర్వహించనున్నట్లు డీఆర్‌ఎం స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు కాలువల నిర్మాణంతో పాటు వంతెనల నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సీఈ శంకర్‌నాయక్‌ వివరించారు. ఈనేపథ్యంలో పనులను సత్వరమే ప్రారంభించి పూర్తిచేసేందుకు రైల్వేశాఖ సహకరించాలని సీఈ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు ఎస్‌ఈ నర్సింగరావు, ఈఈలు శ్రీనివాసాచార్యులు, డీఈలు కిశోర్‌, వెంకన్న పాల్గొన్నారు.

మహిళా పోలీసుల విశ్రాంతి భవనం ప్రారంభం

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో నూతనంగా నిర్మించిన మహిళా పోలీసులు విశ్రాంతి భవనాన్ని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ అభయ్‌కుమార్‌ గుప్తా, సీనియర్‌ డీఈఎన్‌ సజ్జతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యతను కల్పిస్తూ రైల్వే శాఖలో మొట్టమెదటి సారిగా అధునాత హంగులతో సౌత్‌సెంట్రల్‌ రైల్వే మహిళలకు విశ్రాంతి భవనాలను నిర్మించిన ఘనత దక్కుతుందన్నారు. ప్రయాణికులకు, అధికారులకు రైల్వే రక్షణ దళం పోలీసు లకు మహిళలకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తుందన్నారు. ఆయన వెంట సీనియర్‌ డీఈఎన్‌ వెంకటరెడ్డి, సామిరా ఇన్ర్ఫా శ్రీనివాస్‌నాయుడు, ఖమ్మం స్టేషన్‌ మేనేజర్‌ ప్రసాద్‌, సీఐ జాఫర్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌, ప్రసన్నకుమార్‌, డీఆర్‌ఎల్‌బీ శాస్త్రి, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:33:04+05:30 IST