చింతగుప్పలో మావోయిస్టుల మెరుపుదాడి

ABN , First Publish Date - 2022-02-23T05:51:25+05:30 IST

చింతగుప్పలో మావోయిస్టుల మెరుపుదాడి

చింతగుప్పలో మావోయిస్టుల మెరుపుదాడి
దహనమైన ట్రాక్టర్లు

వంతెన పనుల వద్ద ఏడు వాహనాల దహనం

మూడు వాహనాలు, ఏడు సెల్‌ఫోన్ల అపహరణ

దుమ్ముగూడెం, ఫిబ్రవరి 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని చింతగుప్ప వంతెన పనుల వద్ద మావోయిస్టులు మంగళవారం మెరుపుదాడికి దిగారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశం వద్ద ఉన్న రెండు ఎక్స్‌కవేటర్లు, నాలుగు ట్రాక్టర్లు, ఒక కాంక్రీట్‌ మిక్సింగ్‌ వాహనాలను తగులబెట్టారు. చింతగుప్ప ఆదివాసీలకు చెందిన మూడు ట్రాక్టర్లను తమ వెంట తీసుకెళ్లారు. తాము చేయాలనుకున్న పనిని అర్ధగంటలోనే పూర్తి చేసి సమీప అడవుల్లోకి వెళ్లిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు వంద మందికి పైగా తుపాకులు, విల్లంబులు, గొడ్డళ్లు, కత్తులు ధరించిన మావోయిస్టులు మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో వంతెన పనుల వద్దకు వచ్చారు. వంతెన వద్ద మట్టి తోలుతున్న ట్రాక్టర్లను నిలిపారు. పనులు నిర్వహిస్తున్న కూలీలను సైతం అడ్డుకున్నారు. కూలీలు, ట్రాక్టరు డ్రైవర్లను బెదిరించి వంతెన పైకి తీసుకెళ్లిన మావోయిస్టులు చుట్టూ కాపలా కాశారు. మరి కొందరు మావోయిస్టులు వాహనాల ట్యాంకర్లను పగుల గొట్టి అందులోని డీజిల్‌ను వాహనాలపై పోసి, తాటాకులు వేసి నిప్పంటించారు. రెండు ట్రాక్టర్లు, ఒక మిక్సింగ్‌ యంత్రం ఎక్కువగా కాలిపోగా, మిగతా వాహనాలు పాక్షికంగా తగులబడ్డాయి. ఆ సమయంలో ట్రాక్టర్‌ యజమాని చంద్రయ్య ఈ విషయం తమ కుటుంబ సభ్యులకు చెప్పడానికి ప్రయత్నించగా, సాయుధుడైన ఒక మావోయిస్టు చంద్రయ్య మెడపై తుపాకీ మడమతో కొట్టి అతడిని సైతం తమ అధీనంలోకి తీసుకున్నారు. చింతగుప్ప సర్పంచ్‌ కట్టం కృష్ణ, పాయం రమేష్‌ ట్రాక్టర్లతోపాటు, కాంట్రాక్టర్‌కు చెందిన మరో రెండు ట్రాక్టర్లను దహనం చేశారు. అదే గ్రామానికి చెందిన ఉయికా చంద్రయ్య, ఇరకం శ్రీను, తుర్రం చంద్రయ్య ట్రాక్టర్లను మావోయిస్టులు తమవెంట  తీసుకెళ్లారు. ట్రాక్టర్లను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఎడ్లపల్లి రహదారివైపునకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారి వైపు నుంచి కాకుండా, సమీప అటవీప్రాంతంలోనుంచి మావోయిస్టులు రెండు మూడు దళాలుగా వంతెన పనుల వద్దకు వచ్చారు. సంఘటన అనంతరం మావోయిస్టులు కాలినడకనే తిరిగి అడవిలోకి వెళ్లగా, ట్రాక్టర్‌ ట్రక్కుల్లో ఎవరూ ప్రయాణం చేయలేదు. సంఘటనాస్థలంలో నిల్వ ఉన్న డీజిల్‌ను క్యాన్లలో నింపుకొని ట్రాక్టర్లపై వెంట తీసుకెళ్లారు. అంతేకాక వంతెన పనులు చేసే వారినుంచి ఏడు మొబైల్‌  ఫోన్లకు కూడా మావోయిస్టులు తీసుకెళ్లారు. కాగా సంఘనటకు పాల్పడింది మావోయిస్టు మిలీషియా సభ్యులుగా తెలుస్తుండగా వారు హిందీ, కోయ భాషల్లో మాట్లాడారు. అపహరణకు గురైన ట్రాక్టర్లలో రెండు కొత్తవి కాగా, వాటికి రిజిస్ట్రేషన్‌ కూడా కాలేదు. కాంట్రాక్టు పనులకు సంబంధం లేని తమ ట్రాక్టర్లను తిరిగి తమకు  ఇప్పగించాలని స్థానిక ఆదివాసీలు మావోయిస్టులను వేడుకుంటున్నారు. 

Read more