కళా సౌరభం.. సురభి నాటకం

ABN , First Publish Date - 2022-12-13T01:24:43+05:30 IST

మాయాబజార్‌, పాతాళ భైరవి సినిమాల తరహాలోని మాయలు, లవకుశ పద్యాలు

కళా సౌరభం.. సురభి నాటకం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వానరస ఉపేందర్‌

నేటినుంచి 19 వరకు ఖమ్మంలో నాటకోత్సవం

భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం సాంస్కృతికం, డిసెంబరు 12 : మాయాబజార్‌, పాతాళ భైరవి సినిమాల తరహాలోని మాయలు, లవకుశ పద్యాలు, బాలనాగమ్మ విస్మయాలు, తదితర రంగస్థల కళాసౌరభం ఆ సురభి నాటకం. అలాంటి నాటకోత్సవాలతో ఖమ్మం నగరం సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకోనుంది. మంగళవారం నుంచి ఏడు రోజులపాటు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ సురభినాటకాలను ప్రదర్శించనున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా రెండున్నరేళ్లుగా బహిరంగ ప్రదర్శనలకు నోచని సురభి నాటక సమాజం.. కరోనా కష్టకాలపు గడ్డు పరిస్థితిని ఎదిరించి ప్రేక్షకుల మధ్యకు రాబోతోంది. నాటక రంగంలో సురభి సంస్థది ఓ ప్రత్యేక స్థానం. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో సురభి నేటికీ సజీవంగా ఉందంటే.. అది ఆ సమాజం కళాకారుల గొప్పతనాన్ని రుజువు చేస్తోంది. గొంతెత్తి రాగయుక్తంగా పద్యాలు ఆలపించే కళాకారులు, డైలాగుల్లోని హావభావాలను ఒలికించే నేర్పరితనం సురభి నాటకానికి బలం. 1885వ సంవత్సరంలో కడప జిల్లా చక్రాయపేటలో ఆవిర్భవించిన సురభి నాటకానిది వందేళ్లపైబడిన ఘన రంగస్థల చరిత్ర. తొలుత తోలుబొమ్మలాట ప్రదర్శించే వీరు క్రమంగా రంగస్థల నాటకాల వైపు మళ్లారని చెబుతుంటారు. ఆంధ్రనాటక కళోధ్దారక అనే బిరుదు పొందిన వనారస గోవిందరావు సురభి ససం్థకు మూలమని, సురభి కళాకారులు పుట్టుకతోనే కళాకారులుగా పుడతారని అభిమానుల అభిప్రాయం. వారిలో గర్భం దాల్చిన వారు, చిన్నపిల్లలు కూడా వారికి తగిన పాత్రలను పోషించడం వారికి కళపై ఉన్న మక్కువకు నిదర్శనం. ఒక్కో నాటక సమాజంలో 30మంది వరకు కళాకారులు ఉంటారు. వారే దాదాపు పది రకాల నాటకాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు. వీరి సొంత ప్రాంతం కడప జిల్లా అయినా.. 1991 నుంచి హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. రంగస్థల నాటకాల విలువ తెలిసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వీరికి సొంత నివాసాలు ఇచ్చారు. ఇక వీరిలో యువతీ యువకులను ఇచ్చిపుచ్చుకుని వివాహాలు చేస్తారు. వీరికి ఒక మొబైల్‌ థియేటర్‌ సదుపాయం కూడా ఉంది. కరోనా సమయంలో నాటకాలను నేరుగా ప్రదర్శించే వీలులేక పోవడం, విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వీరు తమ థియేటర్లలో నాటకాలు ప్రదర్శించి వాటిని ఆనలైనలో ప్రసారం చేశారు.

నాటకోత్సవాలు జరగనున్నాయిలా..

మంగళవారం నుంచి 19వతేదీ వరకు జరిగే నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం మాయాబజార్‌, 14న పాతాళ భైరవి, 15న లవకుశ, 16న సతీసావిత్రి, 17న బాలనాగమ్మ, 18న భక్తప్రహ్లాద, 19న శ్రీకృష్ణ లీలలు నాటకాలను ప్రదర్శించనున్నారు.

నాటకరంగాన్ని ఆదరించాలి

వానరస ఉపేందర్‌, విజయభారతి నాట్యమండలి కార్యదర్శి

ఘన చరిత్రగల సురభినాటకాలను ప్రేక్షకదేవుళ్లు ఆదరించి బతికించాలని విజయభారతి నాట్యమండలి కార్యదర్శి వానరస ఉపేందర్‌ కోరారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో సహబృందాల ప్రతినిధులు సురభి రామ్మోహన, సుబ్బారావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 137 సంత్సరాల చరిత్రగల సురభి నాటకాల్లో ఉత్తమ ఆదరణగల ఏడు నాటకాలను వారం రోజుల పాటు ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ప్రారంభిస్తారని, నగరంలోని కళా సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఉచితంగా ప్రదర్శించే నటాకాలకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Updated Date - 2022-12-13T01:24:44+05:30 IST