మధ్యాహ్న భోజనం బంద్‌

ABN , First Publish Date - 2022-07-06T05:19:46+05:30 IST

ఓ విద్యార్థి సంఘం బంద్‌కు పిలుపునివ్వటం.. ప్రభుత్వ పాఠశాల భోజన ఏజెన్సీ వంటను బంద్‌ చేసింది... ఫలితంగా విద్యార్థులకు ఆకలి భాదను మిగిల్చింది.

మధ్యాహ్న భోజనం బంద్‌
ఆకలితో హాస్టల్‌కు చేరుకున్న ప్రాఽథమిక పాఠశాల విద్యార్థులు

విద్యార్థి సంఘాల పిలుపుతో వంట ఏజెన్సీ నిర్వాహకుల డుమ్మా

 ఖమ్మం ప్రభుత్వ పాఠశాలల్లో 950మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్‌

 ఇంటికి వెళ్లి భోజనం చేసిన 300మంది 

 హాస్టల్‌లో మధ్యాహ్నం 2.30గంటలకు భోజనం చేసిన 650మంది 

 ఖమ్మంలో సంఘటన, స్పందించని అధికారులు

ఖమ్మంసంక్షేమవిభాగం, జూలై5: ఓ విద్యార్థి సంఘం బంద్‌కు పిలుపునివ్వటం.. ప్రభుత్వ పాఠశాల భోజన ఏజెన్సీ వంటను బంద్‌ చేసింది... ఫలితంగా విద్యార్థులకు ఆకలి భాదను మిగిల్చింది. ఈ సంఘటన మారుమూల మండలం, గ్రామం కాదండోయ్‌ సాక్షత్తు ఖమ్మం జిల్లా కేంద్రం నడివడ్డు ఎన్‌ఎస్‌పీ క్యాంపులోని ఎన్‌ఎస్‌సీ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకొంది. ఒక్కరు ఇద్దరు విద్యార్థులు కాదు ఏకంగా 950 మంది విద్యార్థులకు ఆకలితో ఇంటిబాట, సంక్షేమవసతిగృహాల బాట పట్టారు.

ఆరు వసతి గృహాలు

ఖమ్మంలోని ఎన్‌ఎస్‌సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో 950 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్స్‌కు సమీపంలో ఉన్న ఆరు  ప్రభుత్వ వసతిగృహాలైన ఎస్సీ బాలికలు ఏ మరియు బీ, ఆనంద నిలయం బాలికలు, ఎస్సీ బాలురు బీ మరియు సీ, ఆనంద నిలయం బాలురు సంక్షేమ వసతిగృహాలకు చెందిన 650మంది విద్యార్థులు చదువు తున్నారు. వీరితో పాటుగా గట్టయ్య సెంటర్‌, ఎన్‌ఎస్‌టీ రోడ్డు, బస్‌డిపో, ఎన్‌ఎస్‌పీ క్యాంపు, సరితా క్లినిక్‌ సెంటర్‌ ప్రాంతాలకు చెందిన మరో 300 మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి వచ్చి చదువుతున్నారు. ఆయా విద్యార్థులకు పాఠశాలల్లోని ఏజెన్సీ ద్వారా మధ్యాహ్నం భోజనం పెట్టాల్సి ఉంటుంది. అయితే మంగళవారం ఓ విద్యార్థి సంఘం బంద్‌కు పిలుపు నివ్వటంతో ఇదే సాకుగా భావించిన వంట ఏజెన్సీ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేయలేదు. ముందుగా పాఠశాల హెచ్‌ఎంకు సమాచారం ఇవ్వలేదు. తీరా భోజనం సమయం కాగానే ఈ రోజు పాఠశాల బంద్‌ చేశారు. భోజనం లేదని హెచ్‌ఎం విద్యార్థులను బడి నుంచి తిరిగి పంపారు.

మధ్యాహ్నం 2,30గంటలకు విద్యార్థులకు భోజనం

ప్రభుత్వ పాఠశాల నుంచి సంక్షేమ వసతిగృహాలకు చేరుకున్న విద్యార్థులు తమకు బడిలో భోజనం పెట్టలేదని సంక్షేమాధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన ఆరు ఎస్సీ సంక్షేమ వసతిగృహాలు సంక్షేమాధికారులు అప్పుడు భోజనాలు తయారు చేయించి మధ్యాహ్నం 2.30గంటలకు పిల్లలకు భోజనాలు వడ్డించారు. సంక్షేమవసతిగృహాల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం మధ్యాహ్న భోజనం కోసం ఆకలితో ఎదురు చూశారు. విద్యార్థులను సంక్షేమ వసతిగృహంలో చేర్పించేందుకు వచ్చిన తల్లి,దండ్రులు ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో 950 మంది విద్యార్థులకు భోజనాలు జాప్యం జరిగి ఇబ్బంది పడ్డా ఇటు విద్యాశాఖ, ఆటు సంక్షేమశాఖ జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవటం కొసమెరుపు. 

Read more