ఢిల్లీ వీధిలో.. ఖమ్మం గ్రానైట్‌ ఠీవి!

ABN , First Publish Date - 2022-09-10T07:01:11+05:30 IST

ఢిల్లీ వీధిలో.. ఖమ్మం గ్రానైట్‌ ఠీవి!

ఢిల్లీ వీధిలో.. ఖమ్మం గ్రానైట్‌ ఠీవి!
ఖమ్మం గ్రానైట్‌తో రూపు దిద్దుకున్న నేతాజీ సుభా్‌ష చంద్రబోస్‌ విగ్రహం

నేతాజీ విగ్రహానికి ఏకశిలను అందించిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు 

ఖమ్మం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఢిల్లీ వీధిలో ఖమ్మం గ్రానైట్‌ ఠీవీగా నిలుచుంది. కర్తవ్యపథ్‌లో ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ విగ్రహానికి వినియోగించిన బ్లాక్‌ గ్రానైట్‌ రాయి ఖమ్మం నుంచే వెళ్లింది. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లిలోని తన గ్రానైట్‌ క్వారీనుంచి 280మెట్రిక్‌టన్నుల బరువున్న 32 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు, 8.5 అడుగుల వెడల్పున్న ఏకశిలను ఉచితంగా అందించారు. ఈ రాయిని 100అడుగులు పొడవైన 42టైర్ల ట్రాలీ ద్వారా తరలించారు. హైవేలో పలుచోట్ల అడ్డుగా ఉన్న టోల్‌ప్లాజాలను తాత్కాలికంగా తొలిగించి ఈ భారీ రాయిని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన ఆర్ట్స్‌(ఎంజీఎంఏ)కు చేర్చారు. మే2న ఖమ్మం నుంచి బయల్దేరి ఐదురాష్ట్రాల మీదుగా 1,665కి.మీ.దూరం ప్రయాణించి జూన 2న ఢిల్లీకి చేరిన తర్వాత అక్కడి అత్యంత ప్రతిభ కలిగిన శిల్పులు సుభా్‌షచంద్రబోస్‌ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని గురువారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ (రాజ్‌పథ్‌)లో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. బోస్‌ విగ్రహానికి ఖమ్మం బ్లాక్‌ గ్రానైట్‌ వినియోగంతో ఖమ్మంజిల్లా గ్రానైట్‌ పరిశ్రమకు మరింత గుర్తింపు వచ్చింది. గతేడాది కూడా వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ అకాడమీలో నెలకొల్పిన కార్గిల్‌ అమరజవాన్ల స్మారక స్తూపానికి ఏకశిల బ్లాక్‌గ్రానైట్‌ను కూడా ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం క్వారీనుంచి తరలించారు. ఆ స్తూపాన్ని కూడా ప్రధాని గతంలో ఆవిష్కరించారు. ఈరెండు బ్లాక్‌ గ్రానైట్‌ ఏకశిల రాళ్లను వద్దిరాజు రవిచంద్ర ఉచితంగానే అందించారు. ఖమ్మంజిల్లా నుంచి రవాణా అవుతున్న బ్లాక్‌ గ్రానైట్‌ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పలువురు ప్రముఖుల విగ్రహాలకు, స్తూపాలకు వినియోగిస్తున్నారు.

Read more