అన్నదాతల్లో మాండుస్‌ వణుకు

ABN , First Publish Date - 2022-12-09T23:31:23+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుఫాన్‌తో రైతులు ఆందోళనతో వణికిపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘామృతమై విపరీతమైన చలి, ఈదురుగాలులతో సన్నటి చినుకులు పడుతుండటంతో ధాన్యం రైతుల వెన్నులో వణుకు మొదలైంది.

అన్నదాతల్లో మాండుస్‌ వణుకు
వైరాలో ధాన్యాన్ని రాశులుగా చేసి పట్టాలు కప్పుతున్న రైతులు

వైరా/ కొణిజర్ల/ ఏన్కూరు/ కల్లూరు, డిసెంబరు 9: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుఫాన్‌తో రైతులు ఆందోళనతో వణికిపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘామృతమై విపరీతమైన చలి, ఈదురుగాలులతో సన్నటి చినుకులు పడుతుండటంతో ధాన్యం రైతుల వెన్నులో వణుకు మొదలైంది. మధిర, వైరా, కల్లూరులో వారంరోజుల నుంచి ముమ్మరంగా వరికోతలు జరుగుతున్నాయి. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు పొలాల్లోని కల్లాల్లో, రోడ్లపైన, వైరా వ్యవసాయ మార్కెట్‌యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. లక్షలాదిబస్తాల వరిధాన్యం ఆరబోసి ఉంది. ఈ పరిస్థితుల్లో సన్నటి చినుకులు పడుతుండటంతో రైతుల ఆందోళన చెప్పనలివికాకుండా ఉంది. ఇంటిల్లిపాది రైతులు, కూలీలు ట్రాక్టర్‌ డోజర్లతో ఆరబోసిన ధాన్యాన్ని పోగుచేసి పరధాపట్టాలు, టార్పాలిన్లు కప్పుతున్నారు. శుక్రవారం రాత్రి జల్లులు కురవడంతో రైతులు ధాన్యం తడవకుండా పట్టాలు కప్పారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో తమకు ఈ కష్టాలని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-12-09T23:31:24+05:30 IST