‘ప్రికాషన్‌’ పరేషాన్‌!

ABN , First Publish Date - 2022-09-20T05:16:58+05:30 IST

ప్రపంచాన్నే గడగడలాడించిన కొవిడ్‌ను తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొదటి, రెండు విడతల్లో కరోనా కేసులు వేలల్లో

‘ప్రికాషన్‌’ పరేషాన్‌!

వ్యాక్సినేషన వేయకుండానే వేసినట్టుగా నమోదు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పూర్తయినట్టు ఫోన్లకు సందేశాలు

‘డోస్‌’ శాతం పెంచి చూపేందుకు అధికారుల జిమ్మిక్కులు

అవాక్కవుతున్న జనం.. ఉమ్మడి జిల్లాలో వందలమంది బాధితులు

ప్రైవేటుకు అమ్ముతున్నారంటూ ఆరోపణలు

ఖమ్మం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచాన్నే గడగడలాడించిన కొవిడ్‌ను తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొదటి, రెండు విడతల్లో కరోనా కేసులు వేలల్లో నమోదవడం, వందల మంది ప్రాణాలను కోల్పోతున్న సమయంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సినను ప్రజలకు ఉచితంగా అందించింది. ముఖ్యంగా వైరస్‌ రెండోదశ వ్యాప్తి సమయంలో టీకా కోసం బారులు తీరిన సందర్భాలున్నాయి. ఎట్టకేలకు రెండు డోసుల లక్ష్యాన్ని పూర్తిచేసిన యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడో విడతగా ప్రికాషన్‌డోస్‌ను కూడాఅందుబాటులోకి తెచ్చింది. కానీ వైరస్‌ వ్యాప్తి ప్రభావం తగ్గడం, కేసులు ఒకటీ రెండు మాత్రమే నమోదవుతుండటం, బాధితులు సాధారణ వైద్యానికే కోలుకుంటుండటంతో ప్రజలు మూడో విడతగా ప్రికాషన్‌ డోసును తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు కూడా వ్యాక్సిన్లు వేయడంలో ఒకింత నిర్లక్ష్యంగానే వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం తమకిచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసినట్టుగా చూపేందుకు మాయజాలం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు వ్యాక్సిన వేయకుండానే వేసినట్టుగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారని, ఫలితంగా గతంలో రెండు డోసులు వేసుకున్న వారికి ప్రికాషన్‌ డోస్‌ కూడా పూర్తి అయినట్టు ఫోన్లకు సందేశాలు వస్తుండటం, కొవిన్‌ యాప్‌లో వచ్చే ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌లో కూడా  అదే ఉంటుండటం విస్మయానికి గురిచేస్తోంది. 

మొదటి ‘ప్రీ’కాజ్‌ ఏంటో?

మూడో డోస్‌ తీసుకోకపోయినా తీసుకున్నట్టుగా సందేశాలు రావడం వెనుక అంతర్యమేంటనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా కొందరు అధికారులు వ్యాక్సినేషన శాతం పెంచి మార్కులు కొట్టేయాలన్న యోచనలో ‘ప్రీ ’కాజ్‌ చర్యలు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గిపోయిందన్న భావనలో వ్యాక్సిన తీసుకునేందుకు ప్రజలు అంతగా ముందుకురాకపోతుండటంతో సిబ్బంది ఈ తరహా బాగోతానికి తెరలేపారన్న వాదన వినిపిస్తోంది. కానీ ఇప్పులు అంతగా ఆసక్తి చూపకపోయినా భవిష్యతలో కరోనా తీవ్రత మళ్లీ పెరిగి ప్రికాషన్‌ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తమ పరిస్థితేంటా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆనలైనలో వ్యాక్సిన తీసుకున్నట్టు వస్తే మళ్లీ వ్యాక్సిన వేయడం కుదరదని సిబ్బంది చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు దీనిపై అవగాహన ఉండటంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం అవేమి తెలియక వెనుదిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వందలసంఖ్యలోనే బాధితులున్నట్టుగా తెలుస్తోంది. 

రెండో డోసు వేసే సమయంలోనూ ఇదే పరిస్థితి

కరోనాతో ప్రాణనష్టం కలగకుండా ఉండేలా చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన అందించాలని భావించిన ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేసి, ఇంటింటికి సిబ్బందిని పంపి వ్యాక్సినేషన కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. కానీ మొదటి డోస్‌ నూరుశాతం పూర్తయిన క్రమంలో రెండో డోస్‌ను నూరుశాతం పూర్తి చేసే క్రమంలో నిర్లక్ష్యం చేసిన కొందరు సిబ్బంది వ్యాక్సిన వేయకుండానే వేసినట్టుగా నమోదు చేశారు. అందరికీ వ్యాక్సిన అందించాలన్న లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పేందుకు ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆధార్‌ కార్డులను తెప్పించుకుని వ్యాక్సినేషన పూర్తిగా అయినట్టుగా రికార్డుల్లో నమోదు చేశారని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేయగా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో నమోదుతో సంబంధం లేకుండా వ్యాక్సిన అందించేలా చర్యలు చేపట్టి వ్యాక్సినేషన కార్యక్రమాన్ని పూర్తిచేయించారు. 

ప్రైవేటుకు అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు..

వ్యాక్సినేషన శాతాన్ని పెంచుకునేందుకు అవకతవకలకు పాల్పడుతున్నారన్న వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తయితే ఆయా వ్యాక్సిన్లకు సంబంధించిన డోసులను, సామగ్రిని ప్రైవేటుకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. స్థానికంగా ఉండే ఆసుపత్రుల సిబ్బందితో కుమ్మక్కయి ఆయా డోసులను వారి ద్వారా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వ్యాక్సినేషన సమయంలో కోసం ప్రజలు బారులు తీరగా.. ఆ సమయంలో కొందరు ప్రైవేటు ద్వారా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఆయా వ్యక్తులు మళ్లీ ప్రికాషన డోసు కోసం ప్రైవేటును ఆశ్రయించినప్పుడు ప్రైవేటు వారు సంబంధిత ప్రభుత్వ సిబ్బంది నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లు వేసి సొమ్ములు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సిరంజిలు లాంటివి తమకు పరిచయమున్న ఆర్‌ఎంపీలకు విక్రయిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు కొందరికి వచ్చే సందేశాలు కూడా తమకు సంబంధం లేని పీహెచసీల నుంచి రావడం గమనార్హం. ఖమ్మం నగరంలో అత్యధికంగా ఒక పీహెచసీ నుంచే సందేశాలు వచ్చినట్టు సమాచారం. ఆయా సెంటర్ల వద్ద తమ ఆధార్‌కార్డు నెంబర్లు, ఫోననెంబర్లు ఎలా వెళ్లాయన్న సందిగ్ధంలో ప్రజలున్నారు. కాగా ఉన్నతాధికారులు స్పందించి ఈ దిశగా కూడా విచారణ సాగించాలని ప్రజలు కోరుతున్నారు. దీంతోపాటు గతంలో మాదిరిగా సర్టిఫికెట్‌లో తప్పుగా నమోదైన వారికి సైతం డోసులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-20T05:16:58+05:30 IST