పోడు హక్కు పత్రాల బాధ్యత ఐటీడీఏదే

ABN , First Publish Date - 2022-12-10T01:12:01+05:30 IST

జిల్లాలో పోడుభూముల దరఖాస్తులు సర్వే ప్రక్రియ పూర్తయిందని, అడవుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని అటవీశాఖ ఖమ్మం జిల్లా అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌ పేర్కొన్నారు.

పోడు హక్కు పత్రాల బాధ్యత ఐటీడీఏదే

మొదటి విడత గ్రామసర్వేలు పూర్తిచేశాం

జిల్లాలో అడవుల సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పలు చోట్ల ఫారెస్టు ఎకో టూరిజం ప్రాజెక్టులు

జంతువులను వేటాడితే కఠిన చర్యలు

అటవీశాఖ ఖమ్మం జిల్లా అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌

ఖమ్మం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : జిల్లాలో పోడుభూముల దరఖాస్తులు సర్వే ప్రక్రియ పూర్తయిందని, అడవుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని అటవీశాఖ ఖమ్మం జిల్లా అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌ పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా జిల్లాలో అటవీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని, అందుకు తీసుకుంటున్న కార్యాచరణను ఆయన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కిచ్చిన ఇంటర్యూలో వివరించారు.

ఆంధ్రజ్యోతి: పోడుభూముల సర్వే ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?

డీఎ్‌ఫవో: జిల్లాలో మొత్తం 18,487 దరఖాస్తులు వచ్చాయి. 132 గ్రామాల్లో దరఖాస్తులు పరిశీలన అనంతరం గ్రామసభల ద్వారా సర్వేపూర్తిచేశాం. 2005 డిసెంబరు 13లోపు పోడుభూముల సాగులో ఉన్న వారికి మాత్రమే పట్టాలిచ్చేందుకు అర్హత ఉంది. గిరిజనేతరులైదే మూడుతరాల పాటు అటవీభూముల్లో సాగుచేసుకుంటున్నట్టు ఆధారాలు చూపించాలి. వారికి మాత్రమే పట్టాలు అందుతాయి.

ఆంధ్రజ్యోతి: పోడుభూములకు హక్కుపట్టాలు ఇచ్చే బాధ్యత మీదేనా?

డీఎ్‌ఫవో: ఇది మూడుదశల్లో ఉంది. దరఖాస్తులన్నీ గ్రామస్థాయిలో గ్రామసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది. రెండో దశలో ఆర్డీవో స్థాయిలో కమిటీ పరిశీలన జరుగుతుంది. మూడో దశ కింద జిల్లా కలెక్టర్‌స్థాయిలో సమీక్షించి అర్హులైన వారిని ఎంపికచేస్తారు వీరికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాత్రమే హక్కు పత్రాలు ఇస్తారు. అటవీశాఖకు పోడుభూముల పట్టాలు ఇచ్చే అధికారం లేదు.

ఆంధ్రజ్యోతి: 2005 తర్వాత కూడా పోడుభూములుగా మార్చిన వారికి హక్కు పత్రాలు ఇచ్చే అవకాశం లేదా?

డీఎ్‌ఫవో: ఇదంతా మాకు సంబంధం లేదు. అంతా ఐటీడీఏనే చూసుకుంటుంది. శాటిలైట్‌ విధానంలో గూగుల్‌ మ్యాపింగ్‌ ద్వారా 2005 డిసెంబరు 13కంటే ముందు పోడుసాగులో ఉన్న వారికి మాత్రమే నిబంధనల ప్రకారం హక్కుపత్రాలు మంజూరవుతాయి. ఆతర్వాత ఆక్రమణలు జరిగినట్టు ఉంటే పట్టాలు ఇవ్వడం చట్టవిరుద్ధమే అవుతుంది. అటవీభూములకు సంబంధించి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పకడ్బందీ రికార్డు ఉంది. ఏ గ్రామాలు అడవుల్లో ఉన్నాయి, ఏగ్రామాలు ఆ అడవుల్లో లేవు. కొత్తగా ఆక్రమణకు గురైన గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయం కూడా అటవీశాఖ రికార్డుల్లో ఇప్పటికే నమోదు చేశాం. దీనిని అనుసరించే అటవీశాఖ కార్యాచరణ ఉంటుంది.

ఆంధ్రజ్యోతి: అటవీభూముల్లోని గిరిజనేతరులకు హక్కు పత్రాలు వచ్చే అవకాశం ఉందా?

డీఎ్‌ఫవో: ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో 9500 వరకు గిరిజనులవి ఉండగా, మిగిలిన గిరిజనేతరులవి. ఇంచుమించుగా సగం ఎస్టీవి, సగం గిరిజనేతరులవి. మూడుతరాల పాటు అడవుల్లో పోడుచేసుకుంటున్నట్టు ఉంటేనే వారికి హక్కు పత్రాలు పొందే సదుపాయం ఉంది. అయితే అటవీశాఖ రికార్డుల ప్రకారం ఎక్కువమంది కొత్తగా అడువుల భూములు సాగుచేసుకుంటున్న వారే గిరిజనేతరులున్నారు. మూడుతరాలనుంచి అడవుల్లో ఉన్న సంఖ్య నామమాత్రం.

