భద్రాద్రిలో పునర్వసు దీక్ష విరమణ

ABN , First Publish Date - 2022-12-12T00:38:43+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామపునర్వసు దీక్ష విరమణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీరామదీక్షితులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్య సన్నిధికి చేరుకొని నిత్య కల్యాణ మండప వేదిక వద్ద అర్చకస్వాములచే విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, అష్టోత్తరం నిర్వహించి తిరువడి (ఇరుముడి)ధారణ చేశారు.

భద్రాద్రిలో పునర్వసు దీక్ష విరమణ
భద్రగిరి ప్రదక్షిణ

భద్రగిరి ప్రదక్షిణ.. సామివారికి వెండి రథసేవ

నేడు శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం, డిసెంబరు 11: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామపునర్వసు దీక్ష విరమణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీరామదీక్షితులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్య సన్నిధికి చేరుకొని నిత్య కల్యాణ మండప వేదిక వద్ద అర్చకస్వాములచే విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, అష్టోత్తరం నిర్వహించి తిరువడి (ఇరుముడి)ధారణ చేశారు. అనంతరం భద్రాద్రి దేవస్థానం సహాయ కార్యనిర్వహణ అధికారి వి.శ్రవణ్‌కుమార్‌ శ్రీరామపాదుకలను శిరస్సుపై ధరించి భద్రగిరి ప్రదిక్షణ నిర్వహించారు. చివరగా స్వామివారి సన్నిధిలో తిరువడిని శ్రీరామదీక్షితులు సమర్పించారు. అనంతరం స్థానిక యాగశాల వద్ద నిర్వహించిన సంక్షేప రామాయణ హవనంలో శ్రీరామదీక్షితులు పాల్గొన్నారు. రాత్రి శ్రీరామదీక్షితుల కోసం రామయ్యకు వెండిరథ సేవ నిర్వహించారు. అలాగే సోమవారం శ్రీరామదీక్షితుల కోసం స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీరామదీక్షితుల కోసం దేవస్థానం అధికారులు అన్నదాన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన, ఉప ప్రధాన అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజం, వేద పండితులు ద్వివేదుల సత్యసాయి సన్యాసి శర్మ, కామేశ్వర శర్మ, లింగాల రామకృష్ణ ప్రసాద్‌, మల్లూరి రవికుమార్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మూలవరులకు అభిషేకం

భద్రాద్రి దేవస్థానంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అలాగే ఆర్జితసేవగా సువర్ణ పుష్పార్చన, కేశవనామార్చన, సహస్రనామార్చన, నిత్యకల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన నిత్యన్నదాన పథకానికి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కుప్పాల రామమూర్తి దంపతులు రూ.1.05లక్షలు విరాళంగా అందజేశారు.

Updated Date - 2022-12-12T00:38:43+05:30 IST

Read more