ఆంధ్రజ్యోతి : గొత్తికోయల గ్రామాల పరిస్థితి ఏమిటి? వారికి హక్కు పత్రాలు ఇస్తారా లేదా?

డీఎ్‌ఫవో: జిల్లాలో మూడుచోట్ల గొత్తికోయల గ్రామాలున్నాయి. 2005 తర్వాతనే అడవుల్లోకి వచ్చి నివాసాలు ఏర్పాటుచేసుకుంటున్నారు.ఛత్తీ్‌సగఢ్‌ లోని దంతెవాడనుంచి ఇక్కడ ఉన్నారు. కొత్తమేడేపల్లి, కారుమద్దుపల్లి, తాళ్లపెంట, చోడవరం గ్రామాల్లో గొత్తికోయల గ్రామాలున్నాయి. ఈ గ్రామాలు 2005తర్వాత వలస వచ్చినవే ఉన్నాయి. ఈ గ్రామాలపై నిఘా ఉంచాం. పోడుహక్కు పత్రాల నిర్ణయం ఐటీడీఏ తీసుకోవాల్సి ఉంటుంది. వీరిని ఛత్తీ్‌సగఢ్‌కు తిప్పి పంపేందుకు న్యాయపరంగా కొన్ని ఇబ్బందులున్నాయి.

ఆంధ్రజ్యోతి: జిల్లాలో అడవుల అభివృద్ధికి అటవీశాఖ అధికారిగా తీసుకుంటున్న చర్యలు?

డీఎ్‌ఫవో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పోలిస్తే ఖమ్మంజిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువ. 63వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 17,400 ఎకరాలు ఆక్రమణలో ఉంది. పాత అడవులను అభివృద్ధి చేయడం కొత్తగా అటవీప్రాంతంలోని ఖాళీ భూముల్లో ప్లాంటేషన వేసి అడువుల విస్తరణతోపాటు అర్బన ప్రాజెక్టుకునూడా అభివృద్ధి చేస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : జిల్లాలో అటవీశాఖ ఎకో ప్రాజెక్టులు ప్రతిపాదనలు చేసిందా?

డీఎ్‌ఫవో : జిల్లాలో అటవీశాఖ పర్యాటకులను ఆకట్టుకొనేందుకు ఎకో ప్రాజెక్టులు రూపకల్పన చేసింది. అందులో భాగంగా తాళ్లపెంట, బ్రహ్మళకుంట వద్ద రూ.2కోట్లతో ప్రతిపాదనలు చేశాం. అక్కడ రిసార్ట్సుతో పాటు బోటింగ్‌, ఫుడ్‌కోర్టు, పిల్లలు ఆడుకునేందుకు పార్కు లాంటి సౌకర్యాలుకూడా కల్పించబోతున్నాం. ఇందుకు సంబంధించి నిధులు రావాల్సి ఉంది. అలాగే గుబ్బలమంగమ్మ గుట్టలవద్ద వద్దకూడా ఎకో ప్రాజెక్టు రూపొందించాం. అలాగే మధిర సమీంపలో కూడా అటవీప్రాంతంలో ఎకో పార్కును అభివృద్ధికి ప్రతిపాదించాం. అలాగే ఖమ్మం వెలుగుమట్ల ఫారెస్టులో కూడా పర్యాటకలను పెద్ద ఎత్తున ఆకట్టుకొనేందుకు ప్రతిపాదనలు చేయబోతున్నాం. ఉదయంనుంచి సాయంత్రం వరకు కుటుంబసమేతంగా వచ్చి పిల్లలు అడవులు, పర్యావరణం పట్ల అవగాహన పెంచుకొనేలా ఈ పార్కును తీర్చిదిద్దబోతున్నాం.

ఆంధ్రజ్యోతి : జిల్లాలో జంతువుల వేట జరుగుతుంది. దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు?

డీఎ్‌ఫవో : జిల్లాలో అటవీశాఖ పరిధిలో కనకగిరి గుట్టల ప్రాంతంలో రెండు చిరుతలను గుర్తించాం. అలాగే ఒక పెద్దపులి కూడా వచ్చి వెళ్లింది. ప్రస్తుతం జిల్లాలో ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, అడవిపందులు, కొండగొర్రెల, అడవిదున్నలు, పలురకాల జంతువులున్నాయి. ఎవరైనా జంతవులను వేటాడితే వారిపై కఠినచర్యలు వప్పవు. అడవిపందుల వేట కూడా నేరం. మైదాన ప్రాంతంలో రైతుల పంటల పొలాలకు నష్టం చేస్తే సర్పంచకు ఫిర్యాదుచేయాలి. సర్పంచ అటవీశాఖకు తెలియచేస్తే అనుమతి పొందిన గనషూటర్‌ను పంపి అటవీశాఖ పర్యవేక్షణలోనే అడవిపందులను అరికట్టి పంటలను కాపాడతాం. కానీ వేటగాళ్లు సొంతంగా అడవిపందులను చంపితే కేసవుతుందన్న విషయం గుర్తించుకోవాలి.

Updated Date - 2022-12-10T01:12:03+05:30 IST